ఈ చెత్త బండ్లతో స్వచ్ఛ నగరమెలా?

15 May, 2019 08:37 IST|Sakshi

కాలం చెల్లిన ట్రక్కులతో నెట్టుకొస్తున్న బల్దియా

పై మూతలు లేకుండానే చెత్త రవాణా

రోడ్ల నిండా పరుచుకుంటున్న చెత్త

ప్రజల కళ్లలోనూ పడుతున్న వ్యర్థాలు

సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం వైపు వివిధ అభివృద్ధి పథకాలతోముందుకెళ్తున్న బల్దియా చెత్త తరలింపు వాహనాల విషయంలో మాత్రం తగిన శ్రద్ధ చూపడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స్వచ్ఛ నగరం కోసం చెత్తను వేరు చేయడం, బహిరంగ వీధుల్లో వేయకపోవడం వంటి వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు, వివిధ వర్గాలతో సమావేశాలునిర్వహిస్తున్నప్పటికీ నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి చెత్తను తరలించే వాహనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసే విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో కాలం చెల్లిన  వాహనాలతో, కనీసం పైకప్పు వంటివి లేకుండానే చెత్తను తరలిస్తుండటంతో ఆ వాహనాలు ప్రయాణించిన మేర రోడ్లపై వ్యర్థాలు పడుతున్నాయి. ప్రజల కళ్లల్లోనూ వ్యర్థాలుపడుతున్నాయి. 

అవి వెదజల్లే దుర్గంధంతో ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఊడ్చిన రహదారులపై సదరు చెత్త పడుతూ పోవడంతో రోడ్లు చెత్తమయంగా మారుతున్నాయి. ఘనవ్యర్థాల నిర్వహణ నిబంధనల మేరకు చెత్తను తరలించే వాహనాల్లో  చెత్త బయటకు కనిపించకుండా అన్ని వైపులా మూసివేసి ఉండాలి. తద్వారా దుర్గంధం వెలువడకుండా ఉండటంతోపాటు వ్యర్థాలు కింద పడవు. జీహెచ్‌ఎంసీ వీటి గురించి పట్టించుకోవడం లేదు. ఏళ్లనాటి పాత డొక్కు వాహనాలనే నేటికీ వాడుతుండటంతో వాటి నిర్వహణ వ్యయం తడిసి మోపెడు అవుతుండటంతోపాటు స్వచ్ఛ నగరం సాధనకూ విఘాతంగా పరిణమిస్తోంది. 

అన్నింటిదీ అదే దారి..
జీహెచ్‌ఎంసీలో చెత్తను తరలించే వాహనాల్లో 25 టన్నుల సామర్ధ్యం కలిగిన పెద్దవి  దాదాపుగా జీహెచ్‌ఎంసీవి 50, అద్దెకు నడిపిస్తున్నవి 100 ఉన్నాయి. 10 టన్నులు, 6 టన్నుల మేర సామర్ధ్యమున్నవి దాదాపు 140 ఉండగా వీటిల్లో 90 వరకు అద్దెవే. డంపర్‌ప్లేసర్లు జీహెచ్‌ఎంసీవి, అద్దెవి కలిసి దాదాపు 150 వరకున్నాయి. ఈ చెత్త తరలించే వాహనాలన్నీ జీహెచ్‌ఎంసీవి, ప్రైవేటువి కూడా నిబంధనల మేరకు చెత్తను తరలించడం లేవు. ఇంటింటి నుంచి చెత్త స్వచ్ఛ ఆటో టిప్పర్ల ద్వారా సమీపంలోని చెత్త రవాణా కేంద్రాలకు చేరుతుండగా, అక్కడి నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. దాదాపు 30 కి.మీ.ల మేర చెత్తను తరలించే ఈ వాహనాలు ప్రయాణించిన మేర రహదారులు చెత్తమయంగా మారుతున్నాయి.

డొక్కు వాహనాలు కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఏ పార్ట్‌ ఎప్పుడు ఊడి పడుతుందో తెలియని వాహనాలున్నాయి. చెత్త తరలించే వాహనాలకు చెత్తను కప్పే పైమూతలు లేకపోవడంతో పైన కప్పేందుకు కవర్‌ల కోసం ఏటా దాదాపు రూ. 15 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ వాహనాలన్నింటికీ క్రమేపీ తొలగిస్తామని దాదాపు రెండేళ్ల క్రితం ప్రకటించి, 37 మాత్రం ఆర్‌ఎఫ్‌సీ వాహనాలు కొనుగోలు చేశారు. తిరిగి ఆ తర్వాత మళ్లీ కొనలేదు. దేశంలోని వివిధ నగరాల్లో చెత్త తరలించేందుకు ఆధునిక వాహనాలను వినియోగిస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల అమలు కోసం చెత్త తరలించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఈ వాహనాల్లో వేసే చెత్త బయటకు కనిపించకుండా ఉండటమే కాకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు పార్టిషన్‌ కూడా ఉంటుంది. ఆ వాహనాలతో నిర్వహణవ్యయం తక్కువే కాక ఇంధనం కూడా ఆదా అవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు