‘చెత్త’ క్లీనింగ్‌ కొత్తగా..

15 May, 2020 10:42 IST|Sakshi

అందుబాటులో అత్యాధునిక వాక్యూమ్‌ గార్బేజ్‌ క్లీనర్‌

చేతికి మట్టి అంటకుండా పని చేసేలా ప్రత్యేక ఏర్పాటు

కోవిడ్‌ నేపథ్యంలో కొత్త విధానం ప్రయోగాత్మకంగా మాదాపూర్‌లో చెత్త సేకరణ

గచ్చిబౌలి: కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో క్లీనింగ్‌ విధానాన్ని మార్చేస్తున్నారు. కార్మికులకు హాని కలుగకుండా..సేఫ్‌గా..కొత్త విధానంలో చెత్త సేకరణ కోసం ప్రత్యేక ‘వాక్యూమ్‌ గార్బేజ్‌ క్లీనర్‌’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మిషన్‌ పొడి చెత్తను ఇట్టే లాగేసి డబ్బాలోకి వేస్తుంది. దీంతో కార్మికులు చేతులతో చెత్తను ఎత్తే పని తప్పుతుంది. ప్రధాన రోడ్ల వెంట ఉండే పొడి చెత్త సేకరణకు ఈ మిషన్‌ను ఉపయోగిస్తారు. గురువారం మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ 100 అడుగుల రోడ్డులో ఈ వాక్యూమ్‌ గార్బేజ్‌ క్లీనర్‌ను  ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ఫుట్‌పాత్‌లు, మీడియన్లు, రోడ్డు మార్జిన్‌లు, డివైడర్‌ల వెంట, గార్డెన్లు, పార్కులలో పడవేసేచిత్తు పేపర్‌లు, ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు, తాగి పడేసిన కూల్‌ డ్రింక్స్, వాటర్‌ బాటిల్స్, మాస్కులు తదితర చెత్తను ఏరివేయడం పారిశుధ్య కార్మికులకు ఇబ్బందిగా మారింది.

కోవిడ్‌–19 నేపథ్యంలో రోడ్ల వెంట వాడిన మాస్క్‌లు, గ్లౌజులు, టవల్స్, ఖర్చీఫ్‌లు, వాటర్‌ బాటిళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని నేరుగా తాకితే పారిశుధ్య కార్మికులకు వైరస్‌ సోకే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలోనే వాక్యూమ్‌ గార్బేజ్‌ క్లీనర్‌ను రంగంలోకి దించారు. ఇది తేలిక పాటి బరువున్న వస్తువులను బాక్సు లోపలికి లాగేసుకొని బ్యాగ్‌ను నింపుతుంది. ఢిల్లీలో తయారయ్యే ఈ వాక్యూమ్‌ గార్బేజ్‌ క్లీనర్‌ను ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఆర్మీ ప్రాంతంలో ఉపయోగిస్తున్నారు. ఈ మిషన్‌ను వెస్ట్‌ జోనల్‌ పరిధిలోని చందానగర్‌ సర్కిల్‌–21కు రప్పించారు. దీని ఖరీదు అన్ని ట్యాక్స్‌లు కలుపుకొని రూ.1.70 లక్షల వరకు ఉంటుంది. అర లీటరు పెట్రోల్‌తో 90 నిమిషాల పాటు నడుస్తుంది. ప్రయోగం ఫలితస్తే మరికొన్ని మిషన్లు తెచ్చే అవకాశం ఉంది. వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్, సీఆర్‌ఎంపీ మేనేజర్‌ శివప్రసాద్, చందానగర్‌ ఏఎంహెఓ కె.ఎస్‌.రవి కుమార్‌ పనులు పరిశీలించారు.

మరిన్ని వార్తలు