డబుల్‌.. మోడల్‌

1 May, 2019 07:51 IST|Sakshi

ఆదర్శంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు  

తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ కార్యాచరణ  

పకడ్బందీగా చెత్త నిర్వహణ, పచ్చదనం పెంపు   

జీరో సాలిడ్, లిక్విడ్‌ వేస్ట్‌ ప్రాంతాలుగా ఏర్పాటు   

నిర్మాణమయ్యే నాటికి పూర్తిస్థాయి సదుపాయాలు  

ప్రణాళిక రూపకల్పనకు కమిటీ నియామకం  

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. విద్యుత్, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు, చెత్త నిర్వహణ, పచ్చదనం పెంపు, పర్యావరణహిత పద్ధతుల అమలుపై దృష్టి సారించింది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, చెత్త నిర్వహణను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకుగాను తడి, పొడి చెత్తను వేరు చేయడం మొదలు అక్కడే సేంద్రియ ఎరువుల తయారీ, ఘన వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకోనుంది. అదే విధంగా మురుగు నీటితో పరిసరాలు అపరిశుభ్రం కాకుండా ఉండేందుకు ‘డబుల్‌’ కాలనీలను జీరో సాలిడ్‌ వేస్ట్, జీరో లిక్విడ్‌ వేస్ట్‌ ప్రాంతాలుగా తీర్చిదిద్దనుంది.

ఇందుకు అవసరమైన మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను రూపొందించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ (హౌసింగ్‌), జలమండలి, జేఎన్‌టీయూ, ఈటీపీఆర్‌ఐ, టీఎస్‌ఐఐసీల నుంచి ప్రతినిధులు, జీహెచ్‌ఎంసీలోని యూబీడీ, యూసీడీ విభాగాల అధికారులు, జోనల్‌ కమిషనర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ జీరో సాలిడ్‌ వేస్ట్, జీరో లిక్విడ్‌ వేస్ట్‌ అమలుకు సంబంధించి వివిధ మాడ్యూల్స్‌లో ఆచరణాత్మక కార్యాచరణను రూపొందించి 15 రోజుల్లోగా నివేదిక అందజేయాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సంఖ్యకు అనుగుణంగా ఈ కార్యాచరణ ఉండాలి. 500, 1,000, 2,000, 4,000, 15,000 ఇలా ఇళ్ల సంఖ్యకు అనుగుణంగా వీలైన కార్యాచరణను రూపొందించాలి. ఈ కాలనీల్లో వివిధ ప్రాంతాలు, సామాజిక వర్గాల ప్రజలు నివాసం ఉండనున్న నేపథ్యంలో అందరూ ఆచరించే రీతిలో ప్రణాళిక ఉండాలని కమిషనర్‌ సూచించారు. 

రూ.616 కోట్లు...  
ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికే రహదారులు, తాగునీరు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవాలని కమిషనర్‌ సూచించారు.ఇందుకుగాను రూ.616 కోట్లతో ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు కమిషనర్‌కు వివరించారు. డబుల్‌ ఇళ్ల కాలనీల్లో లిఫ్టులు, పార్కుల నిర్వహణ, స్థానికంగా సేంద్రియ ఎరువుల తయారీ వంటి వాటికి ఎలాంటి విధానాలు అమలు చేయాలనే అంశాలపై కమిటీ తగు సూచనలు చేయనుంది. ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌కు సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన ఏర్పాట్లుండాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.   

మరి నిధులు?
కార్యాచరణ ప్రణాళికపై శ్రద్ధ చూపడం బాగానే ఉన్నప్పటికీ... గ్రేటర్‌లో నిర్మిస్తున్న లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎప్పటికి పూర్తవుతాయనేది పెద్ద పజిల్‌గా మారింది. వాస్తవానికి మార్చి నాటికే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమవుతోంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకుసాగడం లేదు. ఇప్పటి వరకు కేవలం 612 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. మరో 23వేల ఇళ్లు తుది దశలో ఉన్నాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం రూ.8,598 కోట్లకు గాను ప్రభుత్వ నుంచి అందిన నిధులు కేవలం రూ.3,230 కోట్లు మాత్రమే. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.600 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇంకా అందాల్సిన నిధులు రూ.5,368 కోట్లు  విడుదలైతేనే ఏడాదిలోగా లక్ష ఇళ్లనూ అందుబాటులోకి తేగలమని ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. నెలకు దాదాపు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల చెల్లింపులు జరిగినా ఏడాదిలోగా లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తికాగలదని ఇంజినీర్లు కమిషనర్‌ దానకిశోర్‌కు వివరించినట్లు సమాచారం. మంగళవారం కొల్లూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పనుల పురోగతిని పరిశీలించిన కమిషనర్‌ డబుల్‌ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. డబుల్‌ ఇళ్ల నిర్మాణంలో జాప్యానికి కారణాలను వివరిస్తూ అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌(హౌసింగ్‌) సురేశ్‌కుమార్, ఎస్‌ఈ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు