స్వచ్ఛమేవ జయతే!

17 Jan, 2019 10:24 IST|Sakshi

ర్యాంకు కాదు.. స్వచ్ఛ నగరమే లక్ష్యం

ఇక నిరంతరాయంగా పారిశుద్ధ్య నిర్వహణ

‘సాఫ్‌ హైదరాబాద్‌– షాందార్‌ హైదరాబాద్‌’ నినాదంతో పనులు  

పర్యవేక్షణకు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు

వినియోగంలోకి ‘స్వచ్ఛ విజిల్‌’ యాప్‌

దేశంలోనే తొలిసారిగా ‘నానో’ మానిటరింగ్‌

కార్యాచరణకు సిద్ధమవుతున్న జీహెచ్‌ఎంసీ  

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాన్ని ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019’లో అగ్రస్థానంలో నిలపడంతో పాటు.. సిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇకపై నిరంతరంగా స్వచ్ఛ కార్యక్రమాలు అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఇందుకు ‘సాఫ్‌ హైదరాబాద్‌.. షాందార్‌ హైదరాబాద్‌’ నినాదంతో నూతన కార్యక్రమాలు చేపట్టనుంది. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులు ‘ఎలక్ట్రానిక్‌ మానిటరింగ్‌’తో మూడు కొత్త కార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించారు.

నానో మానిటరింగ్‌
పారిశుద్ధ్య కార్యక్రమాల అమలును సూక్ష్మస్థాయిలో పర్యవేక్షించడమే ‘నానో మానిటరింగ్‌’. ఇందుకు కారుకు ముందు భాగంలో మూడు కెమెరాలు అమర్చుతారు. దృశ్యాల్ని 360 డిగ్రీల్లో బంధించే కెమెరాలున్న ఈ కార్లు జోన్‌ పరిధిలో తిరుగుతాయి. ఈ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయి దృశ్యాలను ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి అధికారులు పర్యవేక్షిస్తారు. రహదారుల వెంబడి ఎక్కడైనా చెత్త, నిర్మాణ వ్యర్థాలు వంటివి కనిపిస్తే వెంటనే తగుచర్యలు చేపడతారు. ప్రయోగాత్మకంగా ఒక జోన్‌లో పరీక్షించి.. తర్వాత గ్రేటర్‌లోని ఆరు జోన్లలోనూ కెమెరాలు అమర్చిన ఆరు కార్లను వినియోగిస్తారు. చిన్న రోడ్లున్న ప్రాంతాల్లోనూ తిరిగేందుకు వీలుగా చిన్న కార్లను ఎంపిక చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు ఇలాంటి విధా నం ఇప్పటిదాకా దేశంలోనిఏ నగరంలోను చేపట్టలేదు. హైదరాబాదే మొదటి నగరం కానుంది.

2. స్వచ్ఛ వార్డు ఆఫీసర్లు
జీహెచ్‌ఎంసీలోని 150 వార్డుల్లో (కార్పొరేటర్‌ డివిజన్లకు)ఒక్కో వార్డుకు ఓ అధికారిని స్వచ్ఛ కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు ప్రత్యేకంగా నియమించారు. ఇంజినీర్‌ లేదా ఇతర అధికారులను వార్డుకొకరిని ఎంపిక చేసి వారికి ట్యాబ్‌లు అందజేశారు. వీరు తమ పరిధిలో చెత్త సేకరణ సరిగ్గా జరుగుతోందా.. చెత్తను డంప్‌ చేసేందుకు స్థలం ఉందా తదితర అంశాలను పర్యవేక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ట్యాబ్‌లలో అప్‌లోడ్‌ చేసి.. తదుపరి చర్యలకోసం ఉన్నతాధికారులకు పంపిస్తారు. 

3. స్వచ్ఛ విజిల్‌ యాప్‌
అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం రూపొందించిన ‘సీ విజిల్‌’ లాంటిదే ఈ ‘స్వచ్ఛ విజిల్‌’ యాప్‌. త్వరలో ఈయాప్‌ను అందుబాటులోకి తేనున్నారు. ప్రజలు ఎవరైనా తమకు కనబడ్డ చెత్త దృశ్యాల్ని ఫొటోలు తీసి ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. సంబంధిత సిబ్బందిని అక్కడకు పంపించి తొలగిస్తారు. చెత్తకుప్పలు, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఈ యాప్‌ ఎంతో ఉపకరిస్తుందని, త్వరలో అందుబాటులోకి రానుందని అడిషనల్‌ కమిషనర్‌(ఐటీ) ముషారఫ్‌ ఫారూఖీ తెలిపారు. 

ఇది నిరంతర ప్రక్రియ: దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
స్వచ్ఛ కార్యక్రమాలు ర్యాంకుల కోసమేననే అపోహ ఉందని, తాము మెరుగైన ర్యాంకుకు పోటీపడుతూనే నిరంతర ప్రక్రియగా స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తెలిపారు. ‘ఇప్పటికే   వాణిజ్య ప్రాంతాల్లో ప్రతి కిలోమీటర్‌కు డస్ట్‌బిన్ల ఏర్పాటు, ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు వెలువడే హోటళ్లలో కంపోస్టు యూనిట్ల ఏర్పాటు తదితర చర్యలు చేపట్టాం. రహదారుల వెంబడి చెత్తడబ్బాలు ఏర్పాటు చేయాల్సిందిగా హెచ్‌ఎండీఏ, మెట్రోరైలు అధికారులను కోరాం. నాలాల పూడికతీత, వర్టికల్‌ గార్డెన్ల ఏర్పాటు పనులు  జరుగుతున్నాయి. మానవ విసర్జితాల శుద్ధికి జలమండలి ద్వారా 18 ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. పబ్లిక్‌ టాయిలెట్ల సంఖ్య పెంచుతాం. మరింత మెరుగ్గా స్వచ్ఛ కార్యక్రమాల కోసం తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం. ప్రజలు భాగస్వాములైతేనే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుంది’ అని వివరించారు. 

ఆస్తిపన్ను పెంచం.. వసూళ్లు పెంచుతాం
ఆస్తిపన్ను పెంచే యోచన లేదని దానకిశోర్‌ స్పష్టం చేశారు. ఆస్తిపన్ను వసూళ్లు పెరిగేందుకు నగరంలోని ఇళ్లన్నింటినీ జీఐఎస్‌ ద్వారా మ్యాపింగ్‌ చేసే ప్రక్రియ చేపడుతున్నామని, తద్వారా ఇప్పటి వరకు ఆస్తిపన్ను జాబితాలో లేని ఇళ్లను ఆస్తిపన్ను పరిధిలోకి తెస్తామని పేర్కొన్నారు. ఎస్సార్‌డీపీ పనులకు అవసరమైన నిధుల కోసం మూడోవిడత బాండ్ల సేకరణకు త్వరలోనే మేయర్‌తో కలిసి ముంబై వెళ్లనున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు