ఆరు రంగుల్లో మట్టి గణపతి

29 May, 2018 02:48 IST|Sakshi

10 లక్షల విగ్రహాల తయారీకి బీసీ కార్పొరేషన్‌ కార్యాచరణ

కుమ్మరి కళాకారులకు విగ్రహ తయారీ బాధ్యతలు

పెట్టుబడి నిమిత్తం ఒక్కో కళాకారుడికి 25వేల ఆర్థిక సాయం

జీహెచ్‌ఎంసీతో త్వరలో ఎంఓయూ

సాక్షి, హైదరాబాద్‌: హస్తకళకు రాష్ట్ర సర్కారు చేయూతనిస్తోంది. కనుమరుగవుతున్న కళను పరిరక్షించే క్రమంలో బీసీ కార్పొరేషన్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలు తయారుచేసి విక్రయించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతలను కుమ్మరి కళాకారులకు అప్పగించబోతోంది. ఈమేరకు వెనుకబడిన కులాల ఆర్థిక సహకార సంస్థ కార్యాచరణ సిద్ధం చేసింది. రాబోయే వినాయక చవితి పండగకోసం పర్యావరణహిత గణపతి విగ్రహాలు తయారు చేయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల విగ్రహాలు తయారుచేసి విక్రయించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో కళాకారులకు శిక్షణనిచ్చి వారికి అవసరమైన వనరులను సమకూర్చనుంది. 

మాస్టర్‌ ట్రైనర్లతో శిక్షణ.. 
రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఐదుగురు కుమ్మరి కళాకారులను బీసీ కార్పొరేషన్‌ ఎంపిక చేసింది. వీరికి వచ్చేవారంలో స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు గుజరాత్‌ మాటీకామ్‌ సంస్థ నుంచి నిపుణులను ఆహ్వానించింది. శిక్షణ తర్వాత మాస్టర్‌ ట్రెయినర్లు జిల్లా కేంద్రాల్లో మరింత మంది కళాకారులకు శిక్షణ ఇస్తారు. అదేవిధంగా మాస్టర్‌ ట్రెయినర్లు వ్యక్తిగతంగా జిల్లా, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో వినాయక తయారీ యూనిట్లు కూడా నెలకొల్పుతారు. వీరికి బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.25వేల రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. మాస్టర్‌ ట్రెయినర్ల నుంచి శిక్షణ తీసుకున్న మిగతా కళాకారులు కూడా వారి సొంత గ్రామాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి శిక్షణ ఇచ్చిన అనంతరం ఒక్కో కళాకారుడు వెయ్యి విగ్రహాలు తయారు చేయాల్సి ఉంటుంది. అలా తయారైన విగ్రహాలను బీసీ కార్పొరేషన్‌ ఔట్‌లెట్ల ద్వారా విక్రయించుకోవచ్చు. 

మూడు సైజుల్లో.. ఆరు రంగుల్లో... 
బీసీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రూపొందబోయే వినాయక విగ్రహాలు 3 రకాల సైజుల్లో లభ్యమవుతాయి. ఇందులో అరఫీటు, ఫీటు, ఫీటున్నర సైజుల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తారు. గతంలో మట్టి విగ్రహాలంటే ఒకే తరహాలో మట్టి రంగుతో కనిపించేవి. తాజాగా తయారు చేసే విగ్రహాలు మాత్రం ఆరు రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. సహజసిద్ధమైన రంగులే వినియోగిస్తారు. 

జీహెచ్‌ఎంసీతో బీసీ కార్పొరేషన్‌ అవగాహన 
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల విగ్రహాలు తయారు చేస్తుండగా, అందులో దాదాపు ఐదు లక్షల విగ్రహాలు గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోనే విక్రయించనుంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీతో బీసీ కార్పొరేషన్‌ అవగాహన కుదుర్చుకోనుంది. ఇప్పటికే కమిషనర్‌తో ఆ శాఖ అధికారులు చర్చలు జరిపారు. విగ్రహాల విక్రయ బాధ్యతలను బీసీ కార్పొరేషన్, కుమ్మరి, శాలివాహన ఫెడరేషన్‌ సంయుక్తంగా తీసుకుంది. విగ్రహాల ధరలను కుమ్మరి, శాలివాహన ఫెడరేషన్‌ నిర్ణయిస్తుందని బీసీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అలోక్‌కుమార్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు