ఇప్పుడు గుర్తొచ్చాయ్‌

27 Mar, 2019 07:41 IST|Sakshi

అక్రమంగా సెల్‌టవర్ల ఏర్పాటు  

ఆస్తి పన్నుకు ఆమడ దూరం  

బకాయిలే రూ.15 కోట్లు  

ఆర్థిక పరిస్థితి దిగజారడంతో దృష్టిసారించిన బల్దియా

రెండేళ్ల క్రితమే అనధికార సెల్‌టవర్లు 3,303

సాక్షి, సిటీబ్యూరో: సాధారణ ప్రజలు అనుమతి లేకుండా ఇల్లు కట్టుకుంటే హడావుడి చేసి కూల్చేసే జీహెచ్‌ఎంసీ అధికారులు... అక్రమంగా సెల్‌టవర్లు ఏర్పాటు చేసి అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న నిర్వాహకులను మాత్రం ఏమనడం లేదు. సామాన్యులు ఆస్తి పన్ను చెల్లించకుంటే జరిమానాలతో సహా వసూల్‌ చేసే అధికారులు... దీర్ఘకాలంగా సెల్‌టవర్ల ఏజెన్సీలు పన్ను చెల్లించకున్నా పట్టించుకోవడం లేదు. ఓవైపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడం... 

మరోవైపు జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో వివిధ ఆదాయ మార్గాలపై దృష్టిసారించిన బల్దియా అధికారులకు ఇప్పుడు సెల్‌టవర్లు గుర్తొచ్చాయి. దాదాపు రూ.15 కోట్ల మేర ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని గుర్తించిన అధికారులు వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అనుమతి పొందిన ఏజెన్సీల నుంచి రావాల్సిన ఈ ఆస్తి పన్నును లెక్కేసిన అధికారులు... అనధికార టవర్లను గురించి మాత్రం పట్టించుకున్నట్లు లేదు. సెల్‌టవర్‌ ఏర్పాటు చేసిన ఏజెన్సీలు వన్‌టైమ్‌ ఫీజు కింద రూ.లక్ష చెల్లించడంతో పాటు ప్రతి ఏటా టవర్‌ను ఏర్పాటు చేసిన ప్రాంతం, స్థల విస్తీర్ణాన్ని బట్టి ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలా కంపెనీలు అసలు వన్‌టైమ్‌ ఫీజు కూడా చెల్లించలేదని సమాచారం.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అనధికారికంగా 3,303 సెల్‌టవర్లు ఏర్పాటు చేసినట్లు దాదాపు రెండేళ్ల క్రితమే గుర్తించిన అధికారులు... వాటి ద్వారా రూ.33 కోట్లకు పైగా రావాల్సి ఉందని లెక్కలేశారు. ఇవికాక ఆస్తి పన్ను రూపేణా అప్పట్లోనే దాదాపు రూ.20 కోట్లు రావాల్సి ఉందని అంచనా వేశారు. వెరసి మొత్తం దాదాపు రూ.50 కోట్లకు పైగా రావాల్సి ఉందని అంచనా వేసినప్పటికీ... ఇంతవరకు ఎంత వసూలైందో మాత్రం వెల్లడించలేదు.తాజాగా సెల్‌టవర్ల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు చెల్లించాల్సిన ఆస్తి పన్ను దాదాపు రూ.15 కోట్లు వెంటనే కట్టాలని కమిషనర్‌ ఆదేశించారు. లేని పక్షంలో నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

స్పష్టత కరువు...  
2013లో జారీ చేసిన జీవో ప్రకారం విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఆస్పత్రులు తదితర ప్రదేశాలకు 100 మీటర్లలోపు సెల్‌టవర్ల ఏర్పాటు నిషిద్ధం. అందుకనుగుణంగా జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందాకే  సెల్‌టవర్‌ను ఏర్పాటు చేయాలి. 2015లో జారీ చేసిన జీవో మేరకు సెల్‌టవర్‌ను ఏర్పాటు చేశాక సమాచారమిస్తే సరిపోతుంది. దీన్ని ఆసరాగా చేసుకొని సమాచారమే ఇవ్వకుండా 3,303 సెల్‌టవర్లు ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ 2017లో పేర్కొంది. వీటిలో ఎంతమంది నిర్వాహకులు ఫీజులు చెల్లించారో? లేక మాఫీ చేశారో? తెలియదు. ఆ తర్వాత కొత్తగా అనధికారికంగా ఇంకా ఎన్ని వెలిశాయో? ఎన్ని అనుమతులు తీసుకొని ఏర్పాటు చేశారో? అధికారులకే తెలియాలి.

అధికారుల లెక్క ప్రకారం ఆయా ఏజెన్సీలు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు ఇవీ... 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు