ముంపు.. ముప్పు.. చినుకొస్తే చిగురుటాకే!

2 Jun, 2020 08:22 IST|Sakshi
కూకట్‌పల్లికి సమీపంలోని బండారి లే అవుట్‌ (ఫైల్‌)

జడివానకు జడుసుకుంటున్న మహానగరం  

భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ ఇదే సీన్‌

ఈ నెల రెండోవారం నుంచి నైరుతీ వర్షాలు

తొలగింపునకు నోచుకోని నాలాల ఆక్రమణలు  

వీటి విస్తరణ లేకపోవడమూ ఒక కారణమే..

కోయంబత్తూర్‌ తరహాతో సత్ఫలితాలు

కాగితాలకే పరిమితమైన ‘కిర్లోస్కర్‌’ సిఫార్సులు  

సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం భారీ వర్షం కురిసిన ప్రతీసారీ చిగురుటాకులా వణికిపోతోంది. ఆదివారం మధ్యాహ్నం ఏకబిగిన సరాసరిన నాలుగు సెంటీమీటర్ల మేర కురిసిన జడివానకు నగరం నిండా మునిగింది. ఈ నెల రెండోవారంలో రుతుపవనాల ప్రవేశంతో తరచూ వర్షాలు కురిస్తే.. వరద నీరు సాఫీగా వెళ్లలేని దుస్థితి. నాలాలుఆక్రమణలు, చెత్తా చెదారంతోమూసుకుపోవడంతో వర్షపునీరు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. నగరంలో సుమారు 30 మేజర్‌ నీట మునిగే(వాటర్‌ లాగింగ్‌) ప్రాంతాలు, మరో 50 వరకు మైనర్‌ వాటర్‌ లాగింగ్‌ కేంద్రాలు, సుమారు 100 బస్తీలు తరచూ నీటమునుగుతున్నట్లు బల్దియా లెక్కలు చెబుతున్నాయి. గతంలో వరదలు తలెత్తడానికి గలకారణాలపై తెలంగాణ స్టేట్‌డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌సొసైటీ(టీఎస్‌డీపీఎస్‌).. ముంబైఐఐటీ నిపుణుల ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం నిర్వహించింది. దేశంలో పట్టణ వరదల నిపుణులు(అర్బన్‌ఫ్లడింగ్‌) కపిల్‌గుప్తా సారథ్యంలోఈ అధ్యయనం నిర్వహించారు.అధ్యయన వివరాలను, తీసుకోవాల్సిన నష్టనివారణ చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి జీహెచ్‌ఎంసీకి సమర్పించినా.. పరిస్థితిలో మార్పురాకపోవడం గమనార్హం.

ఏటా గ్రేటర్‌ మునుగుతోందిలా..  
గ్రేటర్‌లో సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్‌ నివాసం ఉండే రాజ్‌భవన్, అసెంబ్లీ సహా అమీర్‌పేట్‌ మైత్రీవనం, ఖైరతాబాద్, నిజాంపేట్, రామంతాపూర్‌ తదితర ప్రధాన ప్రాంతాలు నీటమునిగే జాబితాలో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వరద సాఫీగా వెళ్లేందుకు తగిన ప్రణాళిక కానీ, చేసిన పనులు కానీ లేవంటే అతిశయోక్తి కాదు. 2016 సెప్టెంబర్‌ నెలలో మహానగరంలో ఒకే రోజు వ్యవధిలో సుమారు 22 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నిజాంపేట్‌ పరిధిలోని బండారీ లేఅవుట్‌ సహా పదికిపైగా కాలనీలు నీటమునిగాయి. వందలాది బస్తీల్లోని ఇళ్లలోకి నీరుచేరింది. వారం రోజులపాటు ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతున వరద నీరు నిలిచి అధ్వాన్నంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా తయారైన విషయం సిటీజన్లకు కళ్లముందు కదలాడుతోంది. చిన్నపాటి వర్షం కురిసిన ప్రతిసారీ ఎక్కడికక్కడ రహదారులు జలమయం అవుతున్నాయి. బస్తీలు కన్నీటి చెరువులుగా మారుతున్నాయి. కాలనీలు నీటిలో తేలియాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతేకాదు 2000 ఆగస్టు, 2016 సెప్టెంబర్‌ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నగరమంతా జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోని వేలాది ఇళ్లు మునిగిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షం వచ్చినప్పుడు నీరు సాఫీగా వెళ్లే మార్గం లేకపోవడం, వరదనీటి కాల్వల్లో పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలు, వర్షపునీటిని పీల్చుకునే ఏర్పాట్లు లేకపోవడం, చెరువు భూముల్లో భవనాల నిర్మాణం వంటి అంశాలే దీనికి కారణమని గుర్తించారు. సమస్యను పరిష్కరించేందుకు నగరంలో వరదనీటి కాలువల అధ్యయనం.. తీసుకోవాల్సిన చర్యలపై కిర్లోస్కర్‌ కన్సల్టెంట్స్‌కు బాధ్యత అప్పగించారు.

