ఓట్లు పడాల్సిందే

30 Nov, 2018 09:28 IST|Sakshi

పోలింగ్‌ శాతం పెంపుపై జీహెచ్‌ఎంసీ దృష్టి

దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు  

పోలింగ్‌ సరళి పరిశీలనకు కంట్రోల్‌ రూమ్‌

ఉచిత రవాణాకు వాహనాలు, వలంటీర్ల సేవలు  

సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో నగరం నుంచి ఎక్కువ పోలింగ్‌ శాతం పెంచేందుకు జీహెచ్‌ఎంసీ కృషి చేస్తోంది. డిసెంబర్‌ 7వ తేదీన జరిగే పోలింగ్‌లో దివ్యాంగ ఓటర్లు అందరూ ఓటు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌ స్లిప్పుల పంపిణీ మొదలు.. వారు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి, ఓటు వేసి తిరిగి ఇళ్లకు చేరే  దాకా అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించింది. వారికి ఎలాంటి సదుపాయాలు కావాలో తెలియజేసేందుకు ఇప్పటికే ‘వాదా’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. పోలింగ్‌ రోజున దివ్యాంగుల పోలింగ్‌ సరళి ఎలా ఉందో పరిశీలించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ సైతం అధికారులు ఏర్పాటు చేయనున్నారు. దాని ద్వారా ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది పోలింగ్‌కు వెళ్లారో ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నారు. వారిని పోలింగ్‌ కేంద్రాలకు చేర్చడానికి నియోజకవర్గానికి రెండు పెద్ద వాహనాలతో పాటు అవసరాలకు అనుగుణంగా ఆటోల వంటివి సైతం అందుబాటులో ఉంచనున్నారు. ఇలా మొత్తం 150–170 వాహనాలను వికలాంగుల రవాణా కోసం వినియోగించనున్నారు. దాదాపు 20 పోలింగ్‌ కేంద్రాలకు ఒక పెద్ద వాహనాన్ని అందుబాటులో ఉంచుతారు.

ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ప్రతి రెండు గంటలకో స్లాట్‌గా విభజించి, ఏ స్లాట్‌లో ఏ రూట్‌లో ఎంతమంది పోలింగ్‌కు వెళ్లాలనుకుంటున్నారో తెలుసుకొని అందుకు అనుగుణంగా వాహన సదుపాయం కల్పించనున్నారు. ఆ మేరకు వారికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం పంపనున్నారు. వాహనాలపై ప్రత్యేకంగా దివ్యాంగుల వాహనాలని తెలిసేలా రాయడంతో పాటు వాటిల్లో వలంటీర్లను కూడా ఉంచనున్నారు. ప్రత్యేక టోపీ, టీషర్ట్‌తో ఉండే ఈ సహాయకులు.. దివ్యాంగులు వాహనం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు తగిన సహకారం అందిస్తారు. దివ్యాంగులకు కల్పించే సదుపాయాల పర్యవేక్షణకు బీఎల్‌ఓలపై సూపర్‌వైజర్లు, వారిపై నోడల్‌ ఆఫీసర్‌ ఉంటారు. నగరంలో పెన్షన్లు పొందుతున్న దివ్యాంగులు దాదాపు 18 వేల మంది ఉండగా, పెన్షన్లు తీసుకోని వారు కూడా గణనీయంగానే ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఎన్నికల సంఘం నినాదమైన ‘అందుబాటులో పోలింగ్‌’ను అందరికీ చేరువ చేసేందుకు దివ్యాంగుల కోసం ఈ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు