క్లిక్‌ కొట్టు.. వాట్సాప్‌ పెట్టు!

12 Jun, 2020 11:19 IST|Sakshi

రోడ్డుపై గుంత కనిపిస్తే ఫోన్‌ చేయండి

24 గంటల్లోగా సమస్యను పరిష్కరిస్తాం   

మ్యాన్‌హోల్‌ మూతలైతే 6 గంటల్లోనే..

709 కి.మీ ప్రధాన రహదారుల మార్గాల్లో..

ప్రధాన కూడళ్లలో ఏజెన్సీ ఫోన్‌ నంబర్లతో బోర్డులు

వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రధాన సమస్యల్లో అగ్రస్థానంలో ఉండేవి రోడ్లే. వర్షాకాలం రావడంతో ఈ సమస్యలు మరింత పెరగనున్నాయి. వీటికి తక్షణ పరిష్కారాలు చూపేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. గ్రేటర్‌ ప్రధాన రహదారుల మార్గాల్లోని రోడ్ల నిర్వహణ బాధ్యతల్ని ఐదేళ్లపాటు కాంట్రాక్టు ఏజెన్సీలకిచ్చిన నేపథ్యంలో ఒప్పందం మేరకు వాటి మార్గాల్లో రోడ్ల నిర్మాణాలతో పాటు మరమ్మతుల బాధ్యత వాటిదే. రోడ్లు ఎల్లవేళలా సాఫీ ప్రయాణానికి అనువుగా ఉండాలి. రోడ్లు దెబ్బతిన్నా, గుంతలు ఏర్పడినా ఇతరత్రా సమస్యలను పరిష్కరించే బాధ్యత వాటిదే.

ప్రజల నుంచి అందే ఫిర్యాదులనుపరిష్కరించాల్సిన బాధ్యత కూడా వాటిదే. వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆయా ఏజెన్సీలు ఫోన్‌/వాట్సాప్‌ నంబర్లను అందుబాటులోకి అందుబాటులోకి తెచ్చాయి. ప్రజలు తమకు కనిపించిన సమస్యను ఫోన్‌ చేసి చెప్పవచ్చు. ఫొటోతీసి వాట్సాప్‌ ద్వారా కూడా పంపించవచ్చు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా పరిష్కరించాలి. లేని పక్షంలో సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీకి జీహెచ్‌ఎంసీ పెనాల్టీ విధిస్తుంది. మ్యాన్‌హోల్‌ కవర్, క్యాచ్‌పిట్‌ కవర్‌ వంటి స్వల్ప సమస్యల్ని 6 గంటల్లోనే పరిష్కరించాలి. మీడియన్, ఫుట్‌పాత్‌ల మరమ్మతుల వంటి పనులైతే 48 గంటల్లో,  పెద్ద ప్యాచ్‌లు 72 గంటల్లో పూర్తిచేయాలి. కాంటాక్ట్‌ ఏజెన్సీలు ముఖ్య కూడళ్లలో సైన్‌బోర్డులపై ఫోన్, వాట్సాప్‌ నంబర్‌లను ప్రదర్శించాలి. 

ప్రజలకు ఇబ్బంది లేకుండా..
కాంట్రాక్టు ఒప్పందం మేరకు ఆయా మార్గాల్లో రోడ్ల నిర్వహణ మొత్తం ఏజెన్సీలదే. నిర్ణీత వ్యవధుల్లో ప్రజల సమస్యలుపరిష్కరించకుంటే పెనాల్టీలు విధిస్తాం. ఏ కాంట్రాక్టు ఏజెన్సీకి చెందిన మార్గాల్లోని ముఖ్య
కూడళ్లలో ఆ ఏజెన్సీ ఫోన్‌/వాట్సప్‌నంబర్‌తో సైన్‌బోర్డులు వెంటనే ఏర్పాటు చేస్తుంది. ప్రజలు ప్రధాన రహదారుల మార్గాల్లో తమ ప్రయాణానికి ఎదురయ్యే ఏ సమస్యనైనా ఫిర్యాదు చేయవచ్చు. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌ 040– 21 11 11 11 కు కూడా ఫోన్‌ చేయొచ్చు. – జియావుద్దీన్,చీఫ్‌ ఇంజినీర్,జీహెచ్‌ఎంసీ 

మరిన్ని వార్తలు