ఫుట్‌పాత్‌... మీ సొత్తే!

30 Jun, 2018 10:16 IST|Sakshi
ప్రత్యేకబృంద సభ్యులతో మాట్లాడుతున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌

ఇక బిందాస్‌గా నడవొచ్చు...

‘రైట్‌ టు వాక్‌’ అమలుకు   జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ యాక్షన్‌ ప్లాన్‌

నేటి నుంచి మూడు రోజులపాటు...

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అమలు

సాక్షి, సిటీబ్యూరో: ఫుట్‌పాత్‌లంటే పాదచారులు నడవడానికి ఏర్పాటు చేసినవి. కానీ నగరంలోని ఫుట్‌పాత్‌లపై పాదచారులు నడవలేరు. వాటిపైనే దుకాణాల విస్తరణ, ట్రాన్స్‌ఫార్మర్లు, ఏవి పడితే అవి పెట్టేశారు. దాంతో రోడ్ల వెంబడి నడకదారులు లేక ప్రజలు రోడ్డు మీద నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా మృత్యువాత పడుతున్న పాదచారులు ఏటా 500 మందికి పైగా ఉంటున్నారు. ఇది ఒకవైపు దృశ్యం..మరోవైపు కోణం పరిశీలిస్తే...గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోని రోడ్ల పొడవు 9100 కి.మీ.లు.వీటిగుండా నిత్యం దాదాపు 59 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. అయినప్పటికీ, రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడవడానికి ఫుట్‌పాత్‌లే లేవు. నగరం మొత్తమ్మీద ఉన్న ఫుట్‌పాత్‌లెన్నో తెలుసా.. దాదాపు 431 కి.మీ.లు. అంటే  కనీసం ఐదు శాతం కూడా లేవు. ప్రధాన రహదారుల వెంబడి సైతం ఫుట్‌పాత్‌లు లేవు. దాంతో తరచూ ప్రమాదాల్లో పాదచారులు ప్రాణాలు కోల్పోతుండటంతో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాల్సిందిగా హైకోర్టు చాలాసార్లు జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.  కొన్ని పర్యాయాలు తొలగింపు చర్యలు చేపట్టారు. అది తూతూమంత్రంగా, మొక్కుబడి తంతుగానే మారింది.

ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టగానే ఏవేవో ఆటంకాలు. ఒత్తిళ్లు. ఇతరత్రా కారణాలు. ఇలాంటి పరిస్థితి ఎదురవకుండా  ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించేందుకు...ప్రజల నడిచే హక్కు(రైట్‌ టు వాక్‌)ను అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ పకడ్బందీ ప్రణాళిక రచించింది.   ప్రభుత్వం దాదాపు మూడునెలల క్రితం జీహెచ్‌ఎంసీకి ఐపీఎస్‌ అధికారి విశ్వజిత్‌ను విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, విపత్తునివారణ డైరెక్టర్‌గా నియమించింది. ఫుట్‌ఫాత్‌ల తొలగింపు సందర్భంగా ఎలాంటి పరిస్థితులెదురైనా ఎదుర్కొనేందుకు  ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశాలతో తగిన ప్లాన్‌ చేశారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులతోనూ సమావేశం నిర్వహించారు. తొలగింపు చర్యలకు అవసరమైన ఆధునిక యంత్రసామాగ్రిని సమకూర్చుకున్నారు. సిబ్బందికి శిక్షణ నిచ్చారు. గ్రేటర్‌లోని ఆరు జోన్లకుగాను జోన్‌కొకటి చొప్పున ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. వీటిల్లో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, పోలీసు అధికారులతో సహా ఇరవైమంది ఉన్నారు. కూల్చివేతల సమయంలో ఎలా వ్యవహరించాలో శిక్షణనిచ్చారు. వారు తాము  ఎలా పనిచేసేది శుక్రవారం జనార్దన్‌రెడ్డి, విశ్వజిత్‌లకు వివరించారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఫుట్‌ఫాత్‌లపై ఆక్రమణలు తొలగించనున్నారు.

చిరు వ్యాపారులపై ప్రతాపం చూపరు..
తొలుత స్వచ్చందంగా ఆక్రమణల్ని తొలగించేందుకు అవకాశమిస్తామని తెలిపారు. చిరు వ్యాపారాలు చేసుకునేవారికి ఎలాంటి శిక్షలు విధించకుండా, వారు ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వేరే ప్రాంతంలో తమ వ్యాపారం ఏర్పాటుచేసుకునేందుకు తగిన స్థలం చూపుతామని పేర్కొన్నారు.ఫుట్‌పాత్‌లపై ర్యాంపులు ఏర్పాటు చేసి, ఫుట్‌పాత్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారిని మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.  తొలగింపు సందర్భంగా అడ్డుకున్నా, తొలగించాక తిరిగి నిర్మాణం చేసినా భారీ జరిమానాలతోపాటు క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.  తొలిదశ చర్యల్లో భాగంగా ఒక్కో ప్రత్యేక బృందానికి 8 స్ట్రెచ్‌లు అప్పగించారు. ఒక్కో స్ట్రెచ్‌ పొడవు దాదాపు 3 కి.మీ.మొత్తం 48 స్ట్రెచ్‌ల్లో వెరసి దాదాపు 127 కి.మీ.ల మేర తొలగింపు స్పెషల్‌ డ్రైవ్‌ శనివారం నుంచి మూడురోజుల పాటు చేపట్టనున్నారు. తొలగించాల్సిన నిర్మాణాలు 4133 ఉన్నట్లు గుర్తించారు.

ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో తొలగింపుచర్యలు ఈ స్ట్రెచ్‌లలో
ప్రత్యేక బృందం– 1  
చాదర్‌ఘాట్‌ – రామ్‌కోఠి
ఆంధ్రాబ్యాంక్‌– ఆబిడ్స్‌
అఫ్జల్‌గంజ్‌– ఎంజే మార్కెట్‌
ఖైరతాబాద్‌– అమీర్‌పేట,  అమీర్‌పేట–సనత్‌నగర్‌ బ్రిడ్జి  
అమీర్‌పేట– బేగంపేట
మెహదీపట్నం–టోలిచౌకి  
షాదన్‌కాలేజ్‌– పెన్షన్‌ హౌస్‌

ప్రత్యేకబృందం–2  
మలక్‌పేట టవర్‌– దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌డిపో రోడ్‌
దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌డిపో రోడ్‌– చైతన్యపురి
చైతన్యపురి– ఓమ్ని హాస్పిటల్‌
ఓమ్ని హాస్పిటల్‌– ఎన్టీఆర్‌ నగర్‌
ఎన్టీఆర్‌ నగర్‌– ఎల్‌బీనగర్‌
ఎల్‌బీనగర్‌ – నాగోల్‌
కర్మన్‌ఘాట్‌ – సంతోష్‌నగర్‌

ప్రత్యేకబృందం–3  
ఐడీఏ బొల్లారం క్రాస్‌రోడ్‌– ఆల్విన్‌క్రాస్‌రోడ్, మియాపూర్‌
ఆల్విన్‌క్రాస్‌రోడ్, మియాపూర్‌– బాచుపల్లి
నిజాంపేట్‌ క్రాస్‌రోడ్‌– హెచ్‌టీలైన్‌ రోడ్‌
నిజాంపేట్‌ క్రాస్‌రోడ్‌–కేపీహెచ్‌బీ  
జేఎన్‌టీయూ కాలేజ్‌–ఫోరమ్‌మాల్‌
కేపీహెచ్‌బీ 1ఫేజ్‌ – కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం
మోతినగర్‌ క్రాస్‌రోడ్‌– బోరబండ
బోరబండ – మోతినగర్‌ క్రాస్‌రోడ్స్‌

ప్రత్యేకబృందం–4  
ప్యారడైజ్‌– క్లాక్‌టవర్‌
రేతిఫైలి బస్టాప్‌ – గురుద్వారా
 రాణిగంజ్‌– రసూల్‌పురా జంక్షన్‌
ప్యారడైజ్‌ హోటల్‌– మినిస్టర్‌ రోడ్‌
సంగీత్‌జంక్షన్‌ – రైల్‌నిలయం
తార్నాక జంక్షన్‌– లాలాపేట ఫ్లై ఓవర్‌  
అంబేద్కర్‌ విగ్రహం– శాంతినగర్‌
పద్మానగర్‌ పార్కు చుట్టూ
రాణిగంజ్‌ జంక్షన్‌– బైబిల్‌ హౌస్‌

ప్రత్యేక బృందం– 5
లిబర్టీ జంక్షన్‌ – నారాయణగూడ సిగ్నల్‌
నారాయణగూడ సిగ్నల్‌ జంక్షన్‌– న్యూబోయిగూడ జంక్షన్‌
హిందీమహావిద్యాలయ– బర్కత్‌పురా సిగ్నల్‌
చేనెంబర్‌ జంక్షన్‌ గోల్నాక క్రాస్‌రోడ్‌– కాచిగూడ జంక్షన్‌ ట్రాఫిక్‌స్టేషన్‌
టూరిస్ట్‌హోటల్‌– కాచిగూడ జంక్షన్‌
ఆబిడ్స్‌– కాచిగూడ
 రామకృష్ణామ – హిందీమహావిద్యాలయ
విద్యానగర్‌ క్రాస్‌రోడ్‌– చే నెంబర్‌ రోడ్‌

ప్రత్యేక బృందం–6
టోలిచౌకి– నారాయణమ్మ కాలేజ్‌
 నారాయణమ్మ కాలేజ్‌– హెచ్‌సీయూ
హెచ్‌సీయూ – గచ్చిబౌలి ఎఫ్‌ఓబీ
గచ్చిబౌలి ఎఫ్‌ఓబీ– కొత్తగూడ క్రాస్‌రోడ్‌
కొత్తగూడ క్రాస్‌రోడ్‌–మియాపూర్‌
మియాపూర్‌– బీహెచ్‌ఈఎల్‌
కావూరిహిల్స్‌–కొత్తగూడ క్రాస్‌రోడ్‌
హెటెక్‌సిటీ సిగ్నల్‌– విప్రోసర్కిల్‌(ఐఎస్‌బీ)

మరిన్ని వార్తలు