గ్రేటర్‌పై ‘నిమజ్జన’ భారం

17 Aug, 2018 09:43 IST|Sakshi

బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం

క్రేన్లతో సహా అన్ని బాధ్యతలూ జీహెచ్‌ఎంసీకే..

విజయదశమి ఏర్పాట్లు సైతం..

ఇప్పటి దాకా ఇరిగేషన్‌ విభాగం ఏర్పాట్లు

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో అత్యంత ఉత్సాహంగా జరిగే వినాయక చవితి మూడోరోజు నుంచి విగ్రహాల నిమజ్జనం ప్రారంభమవుతుంది. ఇప్పటి దాకా నిమజ్జనంలో ముఖ్య భూమిక పోషించిన ఇరిగేషన్‌ శాఖ నుంచి ఆ బాధ్యతలను ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. సాగర్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌తో పాటు దాదాపు 32 చెరువుల వద్ద క్రేన్లు, తదితర  సదుపాయాలను ఆ విభాగమే కల్పించేది. అయితే, ఈ ఏడాది జరిగే నిమజ్జన ఏర్పాట్లను మాత్రం జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో సతమతమవుతున్న జీహెచ్‌ఎంసీపై మరో భారం పడినట్టయింది. దీన్ని సక్రమంగా నిర్వహించడం అంత తేలిక కాదు. 

గతేడాది సైతం నిమజ్జన బాధ్యతలు జీహెచ్‌ఎంసీ చేపట్టాల్సిందిగా ప్రభుత్వం సూచించినప్పటికీ, జీహెచ్‌ఎంసీకున్న ఇతర బాధ్యతల వల్ల సాధ్యం కాదని భావించిన మున్సిపల్‌ పరిపాలన శాఖ ఆ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించడంతో అప్పట్లో జీహెచ్‌ఎంసీకి అప్పగించలేదు. ఈ సంవత్సరం జీహెచ్‌ఎంసీకే ప్రభుత్వం ఆపనులను అప్పగించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు సమాచారం అందింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్‌ లేక్స్‌ అండ్‌ వాటర్‌బాడీస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.  హుస్సేన్‌సాగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని చెరువుల వద్ద నిమజ్జనానికి అవసరమైన క్రేన్లు, కార్మికులతో సహా అన్ని ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీయే చూసుకోవాల్సి ఉంది. వివిధ విభాగాలను సమన్వయం చేసుకోవడం, పనులను  పర్యవేక్షించడం ఈజీ కాదు. సమన్వయం కుదరని పక్షంలో తీవ్ర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. 

వివిధ శాఖల సమన్వయం..
నిమజ్జనం ఏర్పాట్లలో ఎన్నో ప్రభుత్వ విభాగాలు పనిచేస్తాయి. ఆయా ప్రాంతాల్లో బారికేడ్లను ఆర్‌అండ్‌బీ ఏర్పాటు చేస్తుంది. ప్రాథమిక చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, తదితరమైనవి వైద్య,ఆరోగ్యశాఖ చూస్తుంది. బోట్లు పర్యాటకశాఖ సమకూరుస్తుంది. గజ ఈతగాళ్లను మత్స్యశాఖ అందుబాటులో ఉంచుతుంది. వాహనాలను రవాణాశాఖ సమకూరుస్తుంది. జలమండలి తాగునీటి సదుపాయం కల్పిస్తుంది. విద్యుత్‌ అంతరాయం లేకుండా ట్రాన్స్‌కో చూస్తుంది. శాంతి భద్రతల కోసం పోలీసు బందోబస్తు తప్పనిసరి. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్‌ విభాగం చూస్తుంది. ఈ విభాగాలన్నింటితో సమన్వయం తప్పనిసరి. ఎక్కడ ఎలాంటి తేడా వచ్చినా తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. ఆ పరిస్థితి రాకుండా జీహెచ్‌ఎంసీ కీలకపాత్ర పోషించాల్సి ఉంది. 

220 క్రేన్లకు రూ.2.65 కోట్లు ఖర్చు
హుస్సేన్‌సాగర్‌తో పాటు గ్రేటర్‌ పరిధిలోని పలు చెరువులు, కుంటల వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇందుకు దాదాపు 220 క్రేన్లు అద్దెకు తీసుకోవాలని ప్రతిపాదించారు. వీటికి దాదాపు రూ.2.65 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. వినాయక నిమజ్జనం అనంతరం విజయదశమి సందర్భంగా జరిగే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం బాధ్యతలు కూడా ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకే అప్పగించింది. 

మరిన్ని వార్తలు