రీచార్జ్‌ రోడ్స్‌..

15 Sep, 2019 02:33 IST|Sakshi

ఇసుక లేకుండా కొత్త టెక్నాలజీతో ఇంటర్నల్‌ దారులు

వాన నీటిని ఇంకించేందుకు జీహెచ్‌ఎంసీ కొత్త ప్లాన్‌

పైలట్‌ ప్రాజెక్టుగా కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు 

ఫలితాల్ని బట్టి ఇతర ప్రాంతాల్లో అమలు

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగరం... మహానగ రంగా రూపొందినా చినుకు పడితే చాలు, రోడ్లపై వరద పారాల్సిందే. ఎక్కడి నీరు అక్కడ ఇంకే దారి లేక అవి చెరువులను తలపిస్తాయి. పది నిమిషాల వాన పడ్డా రోడ్లపై నీరు నిలిచి ప్రజలు పడేపాట్లు అన్నీఇన్నీ కావు. దీని పరిష్కారానికి కొంతకాలంగా ప్రయోగాలు చేస్తోన్న జీహెచ్‌ఎంసీ పర్మియబుల్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ రోడ్‌ నిర్మాణానికి సిద్ధమైంది. ఇంజనీర్లు దీనినే పర్వియస్‌ కాంక్రీట్, పోరస్‌ కాంక్రీట్‌ అని కూడా వ్యవహరిస్తారు. 

పర్మియబుల్‌ రోడ్లు ఇలా...
ఈ పర్మియబుల్‌ రోడ్‌ నిర్మాణంలో ఇసుక వాడరు. ఈ రోడ్డుపై పడ్డ వర్షపు నీరు రోడ్డు కుండే రంధ్రాల ద్వారా నేరుగా భూమిలోకి వెళ్తుంది. గ్రౌండ్‌ వాటర్‌ రీచార్జ్‌ అవుతుంది. రెండు విధాలా ఉపయుక్తం కావడంతో వీటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. భారీ వాహనాలు వెళ్లేరోడ్లకు ఇది ఉపయు క్తం కాదు. అంతర్గత రహదారులు, లైట్‌ వెహికల్స్‌ వెళ్లే మార్గాల్లోనే ఇది ప్రయోజనకరం.

పైలట్‌ ప్రాజెక్టుగా..
పైలట్‌ ప్రాజెక్టుగా కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో  20 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు పనులు చేపట్టారు. నిర్మాణం పూర్తయ్యాక రోడ్డుపై ట్యాంకర్లతో నీటిని వదిలి పరిశీలించనున్నట్లు జీహెచ్‌ఎంసీ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ దత్తు పంత్‌ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రోడ్డు ఎక్కడా లేదన్నారు. సాధారణ సిమెంట్‌ రోడ్‌లో సిమెంట్, నీరు నిష్పత్తి 0.5 అంత కంటే ఎక్కువే, పర్మియబుల్‌ రోడ్‌లో మాత్రం 0.3 శాతమే. ఈ రోడ్డు నిర్మాణానికి  కి.మీ. కు దాదాపు రూ. 30 లక్షలు ఖర్చవు తుందని తెలిపారు. పర్యావరణ హి తంతోపాటు భూగర్భజలాలు పెరగ డం అదనపు ప్రయోజనమన్నారు. ఈ పైలట్‌ ఫలితాన్ని బట్టి అంతర్గత రహదారుల్లో చేపట్టనున్నారు. 

వీడీసీసీ రోడ్లు...
రహదారులపై నీటినిల్వల ప్రాంతాల్లో సమస్య పరిష్కారానికి కొన్ని ప్రాంతా ల్లో వీడీసీసీ(వాక్యూమ్‌ డీవాటర్డ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌) రోడ్ల నిర్మాణం చేపట్టిన జీహెచ్‌ఎంసీ.. గ్రేటర్‌ పరిధి లో 297 మార్గాల్లో 416 కి.మీ.ల మేర వీడీసీసీ రోడ్లకు ప్రతిపాదించింది. అంచనా వ్యయం రూ.208 కోట్లు.    వీటికి స్పెషల్‌ ఫండ్స్‌ కేటాయిం చాలంటూ కోరింది. ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్‌ కోసం వేచి చూస్తోంది.  

మరిన్ని వార్తలు