మంత్రి తలసానికి జరిమానా

16 Feb, 2020 03:48 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ కటౌట్‌ ఏర్పాటు..

 అనధికార హోర్డింగ్‌గా గుర్తించి చలానా.. పెనాల్టీ చెల్లింపు

పౌరుల ఫిర్యాదుతో చర్యలు చేపట్టిన ఈవీడీఎం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం (ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) విభాగం రూ.5వేల జరిమానా విధించింది. ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని నెక్లెస్‌రోడ్‌ సర్కిల్‌ వద్ద అనధికారికంగా భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసినందుకు జారీ చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే సర్‌.. ఉయ్‌ లవ్‌ కేసీఆర్‌..’ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేరిట ఈ కటౌట్‌ ఉండటంతో ఆయనకు చలానా జారీ చేశారు. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ల చిత్రాలు ఉన్నాయి.

ఈ అనధికార హోర్డింగ్‌వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ‘సురక్ష యోజన వెల్ఫేర్‌ సొసైటీ’ ట్విటర్‌ ద్వారా జీహెచ్‌ఎంసీ కమిషనర్, టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎంవో కార్యాలయం, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌యాదవ్‌ల పేరిట పోస్ట్‌చేసింది. ఈవీడీఎం డైరెక్టర్‌తో పాటు మరికొందరు జీహెచ్‌ఎంసీ అధికారులు, మున్సి పల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌లకు కూడా కాపీ పోస్ట్‌ చేసింది. చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీని కోరడంతోపాటు తీసుకున్న చర్యల నివేదికను కూడా పంపాలంది. దీంతో ఈవీడీఎం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేరు, ఇంటిచిరునామాలతోనే చలాన్‌ను జారీ చేసింది. ఇందుకు రూ.5 వేలను మంత్రి చెక్కు ద్వారా చెల్లించినట్లు ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కాంపాటి తెలిపారు.
 
సోషల్‌ మీడియాలో చర్చ... 
ఈ అంశంపై సోషల్‌మీడియాలో పలువురు స్పందించారు. చలానా వేయడం బాగానే ఉంది కానీ పెద్దవ్యక్తులకు ఇంత తక్కువ వేస్తే.. ఇలాంటి ఉల్లంఘనలు జరుగుతూనే ఉంటాయని, వారిష్టమొచ్చినట్లు హోర్డింగులు పెడుతూనే ఉంటారని కొందరు స్పందించారు. వారి ఆదాయాన్ని బట్టి చలానా వేయాలని సూచించారు. స్థితిమంతులైన వారు బాగానే ఉంటారు కానీ హోర్డింగు మీదపడ్డ వారి పరిస్థితేంటని ప్రశ్నించారు. పేదలను టెన్షన్‌కు గురిచేయొద్దన్నారు. అవసరమైతే రూల్స్‌ మార్చాలన్నారు. ఏ4 సైజున్న ప్రకటనకు, భారీ హోర్డింగుకూ ఒకే విధంగా పెనాల్టీలేంటని ప్రశ్నించారు. డ్రంకన్‌ డ్రైవ్‌ తరహాలో నిబంధనలు ఉండాలని సూచించారు. అమాయక ప్రజలపై పడకముందే దాన్ని అక్కడినుంచి తొలగించాలని కొందరు కోరారు. ఏర్పాటు చేసిన వారే తొలగించేలా ఏర్పాట్ల చేయాలని ఇంకొందరు సూచించారు.

నిబంధనల మేరకే... 
చట్టం, నిబంధనల మేరకే తాము చలానాలు విధిస్తున్నామని ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ స్పష్టం చేశారు. అనధికార బోర్డు, కటౌట్, ఫ్లెక్సీ ఏదైనా, ఎంత సైజుదైనా రూ.5 వేల జరిమానానే ఉందన్నారు. ఈవీడీఎం విభాగం ఇష్టానుసారంగా చలానాలు విధిస్తోందని ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో పలువురు ధ్వజమెత్తడం తెలిసిందే. కాగా, ఫ్లెక్సీ విషయంలో వివాదం తలెత్తడంతో తలసాని ఏర్పాటు చేసిన కేసీఆర్‌ కటౌట్‌ను అధికారులు తొలగించారు.

మరిన్ని వార్తలు