కోయంబత్తూర్‌ ప్లాన్‌ అమలు చేస్తే..
మన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌ నగరంలో తరచూ వరద నీరు నిలిచే ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో ఉండే ఇంకుడుగుంతలను ఏర్పాటు చేశారు. దీంతో వరద నేల గర్భంలోకి చేరి భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగినట్లుటీఎస్‌డీపీఎస్‌ గుర్తించింది. ఈ నమూనా గ్రేటర్‌ పరిధిలో అమలుచేస్తే రహదారులను ముంచెత్తే వరదలను అరికట్టేఅవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఇదీ..
ఈ సీజన్‌లో నగరంలో ముంచెత్తే వరద నీటిని తొలగించేందుకు బల్దియా రూ.25 కోట్ల అంచనా వ్యయంతో మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 167 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీటిలో మినీ మొబైల్‌ మాన్‌సూన్‌ టీమ్స్, మొబైల్‌ మాన్సూన్‌ టీమ్స్, జోనల్‌ఎమర్జెన్సీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో అవసరమైన కార్మికులు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉంటాయి. భారీ వర్షసూచనలు ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లోనే ఈ బృందాలు అందుబాటులో ఉంటాయి. ఎల్బీనగర్‌లో 24, చార్మినార్‌లో 37, ఖైరతాబాద్‌లో 30, శేరిలింగంపల్లిలో 18, కూకట్‌పల్లిలో 23, సికింద్రాబాద్‌లో 35 అందుబాటులో ఉంటాయని బల్దియా అధికారులు తెలిపారు. వీటితోపాటు జీహెచ్‌ఎంసీలో అందుబాటులో ఉండే 101 స్టాటిక్‌ టీమ్స్‌ కూడా వర్ష విపత్తులో పాల్గొంటాయని అధికారులు తెలిపారు.

కింకర్తవ్యమిదీ..
నాలాల ఆధునీకరణ ఆవశ్యకతను ప్రజలకు అరమయ్యేలా వివరించాలి. అందుకుగాను రాజకీయ పార్టీల, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి.
వరదనీటి కాల్వల్లో మురుగు పారకుండా జలమండలికి స్పష్టమైన ఆదేశాలివ్వాలి. మురుగు పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి.
అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు, ప్రజలకు అవగాహనకు ప్రభుత్వం, రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి. లేని పక్షంలో కార్యక్రమం ముందుకు కదలదు.
స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజీ (వరద నీటి కాల్వల) మాస్టర్‌ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలనుఅనుమతించరాదు.
ఆయా పనులు చేపట్టే వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం అవసరం.  
చెరువుల పునరుద్ధరణ జరగాలి.తద్వారా వర్షపు నీరు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకుంటాయి.  

కాగితాలపైనే..
2003లో నివేదిక సమర్పించిన కిర్లోస్కర్‌ కమిటీ గ్రేటర్‌లో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని సూచించింది. అప్పట్లో పాత ఎంసీహెచ్‌ పరిధిలోని 170 చ.కి.మీ. ఉన్న నగరంలో మేజర్‌ నాలాల అభివృద్ధి కోసం కిర్లోస్కర్‌ కమిటీ ఈ నివేదిక రూపొందించగా, మైక్రో లెవల్‌ వరకు వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాల్సిందిగా అధికారులు 2006లో కిర్లోస్కర్‌ కమిటీకి సూచించారు. 2007 ఏప్రిల్‌లో నగర శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్‌ హైదరాబాద్‌గా ఏర్పాటయ్యాక విస్తీర్ణం 625 చ.కి.మీలకు పెరిగింది. దీంతో గ్రేటర్‌ మొత్తానికీ ‘సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌.. సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్‌వర్క్‌ ప్లాన్‌.. మేజర్, మైనర్‌ వరద కాల్వల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) బాధ్యతను ఓయంట్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్‌లో వరదనీటి సమస్య పరిష్కారానికి రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. ఈ నిధులతో బల్కాపూర్‌ నాలా, కూకట్‌పల్లి నాలా, ముర్కినాలా, పికెట్‌నాలా, ఎర్రమంజిల్‌ నాలా, బంజారాహిల్స్‌ నాలా, ఎల్లారెడ్డిగూడ నాలా, పంజాగుట్ట నాలా, యూసుఫ్‌గూడ నాలా, నాగమయ్యకుంట నాలా, కళాసిగూడ నాలా, ఇందిరా పార్కు నాలాలను ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు నిరోధించాలి. దీంతోపాటు దండు మాన్షన్, గాంధీనగర్, మోడల్‌హౌస్, జలగం వెంగళరావు పార్కు ప్రాంతాల్లో టæన్నెలింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. 390 కి.మీ మేర విస్తరించిన ప్రధాన నాలాలపై ఉన్న 9వేల అక్రమ నిర్మాణాలను తొలగించకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. 

>
మరిన్ని వార్తలు