అన్నార్తులకు అండగా..

12 Jan, 2019 10:56 IST|Sakshi

ఆకలితో ఉన్నవారికి అందుబాటులో ఆహారం

‘ఫీడ్‌ ది నీడ్‌’ పేరిట పది ప్రాంతాల్లో త్వరలో..

సహకారం జీహెచ్‌ఎంసీ.. నిర్వహణ ‘యాపిల్‌ హోమ్‌’

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పెద్దహోటళ్లలో మిగిలిపోతున్న ఆహార పదార్థాలు రోజుకు దాదాపు 400 టన్నులు. వీటితో సహా చిన్న హోటళ్లు.. మెస్‌లు ఇతరత్రా ప్రాంతాల్లో వెరసి రోజుకు సగటున 1000 టన్నుల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. వాటిని చెత్త కుప్పల్లో వేయడమో, బల్క్‌గార్బేజిలో కలిపి పంపడమో చేస్తున్నారు. మిగిలిపోతున్న ఈ ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచితే..పాడవకముందే తగిన జాగ్రత్తలతో ఫ్రిజ్‌లలో నిల్వచేస్తే ఆకలితో ఉన్నవారికిఆలోచించిన ఓ ఎన్జీఓ సంస్థ ఇలాంటి ఆహారాన్ని భద్రపరిచేందుకు పది పెద్ద (530 లీటర్ల సామర్ధ్యం) ఫ్రిజ్‌లు కొనుగోలు చేయాలని భావించింది. జీహెచ్‌ఎంసీ సహకరిస్తే పది ప్రాంతాల్లో వాటిని ఉంచుతామని, ఫ్రిజ్‌ల రక్షణకు అవసరమైన షెల్టర్‌లను తాము నిర్మిస్తామని, ఫ్రిజ్‌ల నిర్వహణకు అవసరమైన స్థలమిచ్చి, విద్యుత్‌ చార్జీలు మాత్రం జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సిందిగా కోరింది. హోటళ్ల వారే కాక పెళ్లిళ్లు, ఇతరత్రా ఫంక్షన్ల విందు సందర్భంగా మిగిలిపోయే ఆహార పదార్థాలు సైతం ఈ ఫ్రిజ్‌లలో ఉంచవచ్చు. తద్వారా ఎంతో ఆహారం వృథా కాకుండా ఉండటమే కాకుండా అన్నార్తుల ఆకలి తీరుస్తుందని భావించిన జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్‌ కమిషనర్‌ హరిచందన ఈ ప్రతిపాదనను జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ముందుంచారు. అందుకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు సంబంధించి ముందుకొచ్చిన ఎన్జీఓ సంస్థ ‘యాపిల్‌హోమ్‌’, జీహెచ్‌ఎంసీ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. ప్రస్తుతానికి పెద్దహోటళ్లున్న ప్రాంతాలను, ఆకలిగొన్నవారు ఎక్కువగా ఉండే పది ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసినట్లు హరిచందన తెలిపారు.

ఎంపిక చేసిన పది ప్రాంతాలు..
1. శిల్పారామం (ఎయిర్‌పోర్ట్‌ బస్టాండ్‌ ఎదుట)
2. ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి
3. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్, జూబ్లీహిల్స్‌
4. ట్రైడెంట్‌ (బిర్యానీస్‌ ఎదుట)
5.రత్నదీప్, మాదాపూర్‌
6 ఈఎస్‌ఐ హాస్పిటల్‌
7. నిలోఫర్‌ హాస్పిటల్‌  
8. చందానగర్‌ మెట్రోస్టేషన్‌
9. ఇండో –అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌
10. గచ్చిబౌలి సిగ్నల్‌ బిర్యానీస్‌

ఎవరైనా తినవచ్చు: హరిచందన,జోనల్‌ కమిషనర్, జీహెచ్‌ఎంసీ  
‘ఫీడ్‌ ది నీడ్‌’ పథకం పేరిట ఏర్పాటయ్యే ఈ కేంద్రాల్లోని ఆహారాన్ని యాచకులు, బీదలే కాక ఆకలితోఉన్న ఎవరైనా తినవవచ్చు. ఇంట్లో ఫ్రిజ్‌లోని ఆహారాన్ని ఎలా తీసుకుంటారో కావాల్సిన వారు అలా వెళ్లి తీసుకోవచ్చు. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నాక, యోగ్యమైన ఆహారమని గుర్తించాకే ఫ్రిజ్‌లో ఉంచుతాం. జీహెచ్‌ఎంసీ వైద్యాధికారులు  ఆడపాదడపా ఆహారపదార్థాల్ని పరీక్షిస్తారు. వీటిని ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ‘యాపిల్‌ హోమ్‌’, జీహెచ్‌ఎంసీ లోగోలుంటాయి. క్రమేపీ మొబైల్‌ వాహనాలు కూడా అందుబాటులోకి తెచ్చి..ఎక్కడైనా ఎక్కువ ఆహార పదార్థాలున్నట్లు సమాచారమందిస్తే ఈ వాహనాలను అక్కడకు పంపి ఆహారం సేకరిస్తాం. సమాచారమిచ్చేవారి కోసం ఏదైనా ప్రత్యేక ఫోన్‌ నెంబర్‌ కానీ..జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌ నెంబర్‌ను కానీ వినియోగించుకుంటాం.

వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌..లూ కేఫ్‌ల తరహాలో?
ఆశయం, ఔదార్యం బాగానే ఉన్నప్పటికీ ఇది ఎంతమేరకు విజయవంతమవుతుంది.. దీని వెనుక మరో ఆలోచన లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఏడాది కిందట ‘వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌’పేరిట ఎవరైనా తమ ఇంట్లోని తాము వాడని వస్తువులను వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ గోడల వద్ద వదిలి వెళ్లవచ్చునని పేర్కొంటూ అన్ని సర్కిళ్లలో పెయింటింగ్‌లు వేయించింది. ఇది కొంత విఫలమైంది. ఈ ప్రాంతాల్లోనే ఇప్పుడు ‘ఫుడ్‌ కోర్టులు’ ఏర్పాటు చేస్తారు. ఇక లగ్జరీ టాయ్‌లెట్లపేరిట లూకేఫ్‌ అనే ఏజెన్సీ ఏర్పాటు చేసిన పథకం కూడా విఫలమైందనే చెప్పొచ్చు. ఇప్పుడు ‘ఫీడ్‌ ది  నీడ్‌ ’ ఏమవుతుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు