నిమజ్జనానికి ఏర్పాట్లు!

15 Sep, 2018 08:46 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో: గణపతి నవరాత్రి ఉత్సవాలు గ్రేటర్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహానగరం పరిధిలో ఈసారి వీధులు, ముఖ్య కూడళ్లలో సుమారు 35 వేల గణనాథులను(పెద్ద పరిమాణం) ప్రతిష్ఠించినట్టు జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాలు అంచనా వేస్తున్నాయి. ఇక కాలుష్య నియంత్రణ మండలి, హెచ్‌ఎండీఏ, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన స్ఫూర్తితో ఇళ్లలో మరో 5 లక్షల మట్టి గణపతులను(చిన్నవి)  ప్రతిష్ఠించి పూజలు చేసినట్టు లెక్కవేస్తున్నారు.

అయితే గ్రేటర్‌ సిటీజన్లు ఈసారి పర్యావరణ హితంగానే గణేష్‌ చతుర్థిని జరుపుకోవడం విశేషం. శాస్త్రోక్తంగా పూజలందుకొన్న గణనాథులను మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల్లో నిమజ్జనం చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హుస్సేన్‌సాగర్‌ సహా గ్రేటర్‌ పరిధిలోని 50 చెరువుల వద్ద బల్దియా ఏర్పాట్లు చేసింది. నిమజ్జన పనులకోసం రూ.10 కోట్లు కేటాయించింది. నిమజ్జనం జరిగే ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో అవసరమైన పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.  నిమజ్జనాలు జరిగే చెరువుల మార్గాల్లో, చెరువుల వద్ద సదుపాయాల కల్పనతో పాడు ఆయా మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

శోభాయాత్రకు సైతం..
నగరంలో జరిగే గణేశ్‌ శోభాయాత్రలో సైతం మార్గం పొడవునా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్రకు మూడు రోజుల మందే పూర్తిస్థాయిలో పనులు చేపడతామని ఇంజినీర్లు చెబుతున్నారు. తాత్కాలిక విద్యుత్‌ దీపాల ఏర్పాటు, గణేశ్‌ విగ్రహాల నిమజ్జనాల కోసం 107 మొబైల్‌ క్రేన్లు, 81 స్టాటిక్‌ క్రేన్లను నిమజ్జనం జరిగే చెరువుల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. శోభాయాత్ర సందర్భంగా మెడికల్‌ క్యాంపులు, మొబైల్‌ టాయిలెట్లు తదితర సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ జియావుద్దీన్‌ తెలిపారు. 

పీఓపీ విగ్రహాలతో కాలుష్య ముప్పు
గణపతి నవరాత్రులు ఎంత వైభవంగా జరిగినా.. నిమజ్జనంతో తలెత్తే కాలుష్యంతో పర్యావరణ వాదులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌తో చేసిన ప్రతిమలను జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల వాటిలో ఉండే వివిధ రకాల హానికారక రసాయనాలు జలాశయాల్లో చేరి కాలుష్య కాసారంగా మారడం తథ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  

చెరువుల్లో కలిసే రసాయన అవశేషాలివే..
లెడ్‌ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్‌ ఆక్సైడ్, రెడ్‌ ఐరన్‌ ఆక్సైడ్, రెడ్‌ లెడ్, క్రోమ్‌ గ్రీన్, పైన్‌ ఆయిల్, లిన్సీడ్‌ ఆయిల్, లెడ్‌ అసిటేట్, వైట్‌ స్పిరిట్, టర్పైంన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్‌.

హానికారక మూలకాలు
కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, మ్యాంగనీస్‌ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్‌ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్‌ ఆర్సినిక్, జిక్‌ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా.

పీఓపీ విగ్రహాల నిమజ్జనంతో అనర్థాలు..  
జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
పర్యావరణం దెబ్బతింటుంది. దుర్వాసనతో సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది.
ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తుంటారు. వీటిని తిన్నవారి శరీరంలోకి హానికారక మూలకాలు చేరతాయి. చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి.
సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి.
నగరంలో జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జలాల్లో అరుదుగా పెరిగే వృక్షజాతులు నాశనమవుతాయి.  
ఆర్సినిక్, లెడ్, మెర్క్యురీ మూలకాలు భారతీయ ప్రమాణాల సంస్థ, వైద్య పరిశోధనా సంస్థలు సూచించిన పరిమితులను మించి ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనం, సిలికాన్‌ జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి.

గ్రేటర్‌లో జోన్ల వారీగా నిమజ్జన ఏర్పాట్ల పనులు, మంజూరైన నిధులు  
జోన్‌           పనులు    నిధులు(రూ.లక్షల్లో)
ఎల్‌బీనగర్‌    22        187.40
చార్మినార్‌     82        432.28
ఖైరతాబాద్‌   22       135.51
శేరిలింగంపలి16        83.96
కూకట్‌పల్లి   15        74.86
సికింద్రాబాద్‌13        84.61
మొత్తం      170      998.62

మరిన్ని వార్తలు