ఈ 'సారీ' అంతే..!

26 May, 2020 08:38 IST|Sakshi

వానొస్తే చింతే ..

రాజ్‌భవన్‌ రోడ్, ఒలిఫెంటా బ్రిడ్జి, నెక్టార్‌ గార్డెన్‌ సహా

30 ప్రాంతాల్లో నీటినిల్వ ముప్పు

లాక్‌డౌన్‌లోనూ లభించని మోక్షం

శాశ్వత పరిష్కారం లేనట్లేనా..?

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ను అద్భుతంగా వినియోగించుకొని ఎన్నో ప్రాజెక్టు పనుల్ని చేయగలిగిన జీహెచ్‌ఎంసీ..వానొస్తే రోడ్లు చెరువులయ్యే పలు ప్రాంతాల్లో మాత్రం ఏమీ చేయలేకపోయింది. లాక్‌డౌన్‌ తరుణంలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పనుల్ని చేపట్టి వాటిల్లో ఎన్నింటినో పూర్తిచేసింది. సాధారణ పరిస్థితుల్లో చేయలేని  పనుల్ని సైతం లాక్‌డౌన్‌లో చేసింది. కానీ.. వానొస్తే రోడ్లే చెరువులై ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్న పలు ప్రాంతాల్లో నీటి సమస్యలకు పరిష్కారం మాత్రం చూపలేదు. విశ్వనగరంగా ఎదిగే క్రమంలో ఎన్నెన్నో ఫ్లై ఓవర్లు, కేబుల్‌ బ్రిడ్జి వంటి భారీ పనుల్ని చేస్తున్నప్పటికీ, నేలపై నీటి సమస్యల్ని మాత్రం పరిష్కరించలేదు. మిగతా ప్రాజెక్టుల్లాగే ఈ పనుల్ని సైతం చేసి, రోడ్లపై నీటినిల్వ సమస్యలు పరిష్కరించగలరని ప్రజలు భావించారు.

కానీ..నీటి నిల్వ  సమస్యలు అలాగే ఉన్నాయి. నగరంలో వానొస్తే నీరు నిలిచే ప్రాంతాలు 150కి పైగా ఉన్నప్పటికీ, వాటిల్లో తీవ్ర సమస్యాత్మక మేజర్‌ నీటినిల్వ  ప్రాంతాలు ఇంకా 30 ఉన్నాయి. అక్కడ పనులు చేసే పరిస్థితి లేనందునే చేయలేదని అధికారులు చెబుతున్నారు. వాటిల్లో రాజ్‌భవన్‌ రోడ్‌ సహ ఎన్నెన్నో ప్రాంతాలు నగర ప్రజలకు సుపరిచితమే. సీఆర్‌ఎంపీ కింద పలు మార్గాల్లో రోడ్లను అందంగా వేస్తున్నప్పటికీ..ముంపు సమస్య మాత్రం పొంచే ఉంది. కాగా చాలా ప్రాంతాల్లో వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు చాలా వరకు నాలాలు, చెరువుల ఎఫ్‌టీఎల్‌ల పరిధిలో ఉండటంతో సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వకుండా నీటిని పంపించేందుకు భారీ పైప్‌లైన్లు వేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడం..ఇతరత్రా పలు అంశాలను పరిగణనలోకి తీసుకునే అధికారులు వీటికి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టలేదని సమాచారం. 

మరేం చేస్తారు..?
ముంపు ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నిల్వ అయిన నీటిని వెంటనే భారీ మోటార్‌ పంపులతో సమీపంలోని డ్రెయిన్లలోకి పంపిస్తారు. ఇందుకుగాను ఆయా ప్రాంతాల్లోని ముంపు తీవ్రత, తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని ఒక్కో చోట 1–20 వరకు పంప్‌సెట్లను అందుబాటులో ఉంచుతారు. వాటి ద్వారా నీటిని నిల్వ ఉండకుండా వెంటనే బయటకు పంపిస్తారు. ఈమేరకు మాన్సూన్‌ యాక్షన్‌ప్లాన్‌ రూపొందించారు.

మేజర్‌ వాటర్‌ లాగింగ్‌  ప్రాంతాలు ఇవీ..
1.మోడరన్‌ బేకరీ, హబ్సిగూడ
2.ఆదర్శ్‌నగర్‌ కాలనీ రోడ్‌నెంబర్‌–1, నాగోల్‌
3.మలక్‌పేట ఆర్‌యూబీ
4.యాకుత్‌పురా రైల్వేస్టేషన్‌ ఆర్‌యూబీ
5.వలీ ఫంక్షన్‌ హాల్, చాంద్రాయణగుట్ట
6. న్యూ అఫ్జల్‌ సాగర్‌
7.బైటెక్‌రోడ్, దత్తాత్రేయకాలనీ
8. కరోల్‌బాగ్‌‘ఎ’
9.హెచ్‌ఎస్‌ రెసిడెన్సీ, సెవెన్‌ టోంబ్స్‌రోడ్, టోలిచౌకి
10.నదీం కాలనీ కల్వర్ట్‌
11.జమాలికుంట ఔట్‌లెట్‌
12. బేగంబజార్‌ పీఎస్‌ ఎదుట
13.రంగ్‌మహల్‌
14. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌
15. ఎంఎస్‌ మక్తా
16. బల్కంపేట ఆర్‌యూబీ
17. విల్లామేరీ కాలేజ్, రాజ్‌భవన్‌రోడ్‌
18. ఆదిత్యటవర్స్‌ దగ్గర, షేక్‌పేట
19. వివేకానందనగర్,షేక్‌పేట
20. నెక్టార్‌ గార్డెన్, మాదాపూర్‌
21.ఏసీ బస్టాప్‌ శిల్పారామం
22. బాటా షోరూమ్‌ రోడ్‌ఎదుట(అయ్యప్పసొసైటీ– మాదాపూర్‌ పీఎస్‌)
23.హఫీజ్‌పేట ఫ్లై ఓవర్‌ రోడ్‌ చివర (ఆల్విన్‌–కొండాపూర్‌ ఆర్టీఏ ఆఫీస్‌)
24.డోమినోస్‌ ఎదుట, చేనెంబర్‌
25. నింబోలి అడ్డ
26.రోడ్‌నెంబర్‌ 44,జూబ్లీహిల్స్‌
27.యూనివర్సల్‌ స్విమ్మింగ్‌పూల్‌– షిర్డినగర్‌  నాలా వెంబడి
28. ఒలిఫెంటా బ్రిడ్జి
29. కర్బలా మైదాన్‌ జంక్షన్‌ (మారుతి సుజుకి షోరూమ్‌ దగ్గర)
30. బాంబే హోటల్‌ ఎదుట, రాణిగంజ్‌ క్రాస్‌రోడ్స్‌.

మరిన్ని వార్తలు