గ్రేటర్‌లో బలోపేతమవుదాం

20 Oct, 2014 00:53 IST|Sakshi
గ్రేటర్‌లో బలోపేతమవుదాం
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల యుద్ధానికి సిద్ధం
  •  నగరానికి వైఎస్ చేసినంత మేలు మరెవరూ చేయలేదు
  •  పార్టీ హైదరాబాద్ జిల్లా సమావేశంలో పొంగులేటి
  • సాక్షి, సిటీబ్యూరో: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాల సాధనకు, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షుడు ఆదం విజయ్ కుమార్ అధ్యక్షతన  జరిగింది. ఈ సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ గ్రేటర్‌లో పార్టీని బలోపేతం చేద్దామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

    నగరానికి వైఎస్సార్ చేసినంత మేలు ఎవరూ చేయలేదని గుర్తు చేశారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ పాలన ముందు, వెనుక సీఎంలుగా పనిచేసిన వారితో వైఎస్ పాలనను ప్రజలు పోల్చుకుంటున్నారని తెలిపారు. నాయకులు, కార్యకర్తల సలహామేరకు నడుచుకుంటానని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. బస్తీల్లో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకోవాలని, సమస్యలపై పోరాడాలని సూచించారు.

    జీహెచ్‌ఎంసీలో వైసీపీ సత్తా చూపిద్దామన్నారు. సంస్థాగతంగా పార్టీని బస్తీ నుంచి గ్రేటర్ స్థాయి వరకూ బలోపేతం చేద్దామన్నారు. శ్రీనివాసరెడ్డి ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సీనియర్ నేత గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధే వైసీపీ లక్ష్యమన్నారు. మైనార్టీ నేత రెహ్మాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సమస్యలపై అందరం ఏకమై పోరాటం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ లోటస్ పాండ్‌లోని మన కార్యాలయానికి వచ్చి మద్దతు కోరే రోజు వస్తుందన్నారు.
     
    స్టేట్ కమిటీ సభ్యుడు నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఖమ్మం ఎంపీ, ఎమ్మెల్యేలను చూసి తెలంగాణలో వైసీపీ బలోపేతం అవుతుందన్న భరోసా వచ్చిందన్నారు. నగర ప్రజలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అందుబాటులో ఉంటారని చెప్పారు. ఏ సమస్య వచ్చినా ఆయన తలుపు తట్టవచ్చన్నారు. మరో సభ్యుడు కె. శివకుమార్ మాట్లాడుతూ వైసీపీ తిరుగులేని శక్తిగా ఎదగాలంటే గ్రేటర్ ఎన్నికల్లో గెలవక తప్పదన్నారు.  పార్టీ నేత వైఎస్ షర్మిల త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు.

    గ్రేటర్ ఎన్నికల వాయిదాకు టీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందన్నారు. కారు పంక్చర్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కార్పొరేటర్లుగా గెలిచి రెండు మేయర్ స్థానాలను దక్కించుకుందామని పిలుపునిచ్చారు. వైసీపీ గ్రేటర్ అధ్యక్షుడు ఆదం విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒక్కొక్క డివిజన్‌కు 20కు పైబడి బూత్ కమిటీలు వేయాలని కోరారు. పనిచేస్తేనే ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. పింఛన్లు రాక, విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు.

    ఈ సమస్యల పరిష్కారానికి పోరాటం చేద్దామన్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర పార్టీ నేతలను పార్టీ ట్రేడ్‌యూనియన్ సిటీ ప్రెసిడెంట్ కరుణా శివకుమార్ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ కమిటీ సభ్యుడు కొండా రాఘవరెడ్డి తదితరులు మాట్లాడారు. గ్రేటర్ నాయకులు బి.మోహన్ కుమార్, రవికుమార్, మహమ్మద్, క్రిస్టోలైట్, టి. శ్రీనివాస్, షేక్ కరీముల్లా, శ్యామల, లక్ష్మీ, విజయ్‌రాజ్, మహేశ్ యాదవ్, గాయకుడు ఎం. రవి, మేరీ, కె. ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు