కోటి మొక్కలకు ఏర్పాట్లు

15 May, 2019 08:26 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌

సాక్షి, సిటీబ్యూరో:  హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో కోటి మొక్కలను నాటాలన్న లక్ష్యానికి అనుగుణంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 60లక్షల మొక్కలను జీహెచ్‌ఎంసీ నర్సరీల ద్వారా, మరో 40లక్షల మొక్కలను ప్రైవేట్‌ నర్సరీల్లో పెంచుతున్నట్లు  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ తెలిపారు. హరితహారం నిర్వహణ పై జోనల్, డిప్యూటీ కమిషనర్లు, అర్బన్‌ బయోడైవర్సిటీ అధికారులతో మంగళవారం  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, మొక్కల పెంపకం చేపట్టిన నర్సరీలను తనిఖీ చేసి పెంపకం వివరాలపై నివేదిక అందజేయాలని జోనల్, డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు. ఈ  తనిఖీలకు డిప్యూటి కమిషనర్లు, జోనల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హరితహారం విజయవంతం చేయడానికి కాలనీ సంక్షేమ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, కార్యాలయాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీ స్థలాలను గుర్తించి వాటిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. రహదారులు, కాలనీల్లో నాటే మొక్కల సంరక్షణకు ట్రీ గార్డ్‌లు అవసరమని, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సబిలిటీ కింద కనీసం లక్ష ట్రీగార్డులను  సమకూర్చుకోవాలని జోనల్‌ కమిషనర్లకు  సూచించారు. నగరంలో జీహెచ్‌ఎంసీకి చెందిన  616 బహిరంగ ప్రదేశాల్లో హరితహారం మొక్కలను నాటడం ద్వారా పార్కులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.   పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన 331 ట్రీ పార్కుల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో, శ్మశానవాటిల్లోని ఖాళీ స్థలాల్లో  కూడా హరితహారం మొక్కలను నాటాలని సూచించారు. 

అర్బన్‌ బయోడైవర్సిటీకి పార్కుల్లో క్రీడా పరికరాల నిర్వహణ  గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు మేజర్‌ పార్కుల్లో చిన్న పిల్లలకు ఏర్పాటు చేసిన క్రీడా పరికరాల నిర్వహణ బాధ్యతలను అర్బన్‌ బయోడైవర్సిటీ విభాగానికి అప్పగిస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. వీటి వార్షిక నిర్వహణకు ఏజెన్సీలను ఖరారు చేయాలని అర్బన్‌ బయోడైవర్సిటీ అధికారులను ఆదేశించారు. 

రంజాన్‌ తోఫాలకు ఏర్పాట్లు
రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రతి వార్డులో రెండు మసీదులను గుర్తించి రంజాన్‌ బహుమతులను అందజేయనున్నట్లు  తెలిపారు. నగరంలోని 150 వార్డులకుగాను 300 మసీదులను  ఎంపికచేసి దుస్తుల పంపిణీ, ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేయాలని డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్లు అమ్రపాలి , జయరాజ్‌ కెనెడీ, జోనల్‌ కమిషనర్లు, తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు