ట్రాక్‌ బాగుంటే గిఫ్ట్‌

14 Nov, 2019 02:53 IST|Sakshi

ట్రాఫిక్‌ నిబంధనలు పక్కా పాటిస్తే..

మెక్‌ డొనాల్డ్స్‌ గిఫ్ట్‌ కూపన్, ఒక పువ్వు కానుక 

వినూత్న కార్యక్రమానికి ట్రాఫిక్‌ పోలీసుల శ్రీకారం 

నెలకు 300 మందికి చొప్పున ఆరు నెలల పాటు కూపన్లు 

కంట్రోల్‌ రూమ్‌ వద్ద ప్రారంభించిన పోలీస్‌ కమిషనర్‌ 

బుధవారం ఉదయం 11.30.. అసెంబ్లీ సమీపంలోని కంట్రోల్‌రూమ్‌ చౌరస్తా...ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి నగర పోలీసు కమిషనర్‌.. అటుగా బైక్‌పై వచ్చిన వాహనచోదకుడిని ఆపారు. రోడ్డు ట్రాఫిక్‌ నిబంధనలకు సంబంధించి అతని ‘ట్రాక్‌’ రికార్డును పరిశీలించారు. గతంలో, ప్రస్తుతం ఎలాంటి ఉల్లంఘనలు లేకపోవడంతో అతనికి మెక్‌ డొనాల్డ్స్‌ గిఫ్ట్‌ కూపన్, ఓ పువ్వు అందచేశారు. 

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిని ‘దారి’కి తెచ్చేందుకు ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు, చార్జ్‌షీట్లు, కౌన్సెలింగ్‌ వంటివి నిర్వహిస్తున్నారు. మరి, పక్కాగా నిబంధనలు పాటించే వారిని ఎందుకు ప్రోత్సహించకూడదనే ఆలోచనతో నగర ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ కొన్నాళ్లుగా ఉత్తమ డ్రైవర్లకు సినిమా కూపన్లు అందిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో ఇప్పుడు మెక్‌ డొనాల్డ్స్‌ సంస్థ సాయంతో రూ.250 విలువైన గిఫ్ట్‌ కూపన్లను నెలకు 300 మందికి చొప్పున ఆరు నెలల పాటు అందించనున్నారు. బుధవారం నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి రోజు 25 మంది వాహనచోదకులకు గిఫ్ట్‌ కూపన్లు, పువ్వులు అందించారు. 

గిఫ్ట్‌ కొట్టాలంటే.. క్లీన్‌ రికార్డు ఉండాలి
- మెక్‌డొనాల్డ్స్‌ గిఫ్ట్‌ కూపన్‌ గెల్చుకోవాలంటే వాహనచోదకుడు గతంలో, తనిఖీ సమయంలో పక్కాగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి ఉండాలి.  
- హెల్మెట్‌ పెట్టుకుని వస్తున్న ద్విచక్ర వాహనచోదకులు, సీట్‌బెల్ట్‌ ధరించిన తేలికపాటి వాహనాల డ్రైవర్లను ట్రాఫిక్‌ పోలీసులు ఆపుతారు.
వాహనచోదకుల వద్ద ఉండాల్సిన ధ్రువీకరణలు తనిఖీ చేసి ఆపై గతంలో ఎప్పుడైనా చలానా చెల్లించారా? అనేది ట్యాబ్‌ ద్వారా పరిశీలిస్తారు (ఈ ట్యాబ్‌లో.. ఉల్లంఘనుల జాబితా డేటాబేస్‌ మొత్తం అనుసంధానమై ఉంటుంది). 
- ప్రస్తుతం ట్రాఫిక్‌ నిబంధనలు పక్కాగా పాటిస్తూ, గతంలోనూ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని వారిని ఎంపిక చేసి, అక్కడికక్కడే మెక్‌ డొనాల్డ్స్‌ గిఫ్ట్‌కూపన్, పువ్వు అందజేస్తారు. ఇలా ఒక్కో జోన్‌లోనూ 50 మందిని సత్కరిస్తారు. 

రోల్‌మోడల్‌గా సిటీ 
దేశంలోని మెట్రో నగరాలకు అనేక అంశాల్లో హైదరాబాద్‌ రోల్‌ మోడల్‌గా ఉంది. రహదారి భద్రత విషయంలోనూ ఈ లక్ష్యం సాధించాలి. ఇందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి. ఇలా చేస్తే ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో మార్పు కనిపిస్తుంది. మీ కుటుంబంలో, చుట్టుపక్కల ఎక్కడైనా ఉల్లంఘన మీ దృష్టికి వస్తే వెంటనే వారిని కట్టడి చేయండి. మెక్‌ డొనాల్డ్స్‌ సంస్థ పార్ట్‌నర్‌ ఆఫ్‌ రోడ్‌సేఫ్టీగా మారింది. 
- అంజనీకుమార్, సిటీ కొత్వాల్‌ 

ప్రమాదాల నియంత్రణకే.. 
నగరంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాం. ఇంకా తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. నగరాన్ని యాక్సిడెంట్‌ ఫ్రీగా మార్చాలంటే రహదారి నిబంధనలు అందరూ కచ్చితంగా పాటించాలి. ఇందుకోసం వాహన చోదకులను ప్రోత్సాహించే మరిన్ని  కార్యక్రమాలను రూపొందిస్తాం. 
- అనిల్‌కుమార్, ట్రాఫిక్‌ చీఫ్‌ 

ట్రాఫిక్‌ పోలీసుల పనితీరు అద్భుతం 
నగర ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పని చేయడం గర్వంగా ఉంది. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం అందరి సామాజిక బాధ్యత. నగరవాసులంతా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. 
- రితేష్‌కుమార్, మెక్‌ డొనాల్డ్స్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ 

ఆనందంగా ఉంది 
నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు మెక్‌ డొనాల్డ్స్‌ సంస్థతో కలిసి అందిస్తున్న తొలి కూపన్‌ అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే నగరం సేఫ్‌ సిటీ అవుతుంది. అందుకోసం అందరూ కృషి చేయాలి. 
- రవిచంద్ర, యాడ్‌ ఏజెన్సీ నిర్వాహకుడు, సైదాబాద్‌ కాలనీ  

మరిన్ని వార్తలు