సరికొత్తగా..

11 Jan, 2020 08:57 IST|Sakshi
అధికారులతో మాట్లాడుతున్న లోకేష్‌కుమార్‌

ప్రైవేట్‌ స్థలాల్లో మల్టీ లెవల్‌ పార్కింగ్‌  

వాణిజ్య ప్రాంతాల్లో ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ చర్యలు

టెక్నాలజీ పార్టనర్స్‌గా నైపుణ్యమున్న ఏజెన్సీలు

అంతర్జాతీయ స్థాయిలో టెండర్ల ఆహ్వానం  వంద ప్రాంతాల్లోఏర్పాటు లక్ష్యం  

సాక్షి,సిటీబ్యూరో: వాణిజ్య ప్రాంతాల్లోకొత్త తరహా ప్రైవేట్‌ పార్కింగ్‌ ఏర్పాట్లకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. గతంలో ప్రైవేట్‌ స్థలాల్లో పార్కింగ్‌ లాట్ల ఏర్పాటు ప్రయత్నం వికటించడంతో ఇప్పుడుమల్టీ లెవల్‌ పార్కింగ్‌ ఏర్పాటుకుప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులోనైపుణ్యం గల సంస్థలను టెక్నాలజీపార్టనర్‌గా తీసుకోనున్నారు. అందుకు అనువుగా తగిన సామర్థ్యం, అనుభవం, నైపుణ్యం గల సంస్థల జాబితా రూపొందించి అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు íపిలుస్తారు. ఎంపికైన సంస్థల యజమానులతో వాణిజ్య ప్రాంతాల్లోనిఖాళీ స్థలాల్లో మల్టీ లెవల్‌ పార్కింగ్‌కు ఒప్పందం చేసుకుంటారు. రెడీమేడ్‌గా మల్టీ లెవల్‌ పార్కింగ్‌ ఏర్పాట్లు చేయడంతో పాటు పార్కింగ్‌ ఫీజులు ఎంత వసూలు చేయాలనేది ఆయా ప్రాంతాల్లోని డిమాండ్‌ను బట్టి నిర్ణయిస్తారు. అందులో టెక్నికల్‌ పార్టనర్‌కు ఎంత వాటా.. ఏరకంగా పంపకం వంటివన్నీ ప్లాట్‌ యజమాని, టెక్నికల్‌ పార్టనరే చూసుకుంటారు. అందులో జీహెచ్‌ఎంసీకి ఎలాంటి సంబంధం ఉండదు.

పార్కింగ్‌ సమస్యనుఅధిగమించేందుకు..  
స్థలం యాజమాన్య హక్కుల పరిశీలన, నిర్మాణానికి అనుమతి వంటివి జీహెచ్‌ఎంసీ వైపునుంచి ఉంటాయి. మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ ఏర్పాట్లకు ముందుకొచ్చే వారికి ఆస్తి పన్ను, వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్, సెట్‌బ్యాక్‌లు వంటి వాటిలో కొన్ని మినహాయింపులిచ్చే ఆలోచన ఉంది. నగరంలో తీవ్రమవుతున్న పార్కింగ్‌ సమస్యను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ ఇందుకు సిద్ధమైంది. గ్రేటర్‌ పరిధిలో వంద మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మల్టీ లెవల్‌ పార్కింగ్‌ సిస్టంకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను పది రోజుల్లో రూపొందించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ సంబంధిత అధికారులకు సూచించారు.

శుక్రవారం ఈ అంశంపై సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. దేశంలోని పుణె, ముంబై, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల్లోని మల్టీ లెవల్‌ పార్కింగ్‌ విధానాలను అధ్యయనం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాల్లోని విధానాలను ఆన్‌లైన్‌ ద్వారా సేకరించాలన్నారు. మల్టీ లెవల్‌ పార్కింగ్‌కు ఆసక్తి కనబరిచే స్థల యజమానులతో టెక్నాలజీ పార్టనర్‌ను అనుసంధానించడమే జీహెచ్‌ఎంసీ కర్తవ్యమన్నారు. కువైట్‌కు చెందిన కేజీఎల్‌ ఏజెన్సీ నుంచి మల్టీ లెవల్‌ పార్కింగ్‌ నిబంధనలను తెప్పించుకోవాలని సూచించారు. పార్కింగ్‌ నిర్మాణాలు ప్రీ అసెంబుల్డ్‌గా ఉంటాయని, భూయజమాని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తన స్థలాన్ని కోరుకున్న విధంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వీటిపై ఆసక్తి గల భూ యజమానుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నియమ నిబంధనల అమలును జీహెచ్‌ఎంసీ మానిటరింగ్‌ చేస్తుందని వివరించారు. మల్టీ లెవల్‌ పార్కింగ్‌ ప్రాంతాలు, పార్కింగ్‌కు స్థల లభ్యత వంటి వివరాలు వాహనదారులకు తెలిసేలా మొబైల్‌ పార్కింగ్‌ యాప్‌ను జీహెచ్‌ఎంసీ రూపొందిస్తుంది. అవసరమైతే ఈ యాప్‌ నిర్వహణను గూగుల్‌ లాంటి ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగిస్తారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ  చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఎస్‌.దేవేందర్‌రెడ్డి, అడిషనల్‌ కమిషనర్లు జె.శంకరయ్య, ఎన్‌.యాదగిరిరావు, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎల్‌.ఎస్‌. చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

‘‘మల్టీ లెవల్‌ పార్కింగ్‌ నిర్మాణాలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటికి ఎందరు ముందుకొస్తారన్నది అంతుబట్టడం లేదు. గతంలో ప్రైవేట్‌ స్థలాల్లో పార్కింగ్‌ లాట్ల ఏర్పాటుకు ఎంతో డిమాండ్‌ ఉంటుందని భావించినా, కేవలం మూడు దరఖాస్తులే వచ్చాయి. మల్టీ లెవల్‌ పార్కింగ్‌కు ఒక కారు పట్టేందుకు చేసే ఏర్పాట్లకు దాదాపు రూ.3 లక్షలు ఖర్చవుతుందని అంచనా. మల్టీ లెవల్‌ పార్కింగ్‌లో దాదాపు ఇరవై కార్లుపట్టే  ఏర్పాట్లు చేసినా రూ. 60 లక్షలు ఖర్చవుతుంది. నగరంలో మైక్రోసాఫ్ట్, ఐకియా, జీవీకే, సిటీసెంట్రల్‌ వంటి కొన్ని సంస్థలు తమ అవసరార్థం మల్టీ లెవల్‌ పార్కింగ్‌ ఏర్పాట్లు చేసుకున్నాయి. పబ్లిక్‌ పార్కింగ్‌ కోసం ప్రభుత్వ శాఖలకు చెందిన ఇరవై స్థలాల్లో మల్టీ లెవల్‌ పార్కింగ్‌ ఏర్పాట్లకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు  బాధ్యతలు అప్పగించి ఎంతో కాలమైనా అమలు సాధ్యం కాలేదు.’’

మరిన్ని వార్తలు