గ్రేటర్‌ దోమ.. దొరకలే!

10 Jan, 2020 10:43 IST|Sakshi
మస్కీట్‌ మిషన్‌

పనిచేయని ‘మస్కీట్‌’ మంత్రం

లక్షలు ఖర్చుచేసినాఫలితం అంతంతే..

డైలమాలో అధికారులు

సాక్షి,సిటీబ్యూరో: సహజంగా పల్లె ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు.. నగరాల్లోని ప్రజల్లో సామాజిక చైతన్యం కాస్త ఎక్కువే. అన్ని విషయాల్లోనూ వారికంటే ఓ అడుగు ముందే ఉంటారు. ఇప్పుడు గ్రేటర్‌ వాసుల రక్తం రుచి చూసిన దోమలూ అలాగే మారాయి. నగరంలో వివిధ రోగాలకు కారణమవుతున్న దోమల రకాలను గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన ‘మస్కీట్‌’కు చిక్కకుండా అవి తప్పించుకుంటున్నాయంటే ఇక్కడి దోమలు ఎంతటి ముదుర్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో దోమల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. నగరంలోని ఏయే ప్రాంతాల్లో ఎక్కువ దోమలున్నాయో, అవి ఏ రకానికి చెందినవో గుర్తించేందుకు ‘మస్కీట్‌’ అనే ఉపకరణాలను నగరంలోని ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. తద్వారా డెంగీ కారక దోమలున్న ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టాలని భావించారు.

దేశంలోని కొన్ని నగరాల్లో మస్కీట్‌ల ద్వారా ఫలితం కనిపించిన నేపథ్యంలో నగరంలో వాటిని ఏర్పాటు చేశారు. ‘మస్కీట్‌’లోని లిక్విడ్, సెన్సార్లతో వెలువడే ప్రత్యేక వాసన ద్వారా ఆకర్షితమయ్యే దోమలు  సదరుఉపకరణాల్లోకి చేరతాయని, తద్వారా ఏ ప్రాంతంలో ఎక్కువ దోమలున్నదీ, వాటిలోనూ డెంగీ దోమలు ఎక్కడ ఎక్కువగా ఉన్నదీ తెలుసుకోవచ్చని భావించారు. గత అక్టోబర్‌ నుంచి ఆ ఉపకరణాల్లోకి చేరుతున్న దోమలను లెక్కిస్తున్నారు. అయితే, ఆఉపకరణాల్లోకి చాలా స్వల్ప సంఖ్యలో మాత్రమే దోమలు  చేరుతుండడంతో అధికారులు కంగుతిన్నారు. అక్టోబర్‌ నుంచి ఇప్పటి దాకా కూడా మస్కీట్‌కు ఆకర్షితమై అందులో చిక్కుతున్న దోమలు తక్కువ సంఖ్యలోనే ఉండడంతో అధికారులు ఆ ఉపకరణాల పనితీరుపై డైలమాలో పడి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. సదరు ఉపకరణాలకు ఒక్కోదానికి రూ.70 వేలు ఖర్చు చేశారు. అర కిలోమీటరు పరిధి వరకు దోమలను ఈ మస్కీట్‌ తనవైపు ఆకర్షిస్తుందని వాటి ఏర్పాటు సందర్భంగా  అధికారులు పేర్కొన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా ఐదు ప్రాంతాల్లోని ఫలితాలను పరిశీలించి నగరంలో దాదాపు 500 ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఫలితం కనిపించలేదు. అయినప్పటికీ మరికొన్ని రోజులు ఆ యంత్రాలను పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 

రోజుకు 30 దోమలు కూడా చిక్కలేదు
డెంగీ, చికున్‌ గున్యా జ్వరాలకు కారణమైన ఈడిస్‌ ఈజిప్టి, ఈడిస్‌ అల్బోపిక్టస్‌ తెగలకు చెందిన దోమలు అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 4 మధ్య అంటే 21 రోజుల్లో అత్యధికంగా సికింద్రాబాద్‌ జోన్‌లోని బేగంపేటలో 616 మస్కీట్‌కు చిక్కాయి. అంటే సగటున రోజుకు 29 దోమలు చిక్కాయి. డిసెంబర్‌ 1 నుంచి 10వ తేదీ వరకు ఆ ఏరియాలో 158 దోమలే చిక్కాయి. అంటే రోజుకు దాదాపు 16 దోమలు. ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆ పదిరోజుల్లో కనీసం పది దోమలు కూడా మస్కీట్‌కు చిక్కలేదు. డిసెంబర్‌లో దోమల బెడద తక్కువే ఉన్నప్పటికీ, అక్టోబర్‌లో చిక్కిన దోమలు సైతం తక్కువే ఉండడంతో అధికారులు పునరాలోచనలో పడి, వాటి సహాయంతోనే దోమల లెక్కలు కచ్చితంగా తెలియవని భావిస్తున్నారు.

2019 డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు మస్కీట్‌లకు చిక్కిన దోమలు తక్కువే అయినప్పటికీ, వాటిలో మెదడువాపు, బోధకాలు వ్యాధులు కలిగించే క్యూలెక్స్‌ దోమలు ఎక్కువగా ఉండటం ఆందోళనకలిగిస్తోంది. ఆ పదిరోజుల్లో మస్కీట్‌లలో పడ్డ క్యూలెక్స్‌ దోమలు.. వాటి రకాలు ఏరియాల వారీగా ఇలాఉన్నాయి. క్యూలెక్స్‌ గెలిడస్‌(ఆడ, మగ).. క్యూలెక్స్‌క్వింకెఫేషియటస్‌(ఆడ, మగ) లెక్కలు ఇలా..

మరిన్ని వార్తలు