రోడ్లు ప్రైవేట్‌

22 Oct, 2019 12:02 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్, చిత్రంలో మేయర్‌ రామ్మోహన్, అర్వింద్‌కుమార్‌

ఏజెన్సీలకు రహదారుల నిర్వహణ బాధ్యతలు

7 యూనిట్లుగా 709 కిలోమీటర్ల రోడ్లు  

‘సీఆర్‌ఎం’ పేరుతో త్వరలోనే టెండర్లు  

ఫుట్‌పాత్‌లు, గ్రీనరీ పనులూ వాటికే  ఐదేళ్ల వరకు అప్పగింత  

సమీక్షలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి  

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ రహదారుల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించనుంది. కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటనెన్స్‌ (సీఆర్‌ఎం) పేరుతో త్వరలోనే వీటికి టెండర్లు పిలవనుంది. నగర రోడ్ల దుస్థితిని మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం జీహెచ్‌ఎంసీలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ఈ మేరకు వెల్లడించారు. మొత్తం 709 కిలోమీటర్ల రోడ్లను 7 యూనిట్లుగా విభజించి ఐదేళ్ల కాలానికి దీర్ఘకాలిక టెండర్లు పిలవనున్నారు. రోడ్ల నిర్వహణతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ, క్లీనింగ్‌ అండ్‌ గ్రీనరీ పనులు కూడా కాంట్రాక్టు ఏజెన్సీనే నిర్వర్తించనుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ రోడ్ల నిర్వహణ, రీకార్పెటింగ్, గుంతల పూడ్చివేత తదితర పనులకు వేర్వేరుగా టెండర్లు పిలుస్తోంది. ఒక్కో పనిని ఒక్కో ఏజెన్సీ చేస్తుండడంతో సమన్వయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

అంతేకాకుండా దెబ్బతిన్న రోడ్ల గుర్తింపు, మరమ్మతులకు అంచనాల రూపకల్పన, టెండర్లు పిలవడం తదితర ప్రక్రియలకు ఎంతో సమయం పడుతోంది. సీఆర్‌ఎంతో ఈ ఇబ్బందులుండవు. అదే విధంగా ట్రాన్స్‌కో, జలమండలి, ప్రైవేట్‌ సంస్థలు, మాస్టర్‌ ప్లాన్‌ విస్తరణ తదితర అవసరాలకు రోడ్లు తవ్వేందుకు కాంట్రాక్ట్‌  ఏజెన్సీలే సహకరిస్తాయి. ఇందుకుగాను రోడ్ల కటింగ్‌లు అవసరమైన సంస్థలు తమ భవిష్యత్తు ప్రణాళికలను కనీసం 6 నెలల ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా తవ్విన రోడ్లను వెంటనే పూడ్చి, తిరిగి యాథాతధ స్థితికి తెచ్చేందుకు ప్రస్తుతం వివిధ శాఖల మధ్యనున్న సమన్వయం లోపం, ఆలస్యం ఉండదు. ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతల వల్ల పనులు నాణ్యతగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ పనులకు సంబంధించి టెండర్లను పిలవనున్న నేపథ్యంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా జోన్లలోని ప్రధాన రోడ్లను గుర్తించి సీఆర్‌ఎం కింద నిర్వహణకు టెండర్లు పిలవనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. రోడ్ల నిర్వహణతో పాటు ఇతర అంశాల్లోనూ ఉన్నత ప్రమాణాలు నిర్దేశించినట్లు మంత్రికి వివరించారు. కాంట్రాక్టు పొందిన ఏజెన్సీలు చేసే పనుల నాణ్యతపైనా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ంఎసీ కమిషనర్‌ లోకేశ్‌కూమార్, జోనల్‌ కమిషనర్లు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు