ప్లాస్టిక్‌ పారిపోలె!

11 Oct, 2019 13:23 IST|Sakshi

గ్రేటర్‌లో అమలుకు నోచని నిషేధం  

ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలం  

సీఎం ప్రకటనతోనైనా పరిస్థితి మారేనా?

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ప్లాస్టిక్‌ నిషేధం ప్రకటనలకే పరిమితమవుతోంది. జీహెచ్‌ఎంసీ ఏళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ అమలులో విఫలమవుతోంది. బండ కార్తీకరెడ్డి మేయర్‌గా ఉన్నప్పుడు నిషేధానికి బీజం పడినప్పటికీ వివిధ కారణాలతోఅటకెక్కింది. పూర్తిస్థాయి నిషేధం కాస్తా... తర్వాత 40 మైక్రాన్లకు పరిమితమైంది. అనంతరం దాన్ని 50 మైక్రాన్లకు పెంచారు. గతేడాది జూన్‌లో పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో ప్లాస్టిక్‌వినియోగాన్ని తగ్గిస్తామని ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా ప్రకటించాయి. దీని అమలు, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణకు తగిన కార్యాచరణతో ముందుకెళ్లాలనే లక్ష్యంతో డిసెంబర్‌లో మరోసారి కార్యక్రమం నిర్వహించాయి.  ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్ట్రాటెజీస్‌ (ఐజీఈఎస్‌) సహకారంతో  దీన్ని నిర్వహిస్తామని తెలిపాయి.

ఇక్లీ సౌత్‌ ఏసియా సంస్థ కూడా ఈ కార్యక్రమ అమలులో ప్రధాన భాగస్వామిగా ఉంది. సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడంతో పాటు రీసైకిల్‌ ప్లాస్టిక్‌నే వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ప్రకటించాయి. జీహెచ్‌ఎంసీ అన్ని కార్యాలయాల్లో సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్, ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల్ని, 200 మిల్లీ లీటర్ల లోపు ప్లాస్టిక్‌బాటిల్స్‌ వినియోగించరాదని దాదాపు రెండు నెలల క్రితం బల్దియా ఆదేశాలు జారీ చేసింది. ఏవైనా కార్యక్రమాల నిర్వహణలో వాటిని వాడితే బిల్లుల చెల్లింపులు ఉండవని కూడా హెచ్చరించింది. ఆయా కార్యాలయాల్లో సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను వాడటం లేదని అండర్‌టేకింగ్‌ ఇవ్వాలని సర్క్యులర్‌ పంపింది. అయినా అమలు మాత్రం జరగడం లేదు. గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ కూడా ప్లాస్టిక్‌ నిషేధానికి పిలుపునివ్వడం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్‌ గురువారం కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధిస్తామని ప్రకటించారు. 

జరిమానాలు సరే..  
ప్లాస్టిక్‌ నిషేధం పేరుతో జీహెచ్‌ఎంసీ అధికారులు దుకాణదారులకు భారీ జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా గురువారం కాటేదాన్‌లో మూడు ప్లాస్టిక్‌ ఉత్పత్తి పరిశ్రమలను సీజ్‌ చేశారు. ప్లాస్టిక్‌ వినియోగిస్తున్న దుకాణాలకు రూ.1.35 లక్షల జరిమానా వేశారు. అయితే బల్దియా జరిమానాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజలకు అవగాహన కల్పించడంలో చూపడం లేదనే విమర్శలున్నాయి. ప్లాస్టిక్‌పై గానీ, దోమలపై గానీ తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేస్తున్న జీహెచ్‌ఎంసీ... ఆ తర్వాత మరచిపోతోందనే ఆరోపణలున్నాయి. 

ముంపు ముప్పు...  
నగరంలో వర్షం వస్తే కాలనీలు, రోడ్లు చెరువులుగా మారేందుకూ ప్లాస్టిక్‌నే కారణం. నాలాల్లోని వ్యర్థాల్లో దాదాపు 40 శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉండడం గమనార్హం. ఇళ్ల నుంచి వెలువడే చెత్తలో 20 శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉంటున్నాయి. ఇక సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ 66 శాతంగా ఉంది. ఇవన్నీ డంపింగ్‌యార్డుకు వెళ్లేలోగా చెల్లాచెదురై అన్ని ప్రాంతాలకూ వ్యాపిస్తున్నాయి. 

లక్ష్యం.. 2022  
1972 జూన్‌ 5న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ పర్యావరణ దినోత్సవాన్ని ప్రారంభించింది. అదే ఏడాది ఏర్పాటైన యూఎన్‌ఈపీ పర్యావరణానికి సంబంధించి ప్రజలకు అవగాహన, చైతన్యపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గతేడాది నగరంలో జరిగిన కార్యక్రమంలో   హైదరాబాద్‌లో 2022 నాటికి సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని యూఎన్‌ఈపీ డైరెక్టర్‌ ఎరిక్‌ సోల్హెమ్, మంత్రి కేటీఆర్‌ల సమక్షంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. జీహెచ్‌ఎంసీ పాలకమండలిలోనూ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వ అనుమతి కోసం నివేదించారు.

మరిన్ని వార్తలు