భలే చాన్స్‌

30 Aug, 2019 12:58 IST|Sakshi

ఫలితాన్నిస్తున్న జీహెచ్‌ఎంసీ కృషి

ఏడాదిలోనే 323 టీడీఆర్‌ సర్టిఫికెట్లు

ఖజానాపై తగ్గిన రూ.200 కోట్ల భారం  

ప్రాజెక్టుల భూసేకరణకు ఉత్తమ మార్గం  

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఎస్సార్‌డీపీ వంటి ప్రాజెక్టుల పనులకు అవసరమైన ఆస్తుల/భూసేకరణకు ‘టీడీఆర్‌ సర్టిఫికెట్లు’ తీసుకునేందుకు ముందుకొస్తున్న వారు పెరుగుతున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీకి ఆర్థిక భారం తగ్గుతోంది.   ఎస్సార్‌డీపీలో భాగంగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లు, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు ఎన్నో ఆస్తులు సేకరించాల్సి వస్తోంది. ఇప్పటికే పనులు ప్రారంభమై పురోగతిలో ఉన్న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45, బయో డైవర్సిటీ జంక్షన్, ఎల్‌బీనగర్‌ ఒవైసీ జంక్షన్లలోనే వందల ఆస్తులు సేకరించాల్సి ఉంది. వాటన్నింటికీ పరిహారంగా నగదు చెల్లిస్తే.. ప్రాజెక్టులకు ఎంత వ్యయమవుతుందో నష్ట పరిహారాలకు అంతకంటే ఎక్కువ వ్యయమయ్యే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా అమలులో ఉన్నప్పటికీ ఆస్తులు కోల్పోయే యజమానులు పెద్దగా ఉపయోగించుకోని టీడీఆర్‌(ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌) గురించి టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఏడాదిన్నరగా విస్తృత ప్రచారంతో పాటు తగిన అవగాహన కల్పిస్తోంది. దీంతో ఈ హక్కును వినియోగించుకునేవారు క్రమేపీ పెరుగుతున్నారు. దశాబ్దకాలంగా జీహెచ్‌ఎంసీ జారీ చేసిన టీడీఆర్‌ సర్టిఫికెట్లు 115 మాత్రమే కాగా, ఈ ఏడాది లోనే 323 టీడీఆర్‌ సర్టిఫికెట్లు జారీ చేశారు. 

టీడీఆర్‌ ప్రయోజనమిలా..
ప్రాజెక్టులకు అవసరమైన ఆస్తులు, భూసేకరణ చేసినప్పుడు నష్టపరిహారంగా నగదు చెల్లించడం తెలిసిందే. దాని బదులు భూములు కోల్పోయేవారికి వారు కోల్పోయే ప్లాట్‌ ఏరియాకు నాలుగు రెట్లు(400 శాతం) బిల్టప్‌ ఏరియాతో మరో స్థలంలో నిర్మాణం చేసుకునేందుకు హక్కు కల్పించే పత్రమే టీడీఆర్‌ సర్టిఫికెట్‌. ఈ సర్టిఫికెట్‌తో హక్కుదారులు 400 శాతం బిల్టప్‌ ఏరియాతో నిర్మాణాలు చేసుకోవచ్చు. లేదా తమకున్న ఈ హక్కు సర్టిఫికెట్‌ను బిల్డర్లకు అమ్ముకోవచ్చు. ఈ హక్కు పొందేవారు భవన నిర్మాణ నిబంధనల మేరకు ఆయా ప్రాంతాల్లో అనుమతించే అంతస్తుల కంటే అదనంగా మరో అంతస్తును కూడా నిర్మించుకోవచ్చు. బహుళ అంతస్తుల్లో (18 మీటర్ల ఎత్తుకు మించిన భవనాల్లో) అయితే రెండు అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎస్సార్‌డీపీ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణకు దాదాపు రూ.200 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చే ఆస్తులను ఇలా టీడీఆర్‌ సర్టిఫికెట్లు జారీ చేసి జీహెచ్‌ఎంసీ సమకూర్చుకుంది. 

మరిన్ని వార్తలు