ఫ్రీ ట్యాంకర్‌ కట్‌!

21 Dec, 2019 09:02 IST|Sakshi

ఈ నెలాఖరు వరకే ఉచితం

స్పష్టం చేసిన జీహెచ్‌ఎంసీ

సాక్షి,సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఉచిత నీటి సరఫరానుజీహెచ్‌ఎంసీ డిసెంబర్‌ 31 నుంచినిలిపివేయనుంది. శివార్లలోని ఎల్‌బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి,మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, కాప్రా, పటాన్‌చెరు తదితర సర్కిళ్ల పరిధిలో జీహెచ్‌ఎంసీ రోజుకు దాదాపు 350 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. జలమండలి ద్వారా ట్యాంకర్లను పంపిస్తూ వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ భరిస్తోంది. గతంలో శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా లైన్లు లేనప్పుడు అమల్లోకి తెచ్చిన  ఈ విధానం.. అక్కడ నీటి సరఫరా లైన్లు వచ్చాక కూడా నీటి సరఫరా సదుపాయం లేని కొన్ని ప్రాంతాలు,
విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు,మురికివాడల్లోని ప్రజల అవసరాలు తీర్చేందుకు కొనసాగిస్తున్నారు. ఖర్చు జీహెచ్‌ఎంసీ భరిస్తూ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అయితే, వీటిలో చాలా వరకు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఒకరి పేరు చెప్పి, మరొకరికి విక్రయించుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఉచిత సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జీహెచ్‌ఎంసీ, జలమండలి సెప్టెంబర్‌లోనే నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబర్‌ నెలాఖరు నుంచే ఉచిత ట్యాంకర్లను నిలిపివేయాలనుకున్నా స్థానిక కార్పొరేటర్ల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో, ముందస్తు సమాచారం లేకుండా వెంటనే ఎలా నిలిపివేస్తారనే ప్రశ్నలతో మూడు నెలలు గడువిచ్చి, ఈ నెలాఖరుకు నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ జలమండలి ఎండీ దానకిశోర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం శివారు ప్రాంతాలతో పాటు ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు జలమండలి నీటిని సరఫరా చేస్తోంది. ఎక్కడైనా సరఫరా జరగని ప్రాంతాలుంటే ట్యాంకర్ల ద్వారా సరఫరా బాధ్యతల్ని సైతం జలమండలే చూసుకుంటుందని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ జియావుద్దీన్‌ స్పష్టం చేశారు.  

‘‘ఉచిత ట్యాంకర్ల పేరిట నిధులను స్థానిక కార్పొరేటర్లు, కొందరు అధికారులు కుమ్మక్కై కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఉచిత ట్యాంకర్ల నీటిని హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు తదితర వ్యాపార సంస్థలకు విక్రయించుకుంటున్నారని, తిరగని ట్రిప్పులకు కూడా బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జలమండలి దాదాపు రూ.1900 కోట్ల భారీ నిధులతో పూర్తి చేసిన ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటైందని, స్లమ్స్, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, సరఫరా లేని ప్రాంతాల పేరిట నెలనెలా నిధులు కొల్లగొడుతున్నారనే ఆరోపణలతో జీహెచ్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.’’ 

మరిన్ని వార్తలు