సమగ్ర సర్వేకు కసరత్తు

7 Aug, 2014 01:31 IST|Sakshi
సర్వేపై జరిగిన సమావేశంలో పాల్గొన్న అధికారులు

* సమీక్ష నిర్వహించిన జీహెచ్‌ఎంసీ
 
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న జరగనున్న సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహణకు గ్రేటర్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 625 చ.కి.మీ. మేర విస్తరించిన జీహెచ్‌ఎంసీలో దాదాపు 20 లక్షల ఇళ్లున్నట్లు అంచనా వేసిన అధికారులు సర్వే నిర్వహణకు దాదాపు లక్షమంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. జీహెచ్‌ఎంసీ, పోలీసులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని సర్వే సేవలకు వినియోగించుకున్నా 40 వేల నుంచి 50 వేల మంది వరకు మాత్రమే ఉన్నట్లు అంచనా వేశారు. 

దీంతో.. ప్రైవేటు విద్యాసంస్థలు, స్వయం సహాయక మహిళా గ్రూపులు, స్వచ్ఛంద సేవాసంస్థలు, తదితరుల సేవల్ని విని యోగించుకుంటే ఎలా ఉంటుంది ? అనే ఆలోచనలో ఉన్నారు. సర్వే నిర్వహణ సన్నాహకాల్లో భాగంగా బుధవారం జీహెచ్‌ఎంసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌తోపాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనా, గ్రేటర్ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు  పాల్గొన్నారు. సర్వే ఎలా చేస్తే బాగుంటుంది.. పర్యవేక్షణ ఎలా ఉండాలి.. తదితర వివరాలపై ఒకటి రెండు రోజుల్లో నివేదిక రూపొందించాల్సిందిగా కమిషనర్ సూచించారు.

* ఇంటింటి సర్వే  నిర్వహణ కోసం జీహెచ్‌ఎంసీలో సిబ్బందితో పాటు, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన  30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులను వినియోగించనున్నారు.

* 19వ తేదీ సర్వేకు ఒక రోజు ముందు అంటే 18వ తేదీన కూడా సంబంధిత సిబ్బంది తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి సర్వే పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

* సర్వేలో కీలకమైన 9 అంశాలను సిద్ధంగా ఉంచుకోవలసిందిగా  ప్రజలను కోరుతారు.
* ప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం సైన్యాన్ని పంపితే  వినియోగించుకుంటారు.

* జీహెచ్‌ఎంసీ  పరిధిలో  సర్వే తీరును  పర్యవేక్షించేందుకు   250 మంది  నోడల్ అధికారులను నియమిస్తారు.
* మరో  2వేల మందిని  క్లస్టర్ ఇంచార్జిలుగా నియమిస్తారు.
 
కలెక్టరేట్‌లో సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సామాజిక ఆర్ధిక సర్వేను విజయవంతం చే సేందుకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఏజేసీ సంజీవయ్య వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అవసరమైన సిబ్బంది వివరాల సేకరణపై బుధవారం వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష జరిపారు. జిల్లా వ్యాప్తంగా 94 ప్రభుత్వ విభాగాలు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 32 విభాగాల నుంచే సిబ్బంది వివరాలు అందాయని ఏజేసీ పేర్కొన్నారు.

నగరంలో సర్వే కోసం 36 వేల మంది సిబ్బంది అవసరం కాగా, అన్ని ప్రభుత్వ విభాగాల్లో కలిపి 16వేల మందే ఉన్నట్లు పలువురు అధికారులు ఏజేసీ దృష్టికి తెచ్చారు. సీపీవో బలరాం మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలోని 108 డివిజన్లను 8600 ఎన్యుమరేటర్ బ్లాకులుగా విభజించామన్నారు. ఆయా బ్లాకుల్లో 9 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేశామన్నారు. ప్రొఫార్మాలో వివరాల నమోదుకు ముందు తగిన అధారాలను కూడా పరిశీలించాలని సీపీవో బలరాం సూచించారు.

మరిన్ని వార్తలు