చీపుర్లకు స్వస్తి.. రోడ్లకు సుస్తీ..

10 Jul, 2015 18:40 IST|Sakshi
చీపుర్లకు స్వస్తి.. రోడ్లకు సుస్తీ..

బంజారాహిల్స్ (హైదరాబాద్) :  జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె శుక్రవారం నాటికి ఐదవ రోజుకు చేరింది. కార్మికులు చీపుర్లకు స్వస్తి పలకడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. టన్నులకొద్దీ చెత్త డంపర్‌ బిన్ల వద్ద నిండిపోయి రోడ్లను ఆక్రమిస్తోంది. గాలికి చెత్తంతా కొట్టుకొచ్చి ఇళ్లను కూడా ముంచెత్తుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమ్మె పరిష్కార దిశగా ముందుకు సాగకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. జీహెచ్‌ఎంసీ సర్కిల్ -10 పరిధిలో శుక్రవారం ఒక్కో నోడల్ అధికారి పరిధికి ఒక లారీని కేటాయించినట్లు అధికారులు పేర్కొంటున్నా ఇది అమలు కాకపోవడంతో చెత్త సమస్య తీరలేదు.

దీంతో వ్యాధులు విజృంభిస్తాయేమోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. అంటువ్యాధులు ప్రబలకముందే అధికారులు మేల్కొనాల్సిన అవసరం ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అత్యధికంగా చెత్తకుప్పలు పేరుకుపోగా ప్రధాన రహదారులకు రెండువైపులా లారీలకొద్దీ చెత్త కనిపిస్తుండటంతో వీవీఐపీలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతమంతా అధ్వాన్నంగా మారింది.

మరిన్ని వార్తలు