ఆపరేషన్‌ మార్కెట్‌

2 May, 2020 07:46 IST|Sakshi

కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు

నిత్యావసరాలు, కూరగాయల వ్యాపారులందరికీ ఆరోగ్య పరీక్షలు

భౌతిక దూరం పాటింపు ఇక కచ్చితం

నిత్యం హైపోక్లోరైట్‌ స్ప్రే

మలక్‌పేట గంజ్, తదితర ఘటనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ చర్యలు  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని మలక్‌పేట గంజ్‌లో పనిచేసే ఇద్దరి వల్ల మార్కెట్‌లోని ముగ్గురు వ్యాపారులకు.. తద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. వ్యాపారుల  ద్వారానే వేర్వేరు ప్రాంతాల్లో పదిమందికి పైగా కరోనా బారిన పడ్డారు. గ్రేటర్‌లో పాజిటివ్‌ కేసులు  ఒక అంకెకు పరిమితమయ్యాయని ఉపశమనం పొందుతున్న తరుణంలో మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరిగాయి. మార్కెట్లు, వ్యాపారుల ద్వారానే ఇవి వ్యాప్తి చెందినట్లు గుర్తించి మార్కెట్లు, వ్యాపార కార్యకలాపాలు జరిగే ప్రాంతాల్లో మరింతపకడ్బందీ చర్యలు తప్పనిసరి అని జీహెచ్‌ఎంసీ భావించింది. అందులో భాగంగా గ్రేటర్‌ పరిధిలోని అన్ని మార్కెట్లు, రైతుబజార్లు, ఇతరత్రా వ్యాపార కేంద్రాలన్నింటినీ తనిఖీ చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ ఆరుగురు జోనల్, 30 మంది డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలతోపాటుగా దిగువ వాటిని పాటించాలని, అధికారులు ప్రతినిత్యం మానిటరింగ్‌ చేయాలని ఆదేశించారు. (ఆకలి ఓడగా.. ఆమె నవ్వగా!)

పరిశుభ్రత: మార్కెట్లు, రైతుబజార్లు, వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. పారిశుధ్య చర్యలు మరింత పకడ్బందీగా నిర్వహించాలి.  
క్రిమి సంహారకాల స్ప్రే: సదరు ప్రాంతాల్లో క్రిమి సంహారకాల స్ప్రేయింగ్‌ కార్యక్రమాలు ప్రతి నిత్యం జరగాలి. అవసరాన్ని బట్టి రోజుకు రెండు పర్యాయాలు సోడియం  హైపోక్లోరైట్‌  స్ప్రే చేయాలి.  
ఆరోగ్య పరీక్షలు: మార్కెట్లలో నిత్యావసరాలు, రైతుబజార్లలో కూరగాయలు విక్రయించే  వారందరికీ ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.
భౌతికదూరం: కనీస దూరం పాటిస్తూ భౌతిక దూరం అమలు తప్పనిసరిగా అమలు చేయాలి.  ఒకే చోట ఎక్కువమంది పోగవడం వల్ల వారిలో ఏ ఒక్కరికి వైరస్‌ ఉన్నా అది ఎంతోమందిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. వీటన్నింటి అమలుకు సంబంధిత డిప్యూటీ, జోనల్‌ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని లోకేశ్‌కుమార్‌ సూచించారు.

జీహెచ్‌ఎంసీకి ప్రశంసలు..
గ్రేటర్‌ హైదరాబాద్‌లో పారిశుధ్యం, తదితర కార్యక్రమాల నిర్వహణకు జీహెచ్‌ఎంసీ కొంగొత్త విధానాలు అమలు చేస్తోందని కేంద్ర  హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మంత్రిత్వశాఖ సెక్రటరీ  దుర్గాశంకర్‌ మిశ్రా ప్రశంసించారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన కార్యక్రమాలతో పారిశుధ్య విభాగం రూపొందించిన వీడియోక్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఆయన అభినందనలు తెలిపారు. అన్ని స్థానిక సంస్థలు కూడా  ప్రజలెక్కువగా ఉండే ప్రాంతాల్లో శానిటైజేషన్‌కు   అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. దీన్ని మునిసిపల్‌ పరిపాలనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ రీట్వీట్‌ చేశారు.(కరోనా యోధులకు సైన్యం సలాం )

వాళ్లు సరే..  
మార్కెట్లు, రైతుబజార్ల సంగతలా ఉండగా  ప్రముఖులు, దాతల పంపిణీ కార్యక్రమాల పేరిట జరుగుతున్న తంతులో ఏమాత్రం భౌతిక దూరం పాటించడం లేదు. మంత్రుల నుంచి నగర  మేయర్‌ రామ్మోహన్‌ వరకు పలువురు ప్రజాప్రతినిధులు ఆయా సరుకులు, శానిటైజర్లు, పుచ్చకాయల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. షెల్టర్‌హోమ్‌లు తదితర ప్రాంతాల్లో సబ్బులు, శానిటైజర్లు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భౌతిక దూరం కనిపించడం లేదు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఇటీవల జరిగిన ఓ పంపిణీలో భౌతిక దూరం కనిపించలేదు. కేవలం ఫొటోలకు ఫోజులిచ్చేందుకేనా ఈ పంపిణీ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటే క్యూలో నిలబెట్టకుండా.. దాతలు, ప్రజాప్రతినిధులు గుమికూడకుండా వాటిని అందజేయలేరా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు