త్వరితం.. హరితం

5 Aug, 2019 10:55 IST|Sakshi

హరితహారానికి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు  

3 కోట్ల మొక్కలు నాటేందుకు నిర్ణయం  

ఇప్పటికే 13లక్షలు ఉచితంగా పంపిణీ  

రెండు రోజుల్లోనే 9.50 లక్షలు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో 3 కోట్ల మొక్కలు నాటేందుకు జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వీటిలో 1.30 లక్షల మొక్కలనుజీహెచ్‌ఎంసీ, జలమండలి ఖాళీ స్థలాల్లో పెంచు తుండగా... మరో 70 లక్షల మొక్కల ను హెచ్‌ఎండీఏ, గృహనిర్మాణ శాఖ ఖాళీ స్థలాల్లో పెంచుతున్నారు. వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రహదారుల వెంబడి, వివిధ సంస్థలు, విద్యాసంస్థల్లో దాదాపు 10 లక్షల మొక్కలు నాటుతున్నారు. మిగిలిన మొక్కలను నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించగా... అధికారులు ఇప్పటికే 13 లక్షల మొక్కలు పంపిణీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నాటనున్న మొక్కలకు సంబంధించి స్థలాల ఎంపిక పూర్తవ్వగా... గుంతల తవ్వకం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ మొక్కలకు జీహెచ్‌ఎంసీ జియోట్యాగింగ్‌ కూడా చేయనుంది. జీహెచ్‌ఎంసీ నాటనున్న 5లక్షల మొక్కల్లో ఎల్బీనగర్‌ జోన్‌లో 95వేలు,చార్మినార్‌ జోన్‌లో 65వేలు, ఖైరతాబాద్‌ జోన్‌లో 79,600, శేరిలింగంపల్లి జోన్‌లో 85,250, కూకట్‌పల్లి జోన్‌లో 1,01,050, సికింద్రాబాద్‌ జోన్‌లో 74,100 మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు ఆయా జోన్లలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కలు నాటేందుకు దాదాపు 3,084 ప్రాంతాల్లో 1,729 ఎకరాల భూమిని గుర్తించారు.

వర్షాలతో పంపిణీ ముమ్మరం...   
నగరంలో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో అధికారులు మొక్కల పంపిణీ ముమ్మరం చేశారు. కాలనీలు, బస్తీలు, విద్యాసంస్థల్లో మొక్కల పంపిణీ చేపట్టారు. ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో వివిధ కాలనీలు, ఆలయాలు, విద్యాసంస్థల్లో 9.50 లక్షల మొక్కలు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌ కంపెనీలు హరితహారంలో పాల్గొనాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు... నగరంలోని ఏరో స్పేస్‌ వ్యాలెట్‌ కంపెనీ సిబ్బంది ఆదివారం దాదాపు 2వేల మొక్కలు నాటారు. కంపెనీ ఎండీ నితిన్‌ పీటర్, మయాంత్, అనూష, గ్రాస్‌ వరల్డ్‌ ఎండీ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు