చిన్నారి ప్రాణం విలువ రూ.60వేలు?

4 Jun, 2020 12:14 IST|Sakshi
భూమిక (ఫైల్‌)

వైద్యుడి నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ బంధువుల ఆరోపణ

ప్రైవేట్‌ ఆస్పత్రి ఎదుట ఆందోళన శాంతింపజేసిన పోలీసులు

మహబూబ్‌నగర్‌, నారాయణపేట: జ్వరం భారిన పడి వైద్యం కోసం వస్త  వైద్యుడి నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణం పోయిందంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా.. రూ.60వేలు అందిస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటన పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఆన్పూర్‌కు చెందిన సాబెన్న మూడేళ్ల కుమార్తె భూమిక మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జ్వరం, విరేచనాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలోని ఓ చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల వరకు బాగానే ఉంది. ఉన్నట్లుండి ఆ చిన్నారి కదలకపోవడంతో వైద్య సిబ్బందిని సంప్రదించారు. వారు వెంటనే వైద్యుడికి సమాచారం ఇవ్వగా, ఆయన వచ్చి పరీక్షించి బాలిక పరిస్థితిని గమనించి హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలిన సూచించారు. 4 నుంచి 5 గంటల మధ్యలో అంబులెన్స్‌లో హైదరాబాద్‌ బయల్దేరారు. అయితే కొంత దూరం వెళ్లాక మార్గమధ్యలోనే చిన్నారి మృతిచెందింది. దీంతో వెనుదిరిగి ఆస్పత్రికి చేరుకున్నారు. 

ప్రాణం ఖరీదు రూ. 60 వేలు?!
వైద్యుడి నిర్లక్ష్యంతోనే తమ పాప ప్రాణాలు కోల్పోయిందంటూ తల్లిదండ్రులు, కుటుంబీకులు రెండుగంటల పాటు వైద్యుడితో వాదనకు దిగారు. వారి మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి చేయిదాటే సమయంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఇరువురిని సముదాయించారు. ఆటు వైద్యుడితో.. ఇటు చిన్నారి తండ్రితో పాటు బంధువులను కూర్చోబెట్టి శాంతింపజేశారు. వైద్యుడి అందించిన చికిత్సలపై వారు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు పట్టుబట్టారు. అయితే, తనవల్ల ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని, మీరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుపెట్టుకోవచ్చని, ఏదైనా ఉంటే పోస్టుమార్టం రిపోర్టులు తెలుస్తుందని వైద్యుడు చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు కలుగజేసుకొని ఆందోళన చేస్తున్నవారిని సముదాయించి తండ్రి హన్మంతుతో పాటు మరో వ్యక్తిని వైద్యుడి వద్దకు పంపించారు. చివరకు వైద్యుడు రూ.60 వేలు చెల్లిస్తానని ఒప్పుకోవడంతో మా పాప ప్రాణామే పొయింది.. నా బిడ్డ ప్రాణం ఖరీదు రూ.60వేలా అంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్లారు. కుటుంబసభ్యులు, బంధువులు చిన్నారి మృతదేహాన్ని తీసుకొని కర్ణాటకలోని అన్పూర్‌కు వెనుదిరిగి వెళ్లిపోయారు.

మా నిర్లక్ష్యం ఏమీ లేదు

చిన్నారి మృతి చెందడంలో తమ ఆస్పత్రి నిర్లక్ష్యం ఏమీ లేదు. రాత్రి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించగా బాగానే ఉంది. తెల్లవారుజామున కదలడంలేదని చెప్పడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్‌ సదుపాయం లేకపోవడంతో వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించా. మధ్యలోనే మృతిచెందడంతో ఆస్పత్రికి వచ్చి ఆందోళన చేశారు. తమ తప్పులేదని చెప్పాం. అయినా న్యాయం చేయాలని కోరారు. అడ్మిట్, అంబులెన్స్‌ ఖర్చులు ఇచ్చేందుకు మాత్రమే ఒప్పుకున్నాం. – డాక్టర్‌ రంజిత్‌కుమార్,చిన్నపిల్లల వైద్యుడు, నారాయణపేట

ఆందోళన...వైద్యుడితో వాదన
ఉదయం 6గంటలకు చిన్నారి మృతదేహంతో సదరు ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే తమ పాప ప్రాణం పోయిందంటూ వైద్యుడితో వాదనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగిన వారిని శాంతిపజేశారు.

మరిన్ని వార్తలు