పూడిక పూర్తయ్యేనా?

29 May, 2019 08:07 IST|Sakshi

సమీపిస్తున్న వర్షాకాలం  

ఈసారి చేయాల్సింది 800 కి.మీ  

ఇప్పటికీ పూర్తయింది 465 కి.మీ  

ప్రతిఏటా ఇదే తంతు  

సాక్షి, సిటీబ్యూరో: మరికొన్ని రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. కానీ ప్రతిఏటా మాదిరే ఈసారీ పూడికతీత పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. వర్షాలు పడేలోపు పనులు పూర్తవుతాయో లేదో కూడా అనుమానంగానే ఉంది. వర్షాకాలానికి ముందే పూడికతీత పనులు పూర్తి చేస్తామని అధికారులు ప్రతిసారీ చెబుతున్నప్పటికీ... అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. మే ముగుస్తున్న నేపథ్యంలో కనీసం జూన్‌ 7లోగానైనా పూడికతీత పనులు పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే గడువులోగా పూడికతీత పూర్తవడం కష్టంగానే కనిపిస్తోంది. నెలల తరబడి పనులు పూర్తి చేయని అధికారులు... ఈ పది రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో దాదాపు 800 కి.మీ మేర నాలాల్లో పూడికతీత పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 465 కి.మీ మేర పనులే జరిగాయి.

నగరంలో వర్షాకాలంలో కాలనీలు, రహదారులు జలమయం కావడానికి ప్రధాన కారణం... వరద నీరు వెళ్లాల్సిన నాలాల్లో పూడిక పేరుకుపోవడమే. వర్షాకాలం లోపు పూడికతీత పనులు పూర్తయితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఏ సంవత్సరంలోనూ సకాలంలో పనులు పూర్తి కావడం లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రతిఏటా జనవరి/ఫిబ్రవరిలోనే పూడికతీతకు టెండర్లు పిలిచి ఏప్రిల్‌/మే లోగా పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ... ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేరు. ఈ పనులు చేసే కాంట్రాక్టర్లు, నాలాల్లో దిగి పూడిక తొలగించే కార్మికులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. రెండేళ్ల క్రితం పూడికతీత పేరుతో చేయని పనులు చూపిన కాంట్రాక్టర్లు, ఇంజినీర్లపై కేసులు నమోదు కావడంతో ఈ పనులంటేనే
జడుసుకుంటున్నారు.  

అప్రమత్తం...  
రెండేళ్ల క్రితం సెంట్రల్‌ జోన్‌లో బిల్లుల చెల్లింపు సమయంలో పూడికను తరలించిన వాహనాలపై ఆడిట్‌ అధికారులకు అనుమానం రావడంతో విచారణ జరపగా... అవి ద్విచక్ర వాహనాలు, కార్ల నంబర్లని తేలడంతో అవాక్కయ్యారు. వాటిల్లో పూడిక తరలింపు అసాధ్యంకావడంతో విచారణ జరపగా కాంట్రాక్టర్లఅరెస్టులు, ఇంజినీర్ల సస్పెన్షన్లుజరిగాయి.
ఈసారి పూడికను తరలించే వాహనాలకు అవి పూడిక తరలించే వాహనాలని తెలిసేలా పెద్ద అక్షరాలతో రాసి అంటించాలని ఆదేశించారు. సీసీ కెమెరాల్లో సైతం అక్షరాలు కనపడేలా ఉండేందుకు నిర్ణీత సైజుకు తగ్గకుండా అక్షరాలుండాలని నిర్దేశించారు.   

మరిన్ని వార్తలు