ఆన్‌లైన్‌లోనే రిమ్‌‘జిమ్‌’

5 Oct, 2019 10:31 IST|Sakshi

సభ్యత్వ నమోదుకు అమలు

త్వరలో అమలుకు జీహెచ్‌ఎంసీ చర్యలు  

డిప్యూటీ కమిషనర్లకు నిర్వహణ బాధ్యత

‘‘ఫిట్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటు సమయంలో అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక్కో జిమ్‌కు దాదాపు 20 రకాలఉపకరణాలు తీసుకున్నారు. త్రెడ్‌మిల్, డెంబెల్స్‌తో పాటు  ఆధునిక సైక్లింగ్,  ప్లేట్‌స్టాండ్, ట్రైస్టర్, ట్విస్టర్స్, ఫోర్‌స్టేషన్‌ మల్టీ జిమ్, ఇంక్లైన్, డిక్లైన్‌ బెంచ్‌ వంటివి వీటిలో ఉన్నాయి. మహిళలకుప్రత్యేకంగా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలు కూడా చేసినప్పటికీ అవి అందుబాటులోకి రాలేదు. అన్ని జిమ్‌లలో ఉచిత వైఫై, సీసీకెమెరాలు కూడా సమకూర్చాలనుకున్నా అమలుకు నోచుకోలేదు.’’

సాక్షి,సిటీబ్యూరో: ప్రైవేట్‌ జిమ్‌లకు వెళ్లే స్తోమత లేనివారి కోసం.. ముఖ్యంగా బస్తీల్లోని యువత సైతం ఫిట్‌నెస్‌ పెంచుకునేందుకు, వివిధ క్రీడాంశాలకు అవసరమైన దేహదారుఢ్యానికి ఉపయోగపడతాయనే తలంపుతో జీహెచ్‌ఎంసీ గ్రేటర్‌లోని వివిధ సర్కిళ్లలో 135 ఆధునిక జిమ్‌ కేంద్రాలు (ఫిట్‌నెస్‌ సెంటర్లు) ఏర్పాటు చేసింది. పరికారాలకు రూ.3.52 లక్షలు, సదుపాలకు ఇంకొంత వెరసి ఒక్కో సెంటర్‌కు దాదాపు రూ.7 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇలా అన్ని సెంటర్లకు దాదాపు రూ.10 కోట్ల వరకు వెచ్చించారు. వీటి నిర్వహణ బాధ్యతలు కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, యూత్‌ అసోసియేషన్లు చూడాలని నిర్దేశించారు. కానీ చాలా ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అనుయాయుల చేతిలోనే ఇవి ఉన్నాయి. నిర్వహణను గురించి పెద్దగా పట్టించుకుంటున్న వారు లేరు. అనేక ప్రాంతాల్లో విలువైన క్రీడాపరికరాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. స్వల్ప మరమ్మతులు సైతం చేసేవారు లేక నిరుపయోగంగా మారాయి.

దీంతో బల్దియా ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. కొన్ని పరికరాలు ఎక్కడకు తరలాయో తెలియని పరిస్థితి. మార్గదర్శకాల మేరకు నిర్వహణ బాధ్యతలు స్వీకరించే అసోసియేషన్‌ జీహెచ్‌ఎంసీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు రూ.25 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. సభ్యత్వానికి నెలకు ఒక్కొక్కరి నుంచి రూ.200 రుసుం వసూలు చేయాలి. సభ్యత్వాల ద్వారా వసూలయ్యే మొత్తం ఫీజులో 10 శాతం జీహెచ్‌ఎంసీకి చెల్లించాలి. కానీ.. 135 అధునాతన జిమ్‌లలో కేవలం గాంధీనగర్‌ వార్డులోని జిమ్‌కు మాత్రం అక్కడి కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఒప్పందం మేరకు జీహెచ్‌ఎంసీకి చెల్లింపులు చేస్తోంది. ఆ ఒక్కటి మినహా ఎక్కడా నిర్వహణ సరిగా లేదు. ఈ నేపథ్యంలో నిర్వహణను జీహెచ్‌ఎంసీయే చేపట్టాలని భావించింది. అంతేకాకుండా సభ్యత్వ ఫీజుల వివరాలు కచ్చితంగా తెలిసేందుకు.. ఎంతమంది వినియోగించుకుంటున్నదీ తెలిసేందుకు సభ్యత్వ నమోదు, ఫీజు వసూలు కూడా ఆన్‌లైన్‌ ద్వారా చేయాలని భావించింది. గతేడాది నుంచి జీహెచ్‌ఎంసీ క్రీడామైదానాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌ వినియోగానికి సభ్యత్వ రుసుం, బుకింగ్‌ల కోసం ఆన్‌లైన్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆధునిక జిమ్‌ల సభ్యత్వం, ఫీజులకు కూడా ఇదే విధానం మేలైనదిగా భావించి ఈమేరకు ప్రతిపాదనలను స్టాండింగ్‌ కమిటీ ముందుంచగా, అందుకు ఆమోదం తెలిపింది. త్వరలో ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. నిర్వహణ బాధ్యతలు, తదితరమైనవి సంబంధిత సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ పర్యవేక్షిస్తారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా