రూల్స్‌ ఈజీ

19 Jul, 2019 10:43 IST|Sakshi

కొత్త మున్సిపల్‌ చట్టం బాటలోనే జీహెచ్‌ఎంసీ  

అనుకూలంగా టౌన్‌ప్లానింగ్‌ రూల్స్‌   

త్వరలో నూతన చట్టం రూపకల్పన   

సాక్షి, సిటీబ్యూరో: మున్సిపాలిటీలు,కార్పొరేషన్ల కోసం ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మున్సిపల్‌ చట్టం మేరకు భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులు ప్రజలు, బిల్డర్లకు అనుకూలంగాఉండడంతో... గ్రేటర్‌ హైదరాబాద్‌కోసం త్వరలో రూపొందించనున్నజీహెచ్‌ఎంసీ చట్టంలోనూ టౌన్‌ప్లానింగ్‌ రూల్స్‌ అందరికీ సదుపాయంగా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త మున్సిపల్‌ చట్టం మేరకు 75 చ.మీ (దాదాపు 90 గజాలు)లోపు ఇళ్లు నిర్మించుకునేవారు ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. నామమాత్రంగా రూపాయి ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. నిర్మాణం పూర్తయ్యాక కూడా ఓసీ అవసరం లేదు. 10 మీటర్ల ఎత్తులోపు జీప్లస్‌ 1 అంతస్తు వరకు ఈ సదుపాయం ఉంది.

అంతేకాకుండా 500 చ.మీ లోపు నివాస గృహాలకు ఇంటి యజమాని లేదా నిర్మాణదారు సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ (స్వీయ ధ్రువీకరణ) సరిపోతుంది. నగరానికి సంబంధించి త్వరలో రూపొందించనున్న జీహెచ్‌ఎంసీ నూతన చట్ట ముసాయిదాలోనూ ఇలాంటి నిబంధనలే ఉండే అవకాశం ఉందని, నగర పరిస్థితుల దృష్ట్యా 100 గజాల్లోపు స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారికి  నిర్మాణ అనుమతి నుంచి మినహాయింపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంకా 200 చ.మీ వరకు మార్టిగేజ్‌ అవసరం లేదు. 200–500 చ.మీ  వరకు ఓసీ కూడా స్వీయ సర్టిఫికేషన్‌ సరిపోతుంది. అయితే ఉల్లంఘనలుంటే మాత్రం సంబంధిత ఆర్కిటెక్ట్‌ లైసెన్సు రద్దవుతుంది. 500 చ.మీ మించిన వాటికి సింగిల్‌విండో ద్వారా అనుమతుల జారీ ఇప్పటికే ప్రారంభమైంది. ఇలాంటి వాటికి కొత్త నిబంధన మేరకు 10 రోజుల్లోగా దరఖాస్తుకు సంబంధించి అన్ని పత్రాలు సవ్యంగా ఉన్నదీ? లేనిదీ? సమాచారం తెలపడంతో పాటు 21 రోజుల్లోగా అనుమతించాల్సి ఉంటుంది. లేని పక్షంలో అనుమతిచ్చినట్లుగానే పరిగణించవచ్చు. 

ఉల్లంఘనలపై కఠిన చర్యలు..  
మున్సిపల్‌ చట్టం మేరకు మాస్టర్‌ప్లాన్, బిల్డింగ్‌ రూల్స్‌కు లోబడి మాత్రమే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించినా, తప్పుడు ప్రకటనలతో స్వీయ ధ్రువీకరణ పొందినా యజమానితో పాటు ఆర్కిటెక్ట్‌పై కూడా కఠిన చర్యలుంటాయి. వీటిలో మూడేళ్ల వరకు జైలు శిక్ష, పెనాల్టీ, నోటీసులు లేకుండా కూల్చివేయడం, సీలు వేయడం తదితర చర్యలు ఉన్నాయి. దీంతో అక్రమ నిర్మాణాలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి. అనుమతి పొందిన భవనాలను మాత్రమే రిజిస్ట్రేషన్‌ శాఖ రిజిస్ట్రేషన్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో నగరానికి సంబంధించి త్వరలో రూపొందనున్న టౌన్‌ప్లానింగ్‌ నిబంధనలతో సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు