ఆన్‌లైన్‌లో హోర్డింగ్‌లు

21 Jun, 2018 12:57 IST|Sakshi

జూలై 1 నుంచి అందుబాటులో వివరాలు 

ఏజెన్సీలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ  

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఎన్ని హోర్డింగులకు అనుమతులున్నాయో, వాటికి ఎంత గడువుందో తెలియదు. అక్రమంగా ఏర్పాటైన హోర్డింగులెన్నో. వాటిద్వారా జీహెచ్‌ఎంసీ ఖజానాకు జరుగుతున్న నష్టానికి లెక్కేలేదు. ఈ నేపథ్యంలో అక్రమ హోర్డింగుల తొలగింపుతో పాటు అనుమతులున్న హోర్డింగులను ఆన్‌లైన్‌ నుంచే మానిటరింగ్‌ చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. జూలై 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఇందులో భాగంగా యూనిపోల్స్, హోర్డింగులు ఉన్న ప్రాంతాలు, వాటికి జారీ చేసిన అనుమతులు, కేటాయించిన నెంబరు, స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ సర్టిఫికెట్‌ తదితర వివరాలు కూడా ఆన్‌లైన్‌లోనే ఉంచనున్నారు.

ఇందుకోసం ప్రకటనల విభాగానికి ప్రత్యేకంగా వెబ్‌ను రూపొందించారు. దీని ద్వారా హోర్డింగ్‌ జియోగ్రాఫికల్‌ లొకేషన్‌ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. త్వరలో మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు. క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లే అధికారులు యాప్‌ ద్వారా ఏవైనా అవకతవకలుంటే గుర్తించి కార్యాలయాల్లోని ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చు. నగర మేయర్, కమిషనర్‌లతో పాటు జీహెచ్‌ఎంసీ సీనియర్‌ అధికారులు కూడా ఈ యాప్‌ ద్వారా హోర్డింగ్‌లను నిరంతరం పరిశీలిస్తారు. 

లైసెన్స్‌ల చెల్లింపు కూడా ఆన్‌లైన్‌లోనే  
ఇప్పటి దాకా హోర్డింగులకు సంబంధించిన రికార్డులు, ఫైళ్ల నిర్వహణ మాన్యువల్‌గా ఉంది. లైసెన్సు ఫీజులు చెల్లించని వారికి సంబందిత క్లర్కులు నోటీసులిస్తేనే తెలిసేది. ఇకపై ఏజెన్సీలు తమ లాగిన్‌కు వెళితే చెల్లించాల్సిన ఫీజు, నోటీసులు నేరుగా తెలసుకుని ఆన్‌లైన్‌లోనే చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ వినియోగంతో జవాబుదారీతనం పెరుగుతుందని, ఇందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు