గ్రేటర్‌కు ‘చెత్త’ముప్పు 

30 Jun, 2018 01:47 IST|Sakshi
మెట్రో నగరాల్లో రోజువారీ తలసరి చెత్త ఉత్పత్తి గ్రాములు, ర్యాంకుల వారీగా...

తలసరి చెత్త ఉత్పత్తిలో గ్రేటర్‌ నంబర్‌వన్‌ 

‘నీరి’ తాజా అధ్యయనంలో వెల్లడి 

గ్రేటర్‌లో ఒక్కో వ్యక్తి నిత్యం 570 గ్రాముల చెత్త ఉత్పత్తి 

వ్యర్థాల్లో ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులే అధికం

సాక్షి, హైదరాబాద్‌: విశ్వనగరం బాటలో దూసుకెళుతోన్న మన గ్రేటర్‌ సిటీ తలసరి చెత్త ఉత్పత్తిలోనూ దేశంలో అగ్రభాగానికి చేరింది. నగరంలో ప్రతీ వ్యక్తి నిత్యం సుమారు 570 గ్రాముల చెత్త ఉత్పత్తి చేస్తుండగా, బెంగళూరులో 440 గ్రాములు ఉత్పత్తి అవుతోంది. ఇదే దేశ రాజధాని ఢిల్లీలో అయితే 410 గ్రాముల చెత్త మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలోని పలు మెట్రో నగరాల్లో రోజువారీ తలసరి చెత్త ఉత్పత్తిపై నాగ్‌పూర్‌లోని నేషనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(నీరి) తాజాగా అధ్యయనం చేసింది. ఇందులో ఈ లెక్కలు తేలాయి. హైదరాబాద్‌లో తలసరి చెత్త ఉత్పత్తి అధికంగా ఉండడంతోపాటు తడి, పొడి చెత్త వేరు చేసే విషయంలో ప్రజల విముఖత నగరపాలక సంస్థకు శాపంగా మారింది. 

వ్యర్థాల్లో అధికం ఇవే... 
నగరంలో రోజూ సుమారు 4,500 టన్నుల వ్యర్థాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో సుమారు 10 శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉన్నాయి. మిగతా వాటిలో ఆర్గానిక్‌ వ్యర్థాలు, జీవ వ్యర్థాలు, ఈ–వేస్ట్‌ తదితరాలున్నాయి. ఇక వ్యక్తిగతంగా సిటిజన్లు వృథాగా పడవేస్తున్న వాటిలో వస్తువులు, దుస్తులు, తినుబండారాలు, ఫుడ్‌ పార్సిళ్లకు సంబంధించిన ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత వినియోగించి పడవేస్తున్న లెదర్‌ బ్యాగులు, బూట్లు, ప్లాస్టిక్‌ క్యారీబ్యాగులు, వాటర్‌ బాటిల్స్, బ్యాటరీలు, ఎల క్ట్రానిక్‌ విడిభాగాలున్నాయి. కొన్ని రకాల వినియోగ వస్తువులను శుద్ధిచేసి పునర్వినియోగం చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ సిటిజన్లు వాటిని చెత్తడబ్బాలు, వీధుల్లో పడేస్తుండటంతో గ్రేటర్‌ నగరంలో తలసరి చెత్త ఉత్పత్తి అధికంగా ఉన్నట్లు పీసీబీ అంచనా వేస్తోంది. 

అవగాహనే కీలకం... 
ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరుచేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు నగరవ్యాప్తంగా పంపిణీ చేసిన డబ్బాలను వేర్వేరుగా వినియోగించడంలో చాలా మంది విముఖత చూపుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకులు తదితర వ్యర్థాలను వేరుచేసి ఆరబెట్టిన తరవాత ఇళ్లలో మొక్కలకు ఎరువుగా వినియోగించేందుకు కూడా చాలామంది ముం దుకు రావడంలేదు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సైతం సాధారణ చెత్తతోపాటే పడేస్తుండటంతో నగర పర్యావరణం ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతీ వ్యక్తి సామాజిక బాధ్యతగా వ్యవహరించి తడి, పొడి చెత్త కోసం 2 డబ్బాల విధానాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. దుస్తులు, వస్తువులు, తినుబండారాల పార్సిళ్ల కోసం వినియోగించే ప్యాకింగ్‌లను ఇష్టారాజ్యంగా రహదారులు, పార్కులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో పడేయవద్దని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు