మళ్లీ జాబ్‌మేళాలకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ

23 May, 2018 11:50 IST|Sakshi

ఆసక్తి చూపని నిరుద్యోగులు 

ఆశించిన వేతనాలివ్వని సంస్థలు 

ఈ నెల 25 నుంచి మళ్లీ మొదలు  

సాక్షి, సిటీబ్యూరో: నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తూ భారీ ఎత్తున ‘జాబ్‌మేళా’ నిర్వహించేందుకు గ్రేటర్‌ అధికారులకు నడుంబిగించారు. అయితే ఈ మేళాలకు నిరుద్యోగుల నుంచి వచ్చిన స్పందన అంతంత మాత్రమే.. గడచిన రెండేళ్లలో ఎంతో అట్టహాస ఆర్భాటాలతో జాబ్‌మేళాలు నిర్వహించాం, పెద్ద ఎత్తున స్పందన లభించిందని బల్దియా చెబుతున్నా మేళాలో ఎంపికైన వారు మాత్రం ఉద్యోగాల్లో చేరడంలో ఆసక్తి చూపలేదు. తరువాత చర్యలు తీసుకోవడంలో కూడా అధికారులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. 

మొక్కుబడిగా నిర్వహణ 
జీహెచ్‌ఎంసీ అధికారులు మొక్కుబడి తంతుగా జోన్ల వారీగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నారు. స్వయం సహాయక మహిళాసంఘాలు, మీడియా తదితర మార్గాల ద్వారా భారీ ప్రచారం కల్పిస్తున్నారు. ఉద్యోగాలనగానే యువత భారీయెత్తున హాజరైనప్పటికీ, ఉద్యోగాల్లో చేరకుండా వెనకడుగు వేస్తున్నారు. అందుకు కారణం అన్నీ ప్రైవే టు కంపెనీలవి కావడం.. ఎంతకాలముంటాయో తెలియకపోవడం.. తాము ఆశించే పని ఉండకపోవడం.. ఆకర్షణీయమైన వేతనం కూడా లేకపోవడం తదితర కారణాలున్నాయి.మరికొందరు మాత్రం దూరాభారం వల్ల వాటిల్లో చేరడం లేదు.అయితే జీహెచ్‌ఎంసీ మాత్రం ఎందుకు, ఏమిటి అనేవి ఆలోచించడం లేదు.  

నిరాసక్తత  
జాబ్‌మేళాల ద్వారా ఏటా కనీసం మూడువేలమందికి ఉపాధి కల్పించాలనేది జీహెచ్‌ఎంసీ లక్ష్యం. జాబ్‌మేళాలకు 2016–17లో భారీయెత్తున (23,328 మంది)హాజరైనప్పటికీ, వారిలో 5,039 మంది మాత్రం వివిధ ఉద్యోగాలకు ఎంపి కయ్యారు. అందులోనూ కేవలం 646 మంది మా త్రమే ఉద్యోగాల్లో  చేరారు. ఆ తర్వాత ఎంత కాలం వారు పనిచేశారన్నది మాత్రం తెలియదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన జాబ్‌మేళాకు కేవలం 6,241 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో 2,483 మంది ఎంపిక కాగా, 670 మంది మాత్రం  ఆయా ఉద్యోగాల్లో చేరారు. 

ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నా..

2016–17లో మొత్తం 89 సంస్థలు జాబ్‌మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఇంటర్వ్యూలు నిర్వహించిన వాటిల్లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, హెరిటేజ్‌ ఫుడ్స్, ఇన్నోవ్‌ సోర్స్, శుభగృహ ఇన్‌ఫ్రా, టీబీఎస్‌ఎస్, ఐక్యాగ్లోబల్, కార్పొన్‌ ఔట్‌సోర్సింగ్, జీ4ఎస్, అపోలో ఫార్మసీ, ఫ్లిప్‌కార్ట్, యురేకా ఫోర్బ్స్, వాల్‌మార్ట్, టీమ్‌లీజ్, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్, కార్వి, వీటీఐ, జస్ట్‌డయల్, టీమ్‌లీజ్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌నెట్, టాటా ఏఐఏ, డొమినో పిజ్జా మెర్లిన్‌ సొల్యూషన్స్‌వంటివి ఉన్నాయి. 2017–18లో  67 సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. వాటిల్లో హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీస్, లాట్‌ మొబైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కంట్రీక్లబ్, అక్వాఫిట్, బిగ్‌ మొబైల్స్, స్విగ్గీ, పవన్‌మోటార్స్, కాఫీడే, టెక్‌మహీంద్ర, వరుణ్‌ మోటార్స్, బిగ్‌బాస్కెట్, వొడాఫోన్, కోటక్‌ మహీంద్ర బ్యాంక్, యాక్ట్‌ ఫైబర్, హెటరో ల్యాబ్స్‌ లిమిటెడ్‌ తదితరమైనవి ఉన్నాయి. పేరెన్నికగన్న ప్రముఖ సంస్థలున్నప్పటికీ, వారికి అర్హమైన వారు లేకపోవడం.. అర్హత పొందినవారికి ఆశించిన వేతనాలు లేకపోవడంతో చాలాకొద్దిమంది మాత్రమే జాబ్‌మేళాల ద్వారా ఉద్యోగాల్లో చేరారు.  

ఈ నెల 25 నుంచి  వచ్చేనెల 12 వరకు..
ఈనెల 25వ తేదీ నుంచి జూన్‌ 12 వరకు ఆయా తేదీల్లో, ఆయా జోన్లలో జాబ్‌మేళాలు నిర్వహించనున్నారు. ఏ జోన్‌లో ఏరోజు జాబ్‌మేళా జరిగేది వివరాలిలా ఉన్నాయి.
జోన్‌                             జాబ్‌మేళా తేదీ 
ఎల్‌బీనగర్‌ జోన్‌              25.05. 2018 
సికింద్రాబాద్‌ జోన్‌            28.05.2018 
కూకట్‌పల్లి జోన్‌              30.05.2018 
ఖైరతాబాద్‌ జోన్‌             04.06.2018 
శేరిలింగంపల్లి జోన్‌           08.06.2018 
చార్మినార్‌ జోన్‌               12.06.2018  

మరిన్ని వార్తలు