ఆడ పిల్ల వద్దమ్మా..

13 Jan, 2019 01:49 IST|Sakshi
ఐసీడీఎస్‌ అధికారులకు అడ శిశువును అప్పగిస్తున్న గిరిజన దంపతులు

బల్మూర్‌ (అచ్చంపేట): మగ సంతానం కోసం ఆ తల్లిదండ్రులు నలుగురు పిల్లలను కన్నారు.. అయితే ఐదో కాన్పులోనూ ఆడ శిశువే జన్మించడంతో వదిలించుకోవాలనుకున్నారు. ఈ మేరకు కన్న పేగు బంధాన్ని కూడా కాదనుకుని అంగన్‌వాడీ టీచర్‌కు సమాచారమిచ్చారు. అంగన్‌వాడీ సిబ్బంది ఎంత నచ్చచెప్పినా ఆ దంపతులు వినకపోవడంతో చివరకు శిశువును శిశు సంరక్షణ గృహానికి చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలంలోని బాణాల గ్రామానికి చెందిన రామావత్‌ దస్లీ–నిరంజన్‌ దంపతులకు ఇది వరకే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు.

ఇందులో ఓ కూతురు అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చిన దస్లీ శనివారం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మళ్లీ ఆడ శిశువుకే జన్మనిచ్చింది. దీంతో ఇప్పటికే ఉన్న ముగ్గురు ఆడ పిల్లలకు తోడు ఈ శిశువు భారం మోయలేమని గ్రామ అంగన్‌వాడీ టీచర్‌ అనితకు సమాచారం ఇచ్చారు. దీంతో సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చినా వారు వినలేదు. దీంతో శిశువును మహబూబ్‌నగర్‌లోని శిశు సంరక్షణ గృహం అధికారులకు అప్పగించారు.
 

మరిన్ని వార్తలు