హైటెక్‌ బాబూ.. ఓటే జవాబు

30 Oct, 2018 09:19 IST|Sakshi

గ్రేటర్‌లో పెరగని ఓటింగ్‌

గతంలో 58 శాతం మించని పోలింగ్‌

చైతన్యం కోసం ప్రత్యేక యాప్‌లు  

అందుబాటులోకి తెచ్చిన జీహెచ్‌ఎంసీ

సాక్షి,సిటీబ్యూరో: అక్షరాస్యత.. చైతన్యం అధికంగా ఉండే మహానగరంలోని ప్రజలు ఓటు వేసేందుకు వెనుకే ఉంటున్నట్టు గత అనుభవాలు చెబుతున్నాయి. కారణమేదైనా గానీ గతంలో పలు మార్లు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రస్థాయి సగటుతో పోలిస్తే పోలింగ్‌ శాతం గ్రేటర్‌ పరిధిలో తక్కువగా నమోదవడం పట్ల ప్రజాస్వామ్యవాదులు, మేధావులు కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లుగా మారిన మెజార్టీ హైటెక్‌ సిటీజన్లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు బల్దియా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఒక్కరూ ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉండకుండా ఈసారి పరిస్థితిలో సమూలంగా మార్పు తీసుకొచ్చేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక యాప్‌లను సిద్ధం చేశారు. గ్రేటర్‌లో సుమారు 24 నియోజకవర్గాల పరిధిలో 77 లక్షల మందికి పైగా ఓటర్లుగా నమోదయ్యారు.

వీరిలో ఓటుహక్కు వినియోగించుకునేవారు మాత్రం 60 శాతం లోపేనని గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, బల్దియా ఎన్నికలు నిరూపించాయి. పోలింగ్‌ జరిగే రోజును సెలవుదినంగా భావిస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, మార్కెటింగ్‌ తదితర అసంఘటిత రంగాల ఉద్యోగులు,వేతనజీవులు పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకొని సమాజంలో మార్పును తీసుకొచ్చే గురుతర బాధ్యతను విస్మరిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఈ సారి ఓటర్లలో చైతన్యం నింపి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జీహెచ్‌ఎంసీ పలు యాప్‌లను, చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 

అనుభవ పాఠాలు నేర్చుకోవాల్సిందే
గ్రేటర్‌ పరిధిలో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 58 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 72 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటే.. మహానగరంలో మాత్రం కేవలం 53 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తేలింది. అంటే రాష్ట్ర స్థాయి సగటు కంటే గ్రేటర్‌లో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక 2009లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 42 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 2016లో జరిగిన బల్దియా ఎన్నికల్లో 46 శాతం మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకోవడం గమనార్హం. 

ఓటు హక్కుపై చైతన్యం పెరగాల్సిందే..  
ఓటరు చైతన్యం పెంచడం, ఓటుహక్కును వినియోగించుకునే విషయంలో ప్రధాన రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఎన్నికల కమిషన్‌ అధికారులు నగర వ్యాప్తంగా విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ఇటీవల శ్రీకారం చుట్టారు. నూతనంగా ఓటర్లుగా నమోదు చేసే విషయంలో వివిధ రాజకీయ పార్టీలు క్రియాశీలంగా వ్యవహరించి వయోజనులను ఓటర్లుగా నమోదు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశాయి. అయితే, ఓటర్లుగా నమోదైన వారు పోలింగ్‌ జరిగే డిసెంబరు 7న విధిగా తమ ఓటే వేసేలా చూడాలని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు. అవినీతి, బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం, కండబలం, ధనబలం వంటి అవలక్షణాలను సమాజం నుంచి పారదోలేందుకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని మెజార్టీ గ్రేటర్‌ సిటీజన్లు వినియోగించుకోవాలని కోరుతున్నారు.

ఓటర్లలో చైతన్యం నింపే చర్యలివీ..
వాదాయాప్‌: అంధులు, వృద్ధులు, గర్భిణులు రద్దీగా ఉండే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును తమకు వీలైన సమయంలో వినియోగించుకునేందుకు వారికి అనువైన స్లాట్‌ను ఈ యాప్‌ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. వీరికి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీలుగా వారికి పోలింగ్‌ సిబ్బంది సహకరిస్తారు.  
మై జీహెచ్‌ఎంసీ యాప్‌: గ్రేటర్‌ పరిధిలో ఓటర్లు ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా లేదా.. తెలుసుకోవడంతో పాటు ఏ పోలింగ్‌బూత్‌లో తాము ఓటుహక్కు వినియోగించుకోవాలి.. ఆ బూత్‌కు తాను ఎలా వెళ్లాలన్న అంశాలు ఈ యాప్‌లో పొందుపరిచారు.

నమూనా పోలింగ్‌ కేంద్రాలు: జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల పరిధిలో నమూనా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిద్వారా నూతనంగా ఓటర్లుగా నమోదైన వారు తమ ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలో.. వీవీప్యాట్‌ యంత్రాల పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు.
సి–విజిల్‌(సిటిజన్‌ విజిల్‌): ఎన్నికల అక్రమాలు, వివిధ పార్టీల అభ్యర్థులు, క్యాడర్‌ చేసే అక్రమాలను ఎన్నికల సంఘం, బల్దియా దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఫొటోలు, వీడియోలను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు అక్రమార్కులపై చర్యలుతథ్యం.
సువిధ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అవసరమైన సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు