బీ అలర్ట్‌

1 Sep, 2018 09:03 IST|Sakshi
హెల్మెట్లు ధరించి నిరసన తెలుపుతున్న ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది

ఉస్మానియా ఆస్పత్రికి జీహెచ్‌ఎంసీ నోటీసులు  

ఏదైనా దుర్ఘటన జరిగితే తమకేం సంబంధం లేదని స్పష్టీకరణ  

నెల రోజుల్లోనే ఐదుసార్లు పెచ్చులూడిన భవనం  

నేడు సూపరింటెండెంట్‌ అత్యవసర సమావేశం  

సాక్షి, సిటీబ్యూరో: శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన ఉస్మానియా ఆస్పత్రికి ‘బీ అలర్ట్‌’ అంటూ జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఆస్పత్రిలో ఏదైనా అనుకోని ఘటన జరిగితే తమకేం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే టౌన్‌ప్లానింగ్‌ విభాగం నోటీసులు జారీ చేయగా, ఇంజినీరింగ్‌ విభాగం రెండు రోజుల క్రితం నిర్మాణాన్ని పరిశీలించింది. రెండు మూడు రోజుల్లో ఆ విభాగం కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఐదుసార్లు భవనం పైకప్పు పెచ్చులూడడం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులపై పడడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో మళ్లీ అదే ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందాల్సినపరిస్థితి నెలకొంది. దీంతో జీహెచ్‌ఎంసీ కూడా తమకేం సంబంధం లేదని నోటీసులు జారీ చేయడంతో ఏం చేయాలో అర్థం కాక వైద్యాధికారులు తలపట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ముందస్తుకు వెళ్లే యోచనలో ఉండడంతో... ఇప్పట్లో కొత్త భవన నిర్మాణ పనులు కూడా మొదలయ్యే అవకాశం లేదని స్పష్టమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలనే అంశంపై ఆయా విభాగాల అధిపతులతో చర్చింది ఓ నిర్ణయం తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ భావించారు. ఈ మేరకు శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

నాలుగేళ్లయినా...  
నిర్వహణ లోపంతో పాతభవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేయడంతో... అప్పటి సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాలుగు ఎకరాల్లో ఏడు అంతస్తుల కొత్త భవనం నిర్మించాలని భావించారు. ఆ మేరకు 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత సీఎం అయిన రోశయ్య 2010లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. రూ.50 కోట్లు కేటాయించారు. ఓ పైలాన్‌ కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు ఆర్కియాలజీ విభాగం అభ్యంతరం చెప్పడంతో ఐదు అంతస్తులకు కుదించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ తొలిసారిగా ఉస్మానియాకు వచ్చారు. శిథిలావస్థకు చేరుకున్న పాతభవనాన్ని తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. దీని స్థానంలో అత్యాధునిక హంగులతో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తొలి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్షాలు సహా పురావస్తుశాఖ పరిశోధకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రక్రియ నుంచి వెనక్కి తగ్గారు. ప్రస్తుత భవనం జోలికి వెళ్లకుండా అదే ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో రెండు 12 అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాదిరాయి కూడా పడలేదు.

ఇప్పట్లో మోక్షం లేనట్లే...  
పాతభవనంలో రోగులకు చికిత్సలు ఏమాత్రం సురక్షితం కాదని ఇంజినీరింగ్‌ నిపుణులు హెచ్చరించడంతో ఏడాది క్రితం రెండో అంతస్తులోని రోగులను ఖాళీ చేయించింది. వీరికి ప్రత్యామ్నాయంగా కింగ్‌కోఠి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.6 కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రోగుల తరలింపు ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత అక్కడికి వెళ్లేందుకు వైద్యులు నిరాకరించడంతో అది కూడా నిలిచిపోయింది. కొత్త భవనం నిర్మించే వరకు ఇదే ఆస్పత్రి ప్రాంగణంలోని పార్కింగ్‌ప్లేస్‌లో తాత్కాలిక రేకుల షెడ్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఇదే సమయంలో వైద్యులు, సిబ్బంది జేఏసీగా ఏర్పడి సుమారు 100 రోజులు నిరసన వ్యక్తం చేశారు. వరుస ఘటనలు, వైద్యుల ఆందోళనలకు స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి నెల రోజుల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. మూడు నెలలు దాటినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. కనీసం కొత్త భవనాల నమూనాలు కూడా ఆమోదం పొందలేదు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే యోచనలో ఉండటంతో కొత్త భవనానికి ఇప్పట్లో మోక్షం లభించే అవకాశం కూడా లేకపోవడంతో వైద్యులతో పాటు రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు