-

హెల్త్‌ సిటీ

29 Jan, 2020 10:50 IST|Sakshi

గ్రేటర్‌లో 350 బస్తీ దవాఖానాలు త్వరలో ఏర్పాటు  

సీఎం ఆదేశాల నేపథ్యంలోజీహెచ్‌ఎంసీ ముమ్మర చర్యలు  

డివిజన్‌కు రెండు చొప్పున.. పేదలు అత్యధికంగా ఉన్న స్లమ్స్‌లో అదనంగా

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్పత్రుల సంఖ్యలను పెంచి..హైదరాబాద్‌ను హెల్త్‌ సిటీగా మార్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు పేద ప్రజలకు వైద్యసేవలందించేందుకు బస్తీ దవాఖానాలను 350కి పెంచాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హెల్త్‌ సిటీపై చేసిన ఆదేశాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రస్తుతం ఆ దవాఖానాల లెక్క తీస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 118 బస్తీ దవాఖానాలున్నాయి. సీఎం ఆదేశాల మేరకు కొత్తగా మరో 232 బస్తీ దవాఖానాల్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. వీలైనంత త్వరితంగా వీటిని ఏర్పాటు చేసేందుకు..అదనపు బస్తీ దవాఖానాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి,ఆయా ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్లేవి తదితర పరిశీలనల్లో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే  సీఎం స్థాయిలో సమీక్షజరగనుండటంతో ఆలోగా పూర్తి వివరాలు సిద్ధం చేసేందుకు ముమ్మర చర్యల్లో మునిగారు. 

ఇందులో భాగంగా స్థానిక, క్షేత్రస్థాయి పరిస్థితులు తదితరమైనవి తెలుసుకొని, అవసరమైన పనులు  పూర్తిచేసేందుకు  సర్కిల్,జోనల్‌ స్థాయి అధికారులతోనూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను జీహెచ్‌ఎంసీకి చెంది కమ్యూనిటీ హాళ్లలో ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసేవి కూడా వాటిల్లోనే ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగం అధికారుల లెక్కల మేరకు   జీహెచ్‌ఎంసీకి చెందిన 1376 కమ్యూనిటీ హాళ్లున్నాయి.వీటిల్లో చాలా వరకు నిర్వహణ లోపాలతో, ప్రైవేట్‌ పెత్తనాలతో నడుస్తున్నాయి. బస్తీ దవాఖానాలకు అవసరమైన కమ్యూనిటీ హాళ్లను గుర్తించి, వాటిని బస్తీ దవాఖానాల ఏర్పాటుకు అనుకూలంగా సివిల్‌ వర్క్స్‌  పూర్తిచేసి  కనీస వసతులైన నీరు, విద్యుత్తు తదితరమైనవి కల్పించాలి. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 వార్డులు(డివిజన్లు) ఉండగా, ఒక్కో డివిజన్‌కు రెండు బస్తీదవాఖానాలుండాలని సీఎం ఆదేశించడంతో అందుకనుగుణంగా ఏర్పాటు చర్యలకు సిద్ధమవుతున్నారు. బస్తీకి రెండు పోను మరో 50 అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటిని పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అధికంగా ఉండే డివిజన్లలో ఏర్పాటు చేయాలనే యోచనలో అధికారులున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల ఖర్చులు భరించలేని పేదలకు బస్తీ దవాఖానాలు ఉపయోగపడాలి కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆలోచన చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో స్లమ్స్‌లో ఉన్న జనాభా 18 లక్షలు కాగా, స్లమ్‌ జనాభా అత్యధికంగా  ఉన్న  డివిజన్లలో డివిజన్‌కు  మూడు చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు  జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌(హెల్త్‌) సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు.  

ఇలా..  
⇒ మొత్తం  బస్తీ దవాఖానాలు :350  
⇒ ఇప్పటికే ఏర్పాటైన బస్తీ దవాఖానాలు: 118
⇒ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న బస్తీ దవాఖానాలు:58
⇒ (వీటికి అవసరమైన  డాక్టర్, నర్స్, తదితర సిబ్బందిని నియమించాల్సి ఉంది)
⇒ బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ఎంపిక చేసి, సివిల్‌ వర్క్స్‌ చేయాల్సిన కమ్యూనిటీ హాళ్లు: 174
⇒ మొత్తం 350 బస్తీ దవాఖానాలకుగాను  కేంద్రప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది: 247
⇒ కేంద్రం నుంచి  మంజూరు పొందాల్సినవి :103
⇒ ఒక్కో బస్తీ దవాఖానా నిర్వహణకు వైద్య సిబ్బంది జీతభత్యాలు, రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు, మందులు తదితరమైన వాటికి వెరసి సంవత్సరానికి దాదాపు రూ. 17 లక్షలు  ఖర్చవుతుందని అంచనా. 350 బస్తీ దవాఖానాలకు వెరసి అయ్యే వ్యయం అంచనా రూ. 59.50 కోట్లు.  
⇒ కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ కింద అవసరమయ్యే నిధులు మంజూరు చేస్తుంది. 

మరిన్ని వార్తలు