ఒక్క క్షణం..కలకలం

3 Jun, 2020 06:50 IST|Sakshi
గన్‌పార్క్‌ వద్ద సీఎం కాన్వాయ్‌ని అడ్డగించిన దృశ్యం

సీఎం కారును అడ్డగించిన యువకుడు

భారీ బందోబస్తు.. కళ్లు గప్పి ముందుకు

జీహెచ్‌ఎంసీ ఉద్యోగి రూపంలో వచ్చి...

ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలంటూ వేడుకోలు

సాక్షి, సిటీబ్యూరో: ముఖ్యమంత్రి రాక కోసం..కట్టుదిట్టమైన భారీ భద్రత. చీమ చిటుక్కుమన్నా వెంటనే తెలిసేలా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం. అడుగడుగునా పోలీసుల మోహరింపు.అయినా..మంగళవారం గన్‌పార్క్‌ వద్ద.. ఒక్క సారిగా కలకలం రేగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి తిరిగి వెళుతున్న సీఎం కేసీఆర్‌ వాహనాన్ని జీహెచ్‌ఎంసీ ఉద్యోగి రూపంలో వేచి ఉన్న హన్మంతునాయక్‌ అనే యువకుడు అడ్డుకున్న తీరు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని చింతచెట్టుతండాకు చెందిన హన్మంతునాయక్‌(28) డిగ్రీ పూర్తి చేసి ఒకసారి ఎస్‌ఐ పరీక్షలకు కూడా హాజరయ్యాడు. (సీఎంకు కానుకగా తెలంగాణ యాపిల్‌ తొలి కాత.. )

గత మూడునెలలుగా జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన డ్రైవర్‌గా చేరి విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా కారణంగా చాలాకాలంగా సెలవులో ఉన్న హన్మంతు వారం క్రితమే విధుల్లో చేరి, ఈ రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లి సంతకం పెట్టి అధికారులకు తెలియకుండానే గన్‌పార్క్‌కు చేరుకున్నాడు. అయితే సీఎం రాక సందర్భంలో వర్షం వస్తే ఆయనకు గొడుకుపట్టే నిమిత్తం ఇద్దరు జీహెచ్‌ఎంసీ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచటంతో వారి పక్కనే హన్మంతు వెళ్లి నిల్చుని సీఎం కోసం వెయిట్‌ చేశాడు. సీఎం నివాళి అర్పించి వాహనంలో ఎక్కి కూర్చున్న తర్వాత వాహనం పది మీటర్ల దూరం ప్రయాణించి అసెంబ్లీ వైపు మళుతున్న సమయంలో హఠాత్తుగా ‘ఉద్యోగం, డబుల్‌ బెడ్రూం ఇల్లు కావాలి’ అంటూ అరుస్తూ ...వాహనానికి అడ్డంపడిపోయాడు. ఊహించని పరిణామంతో క్షణం పాటు తత్తరపాటుకు గురైన సిబ్బంది హన్మంతును పక్కకు లాగి సీఎం వాహనాన్ని ముందుకు పంపారు.

స్వగ్రామంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తే...
ఎల్బీనగర్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్న హన్మంతుకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. స్వగ్రామంలో ఆయన టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా పనిచేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇళ్లు కావాలంటూ హన్మంతు ఏకంగా సీఎం కాన్వాయ్‌నే అడ్డుకోవటంతో ఉన్న ఉద్యోగం కూడా ఊడే పరిస్థితి నెలకొంది. హన్మంతును అదుపులోకి తీసుకున్న పోలీస్‌లు అతన్ని సుదీర్ఘంగా ప్రశిస్తున్నారు. రాత్రి వరకూ కేసు నమోదు చేయలేదు. జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం అతన్ని తొలగిస్తున్నట్లు కూడా ప్రకటన చేయకుండా ఉన్నత స్థాయి నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంగా మంగళవారం  యంత్రాంగాన్ని కలవరపాటుకు గురి చేసిన ఈ ఘటనలో పోలీస్‌ల భద్రతా వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా