‘చెత్త’ మోత అద్దె వాత

13 Jun, 2019 08:31 IST|Sakshi

జీహెచ్‌ఎంసీకి సమస్యగా మారిన చెత్త తరలింపు

చెత్త తరలించే అద్దె వాహనాలకు భారీగా చెల్లింపులు

ఐదేళ్లలో రూ.642 కోట్ల వ్యయం

తగిన ఫలితమివ్వని తడి–పొడి ఉద్యమం

కచ్చితంగా వేరు చేస్తే తప్పనున్న ఖర్చు

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీకి చెత్త తరలింపు మహా భారంగా మారింది. చెత్త తరలింపు పనుల కోసం అవసరమైన వాహనాల అద్దెలకే ప్రస్తుతం ఏటా దాదాపు రూ.180 కోట్లు వ్యయమవుతోంది. తడి–పొడి చెత్త గురించి దాదాపు నాలుగేళ్లుగా ప్రచారం చేస్తున్నా, ఇంటింటికీ రెండు రంగుల చెత్త డబ్బాలు పంపిణీ చేసినా ప్రజల్లో మార్పు రాలేదు. అదే వచ్చి ఉంటే జీహెచ్‌ఎంసీ చెత్త రవాణా భారం ఎంతో తగ్గేది. ప్రజలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం వల్ల జీహెచ్‌ఎంసీకి చెత్త తరలింపు భారం పెరుగుతోంది. గడచిన ఐదేళ్ల వివరాలను పరిశీలిస్తే గుండె గుభిల్లు మంటుంది. చెత్త తరలించేందుకు అవసరమైన అద్దె వాహనాలకే  దాదాపు రూ.642 కోట్లు ఖర్చయింది. ఇందులో రూ.75 కోట్లు మాత్రం జీహెచ్‌ఎంసీ సొంత వాహనాల మరమ్మతుల కోసం ఖర్చు చేశారు. ఇక జీహెచ్‌ఎంసీ సొంత వాహనాలు, వాటి నిర్వహణ వ్యయం, ఇంధన వ్యయం అదనం. తడి–పొడి చెత్తను వేరు చేయడం దగ్గరనుంచి పెద్దమొత్తాల్లో చెత్తను వేరు చేసే హోటళ్లు వంటివి ఎక్కడికక్కడే తడిచెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేయడం వంటి నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తే ఈ ఖర్చు తగ్గేది. కానీ జీహెచ్‌ఎంసీ ఆ పని చేయలేకపోయింది. ఐదేళ్లలో నగరంలో పెరిగిన జనాభా, కాలనీలతోపాటు గతంలో రెండు మూడు రోజులకు ఒకమారు తరలించే చెత్తను ప్రస్తుతం ప్రతిరోజూ తరలిస్తుండటం తదితరమైన వాటి వల్ల రవాణా భారం పెరగడం సహజమే అయినప్పటికీ, స్వచ్ఛ నగరం అమలులో భాగంగా తడి–పొడి చెత్తను ఎక్కడికక్కడే వేరు చేసి సేంద్రియ ఎరువు తయారీ చర్యలు పటిష్టంగా అమలు చేస్తే పొడి చెత్త మాత్రమే డంపింగ్‌ యార్డు వరకు తరలిస్తే సరిపోయేది. కానీ నేటికీ ఆ పని జరగడం లేదు. దీంతో చెత్త రవాణా భారం పెరుగుతోంది.

ఇళ్ల వద్దే తడి–పొడి చెత్తను వేరు చేసేందుకని నాలుగేళ్లనుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకుగాను 43 లక్షల రెండు రంగుల చెత్త డబ్బాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేసింది. దీనికి తోడు చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు పెరిగాయి. ఇళ్లవద్ద, ట్రాన్స్‌ఫర్‌స్టేషన్ల వద్ద కూడా పకడ్బందీగా తడి–పొడి వేరు చర్యలు అమలైతే రవాణా భారం తగ్గేది.  
ఇళ్ల వద్దే తడి–పొడి చెత్తవేరు చేసి తరలించేందుకని 2500 స్వచ్ఛ ఆటో టిప్పర్లు కొనుగోలు చేశారు. కానీ..అవి కూడా తడి–పొడి చెత్తను వేర్వేరుగా తీసుకెళ్లకుండా, రెంటినీ కలిపే తీసుకువెళ్తున్నాయి. తడి–పొడి వేరుగా తీసుకువెళితే ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి కేవలం పొడిచెత్తనే డంపింగ్‌యార్డుకు పంపేందుకు వీలుంటుంది.  
మరో వైపు రవాణా పేరిట సర్కిళ్లు, జోన్లలో అద్దె వాహనాల పేరిట అవకతవకలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షణ లేమి, జోనల్, సర్కిళ్లకే అధికారాన్ని బదలాయించడం, తదితర చర్యల వల్ల కూడా దుబారా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. అవసరం లేని ప్రాంతాల్లో కూడా అద్దె వాహనాలు వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  

అవకతవకలు తగ్గితే..ఖర్చు తగ్గుతుంది
ఏటికేడు పెరిగే జనాభాతో పాటు చెత్త కూడా పెరుగుతుంది. అయితే అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా ఉంటే వాహనాల నిర్వహణ, అద్దెల భారం తగ్గే వీలుంది. ఐదేళ్లలో దాదాపు రూ.100 కోట్ల పెంపు అంటే ఆలోచించాల్సిన అంశమే.– పద్మనాభరెడ్డి (ఫోరం ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌)

మరిన్ని వార్తలు