ట్విట్టర్‌కే పట్టం!

28 Jul, 2018 11:32 IST|Sakshi

జీహెచ్‌ఎంసీలో పెరిగిన వినియోగం

ఫిర్యాదుల పరిష్కారంలోనూ ప్రాధాన్యం

మంత్రి కేటీఆర్, కమిషనర్‌ కంటే ట్విట్టర్‌ ద్వారానే త్వరితంగా పరిష్కారం

సాక్షి, సిటీబ్యూరో: ట్విట్టర్‌..జీహెచ్‌ఎంసీలో ఇప్పుడు ప్రతి అధికారి నోట వెలువడుతున్న మాట ఇది. ఏదైనా పని జరిగిందంటే.. ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో పెట్టావా..? అంటూ కిందిస్థాయి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. దీని కంతటికీ కారణం మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌తోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌ను ఎక్కువగా వినియోగించడం. అంతేకాదు చేసిన ప్రతిపనినీ ట్విట్టర్‌లో ఉంచాలని అర్వింద్‌కుమార్‌ ఇటీవల అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా.. ఏ స్వల్ప పనిచేసినా ఫొటోలతో సహా అప్‌లోడ్‌ చేస్తున్నారు. మేయర్, కమిషనర్‌  నుంచి అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లదీ అదే తీరు. ఏదైనా పనికి శంకుస్థాపన చేసినా, రోడ్డుమీది గుంత పూడ్చినా మరుక్షణమే ట్విట్టర్‌లో కనబడేట్టు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ బాటిళ్లలో నీటిని వాడొద్దంటూ మంత్రి నుంచి సూచన అందిన వెంటనే.. ‘మేంమానేశాం సార్‌..’ అని చెప్పేందుకు ఒక అడిషనల్‌ కమిషనర్‌ తాను గాజు గ్లాసులో నీరు తీసుకుంటున్న దృశ్యాన్ని సైతం అప్‌లోడ్‌ చేశారంటేట్విట్టర్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అంచనా వేసుకోవచ్చు. 

ఫిర్యాదుల పరిష్కారానికీ..
మరోవైపు.. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ట్విట్టర్‌కు పెద్దపీట వేస్తున్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు రోడ్డుపై చెత్త కనబడ్డా, వేలాడే కరెంట్‌ తీగలు ఎదురైనా, నడిచే దారి లేకున్నా, రాజకీయ ఫ్లెక్సీలు కనబడ్డా, గల్లీల్లో నీటి నిల్వలున్నా ప్రతి సమస్యనూ ఫొటోలతో ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేస్తే వెంటనే పరిష్కారమవుతుందనే నమ్మకానికి వచ్చారు. అందుకు తగ్గట్లుగానే సంబంధిత అధికారులు సైతం ట్విట్టర్‌లో వచ్చే సమస్యలపై తక్షణం స్పందిస్తున్నారు. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ ఫిర్యాదు నెంబర్‌ 090718131586. టీమ్‌ జీహెచ్‌ఎంసీ మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఫోన్‌నెంబర్, చిరునామా తెలియజేయండి’ అంటూ  వెంటనే ప్రతిస్పందిస్తున్నారు.  ట్విట్టర్‌ను మంత్రితో పాటు ఉన్నతాధికారులందరూ చూస్తారు కనుక సత్వరం ఇలా స్పందిస్తున్నారు. ఫిర్యాదులను  ట్విట్టర్‌లో జీహెచ్‌ఎంసీ ఖాతాతో పాటు మంత్రి, మేయర్, కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల ఖాతాలకూ పంపుతుండటంతో.. వెంటనే పరిష్కార చర్యలకు సిద్ధమవుతున్నారు. మిగతా వేదికల ద్వారా వచ్చే ఫిర్యాదుల్ని నెమ్మదిగా పరిష్కరించినా ఫర్వాలేదు కానీ ట్విట్టర్‌వి మాత్రం ఆపవద్దనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు.  ఈనేపథ్యంలో ప్రజావాణి ద్వారా, కమిషనర్‌ కార్యాలయం ద్వారా అందే ఫిర్యాదుల కంటే ట్విట్టర్‌ ద్వారా అందేవాటికి  ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు స్వయంగా మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ నిర్వహిస్తున్న  ‘మన నగరం’ కార్యక్రమంలో ప్రజలు ఆయనకు స్వయంగా అందజేసిన  ఫిర్యాదులకంటే కూడా ట్విట్టర్‌వే ఎక్కువ శాతం పరిష్కారమయ్యాయి.  

ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఈనెల 24 వరకు అందిన ఫిర్యాదులు, పరిష్కారం  ఇలా..  పరిష్కారం కాకున్నా.. ఇదిలా ఉండగా, మరోవైపు సమస్యను పరిష్కరించకుండానే పరిష్కారమైనట్లు పేర్కొంటున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పై వేదికలతో పాటు ఇతరత్రా మార్గాలు, వేదికల ద్వారా వెరసి మొత్తం మే 17 నుంచి జూలై 25వ తేదీ వరకు జీహెచ్‌ఎంసీకి  మొత్తం 45,940 ఫిర్యాదులందగా, వాటిల్లో కేవలం 5,067 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, మిగతా 40,873 పరిష్కారమైనట్లు పేర్కొన్నారు. వారిలో 38,560 మందిని మీ సమస్య పరిష్కారమైందా.. అని ఐటీ విభాగం ఫీడ్‌బ్యాక్‌ స్వీకరిస్తే 16,817 మంది కాలేదని బదులిచ్చారు. అంటే దాదాపు 44 శాతం సమస్యలు పరిష్కారం కాకుండానే అయినట్లు పేర్కొన్నారు. సదరు ఫిర్యాదుల్ని తిరిగి ఓపెన్‌ చేశారు. ట్విట్టర్‌ ద్వారా అయితే ఐటీ విభాగం ఫీడ్‌బ్యాక్‌ స్వీకరించకముందే తమ సమస్య పరిష్కారం కాలేదని వెంటనే ప్రతిస్పందించే వీలుండటంతో  ఇటీవలి కాలంలో ట్విట్టర్‌ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ట్విట్టర్‌ వినియోగించని వారి నుంచి మైజీహెచ్‌ఎంసీ యాప్, కాల్‌సెంటర్, వెబ్‌సైట్‌ల ద్వారాఅత్యధిక పిర్యాదులందాయి. వీటిని వినియోగించుకోలేని, నేరుగా అధికారులను కలిసి స్వయంగా గోడు వెళ్లబోసుకునే సాధారణ పౌరుల సమస్యల పరిష్కారంలోనే ఎక్కువ జాప్యం జరుగుతోంది.

ఏ వేదిక ద్వారా    ఫిర్యాదులు   పెండింగ్‌  పరిష్కారం     శాతం
ట్విట్టర్‌               570              120    450        78.95
ప్రజావాణి           150               75      75         50.00
మన నగరం        341              125    216       63.34
కమిషనర్‌ పేషీ     71                 29     42         59.15

మరిన్ని వార్తలు