కలర్‌ఫుల్‌ లుక్‌

25 Nov, 2017 03:17 IST|Sakshi

రోడ్లు.. ఫుట్‌పాత్‌.. టాయిలెట్స్‌.. అన్నీ స్పెషలే..

జీఈఎస్‌ కోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక పనులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు.. ఇవాంకా ట్రంప్‌.. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా ఈ పదాలే వినిపిస్తున్నాయి. జీఈఎస్‌ కోసం వచ్చే అతిథులను ఆకట్టుకునేందుకు చేపట్టిన అభివృద్ధి పనులు, ఇవాంకా కోసం చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్ల గురించే ఏ నలుగురు పోగైనా చర్చలు సాగుతున్నాయి. సదస్సు జరిగే హైటెక్స్‌లో, అతిథులు పర్యటించే మార్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి అంతా అబ్బో అనుకుంటున్నారు.

ఆయా మార్గాల్లో రహదారులు, ఫుట్‌పాత్‌లు, లేన్‌ మార్కింగ్‌ పనులు, పచ్చదనం, అద్భుతమైన విద్యుత్‌ దీపకాంతులు, రహదారుల వెంబడి గోడలకు, ఫ్లై ఓవర్లకు రంగుల హంగులు ఇలా వేటికవే ప్రత్యేకత కనబరుస్తున్నాయి. కొత్త సాంకేతిక విధానాలతో.. పైలట్‌ ప్రాజెక్టులుగా చేట్టాలనుకున్న పనులకు సైతం ఇప్పుడు జీఈఎస్‌ లక్ష్యంగా అధికారులు ముందుకువెళుతున్నారు. వేటికవే స్పెషాలిటీగా చేపట్టిన పనుల్లో కొన్ని..


మైక్రో సర్ఫేసింగ్‌ రోడ్డు..
రోడ్డు స్వల్పంగా దెబ్బతిన్నప్పుడు, రీకార్పెటింగ్‌ చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మైక్రో సర్ఫేసింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఆ పద్ధతిలో పనిచేయలేదు. పదేపదే కోటింగ్‌లు, రీకార్పెటింగ్‌లతో రోడ్ల మందం పెరుగుతోంది. అందువల్ల సన్ననిపొర లాంటి మైక్రో సర్ఫేసింగ్‌ రోడ్డును జీఈఎస్‌ కోసం వేస్తున్నారు.

హైటెక్స్‌ దగ్గర మినీ చార్మినార్‌ నుంచి న్యాక్‌ వరకు 1.4 కి.మీ. రోడ్డుకు మైక్రో సర్ఫేసింగ్‌ చేశారు. ఇందుకు రూ.50 లక్షలు ఖర్చయింది. బీటీతోపోలిస్తే ఖర్చు దాదాపు సగమే. పైగా రెండు, మూడేళ్ల వరకు మన్నిక ఉంటుంది. మైక్రో సర్ఫేసింగ్‌ రోడ్‌ వల్ల రోడ్డు ఎత్తు పెరగదు. పైగా వాహనాలు రయ్యిన దూసుకుపోవచ్చు. దీని ఫలితాన్ని బట్టి మున్ముందు వివిధ ప్రాంతాల్లో మైక్రో సర్ఫేసింగ్‌ పనులు చేపట్టనున్నారు.

‘రోడ్‌ బౌన్స్‌’ టెక్నాలజీ..
ఇక రోడ్‌ బౌన్స్‌ టెక్నాలజీతో రోడ్డు ఎంతమేర దెబ్బతిందో తెలుసుకోవచ్చు. వాహనంలో అమర్చే ప్రత్యేక సెన్సర్ల ద్వారా రోడ్డు దెబ్బతిన్న ప్రాంతాన్ని, నీరు నిలిచే ప్రాంతాల్ని, జర్కులిచ్చే ప్రదేశాల్ని గుర్తించవచ్చు. దీనిని మొబైల్‌ యాప్‌ ద్వారా, ఆన్‌లైన్‌లోనూ తెలుసుకోవచ్చు. తద్వారా రోడ్డు ఎంత మేర దెబ్బతింది.. రీకార్పెటింగ్‌ చేయాలా.. లేక ప్యాచ్‌ వర్క్‌ చేయాలా? అనేది తెలుసుకోవచ్చు. డిజిటల్‌ టెక్నాలజీ వల్ల కచ్చితత్వం ఉంటుంది.

ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా రోడ్డు పూర్తిగా పాడయ్యేంత వరకు ఆగకుండా మరమ్మతులు చేపట్టడంతో దాదాపు 50 శాతం మరమ్మతు ఖర్చులు తగ్గనున్నాయి. ఈ టెక్నాలజీతో సైబరాబాద్‌లో 100 కి.మీ.ల మేర పైలట్‌ ప్రాజెక్టుగా పనులు చేయాలనుకున్నారు. ఈలోపే జీఈఎస్‌ రావడంతో శిల్పారామం, కొత్తగూడ, ఆదిత్య బొటానికల్‌ గార్డెన్‌ తదితర ప్రాంతాల్లో సర్వే చేసి దానికి అనుగుణంగా మరమ్మతులు చేపట్టారు.

గ్రీన్‌ టాయిలెట్స్‌..
ఒకవైపు రాత్రుళ్లు విద్యుత్‌ ఖర్చు లేకుండా.. మరోవైపు ఎరువుకు ఉపయోగపడేలా రూపొందించినవే గ్రీన్‌ టాయిలెట్స్‌. 12 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో కూడిన సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటుతో విద్యుత్‌ ఖర్చు కాదు. టాయిలెట్ల దిగువన కంపోస్ట్‌ పిట్స్‌ ఏర్పాటు చేయడం వల్ల ఎరువుకు పనికొస్తాయి. యూనిట్‌ తుప్పు పట్టకుండా, పాడు కాకుండా స్టీల్‌ తలుపులు ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత. పాలి యురేథిన్‌ అనే ఫైబర్‌తో చేసిన ఇవి పాడుకావు. నగరంలో పైలట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయాలని భావించినా... జీఈఎస్‌ నేపథ్యంలో హైటెక్‌సిటీ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేశారు.

నడక మార్గాల్లో అరుగులు..
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో రోడ్ల వెంబడి ఫుట్‌పాత్‌లను మార్చారు. కేబీఆర్‌ పార్కు నుంచి జూబ్లీ చెక్‌పోస్టు మార్గంలో నడుస్తూ అలసిపోయే వృద్ధులు కూర్చునేందుకు వీలుగా అరుగుల వంటివి ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు