సీఏఏకు వ్యతిరేకంగా జీహెచ్‌ఎంసీ తీర్మానం

9 Feb, 2020 02:12 IST|Sakshi

మేయర్‌ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారి తీర్మానం చేసిన బల్దియా

సాక్షి,హైదరాబాద్‌: సీఏఏకు వ్యతిరేకంగా జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగిన జీహెచ్‌ఎంసీ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ ఫసీయుద్దీన్‌ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతకుముందు ఉదయం బడ్జెట్, మధ్యాహ్నం సాధారణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహన్‌ మాట్లాడుతూ..తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీఏఏపై ఇప్పటికే తన నిర్ణయాన్ని తెలిపారని, దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కూడా ప్రకటించారని చెప్పారు.

సీఎం స్ఫూర్తితో ప్రతిపాదించిన ఈ తీర్మానానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాల్సిందిగా కోరగా, సభ్యులందరూ బల్లలు చరుస్తూ తమ ఆమోదం తెలిపారు. ఫసీయుద్దీన్‌ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో సీఏఏను వ్యతిరేకించారని పేర్కొన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా సీఏఏపై తన వాణిని స్పష్టంగా విన్పించారని చెప్పారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా పక్షపాతంతో తీసుకొచ్చిన సీఏఏను అందరూ వ్యతిరేకించాల్సిందేనన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా, లౌకికతత్వాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉన్న చట్టమని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఎంఐఎంకు చెందిన మాజీ మేయర్‌ మాజిద్‌హుస్సేన్, ఎమ్మెల్సీ జాఫ్రీ, టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ ప్రభాకర్, కార్పొరేటర్లు జగదీశ్వర్‌ గౌడ్, సింగిరెడ్డి స్వర్ణలత మద్దతు ప్రకటించారు.

సభలో గలాటా..
అంతకుముందు ఉదయం బడ్జెట్‌పై సమావేశం జరుగుతుండగానే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీర్‌లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని మాజిద్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. దీనికి సభలో ఉన్న బీజేపీ సభ్యుడు శంకర్‌యాదవ్‌ అవి ఇప్పుడెందుకు? అంటూ మాజిద్‌ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయనకు, ఎంఐఎం సభ్యులకు మధ్య సభలో కాసేపు వాగ్వాదం జరిగింది. మేయర్‌ పోడియం దగ్గరకు వెళ్లి కాస్త గలాటా సృష్టించారు.

బడ్జెట్‌ సమావేశంలో బడ్జెట్‌ విషయాలు మాత్రమే ప్రస్తావించాలన్న మేయర్‌.. సాధారణ సమావేశంలో మిగతా విషయాల గురించి చర్చిద్దామన్నారు. మధ్యాహ్నం జరిగిన సాధారణ సమావేశానికి శంకర్‌యాదవ్‌ గైర్హాజరయ్యారు. డిప్యూటీ మేయర్‌ సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా టీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దేశంలో సీఏఏను వ్యతిరేకిస్తూ తొలి తీర్మానం చేసిన కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీయేనని మేయర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు