కూల్‌డ్రింక్‌ అనుకుని..పురుగు మందు తాగింది

18 Aug, 2018 12:11 IST|Sakshi
ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి సహస్త్ర  

పాల్వంచ : కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షల చేయించుకునేందుకు తన రెండేళ్ళ కూతురుని తీసుకుని తల్లి వెళ్లింది. అక్కడ ఓ కూల్‌ డ్రింక్‌ సీసాను చూసిన ఆ చిన్నారి, దానిని చేతిలోకి తీసుకుని అందులోని ద్రవాన్ని తాగింది. అందులో ఉన్నది కూల్‌డ్రింక్‌ కాదు... పురుగు మందు. ఆ తల్లి తెలిపిన వివరాలు.. శుక్రవారం పట్టణంలోని శేఖరం బంజరకు చెందిన బోడ వెంకటేష్‌ భార్య పద్మ. ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలను చేయించుకునేందుకు రెండేళ్ల కూతురు సహస్త్రను తీసుకెళ్లింది. అక్కడ పెద్ద క్యూ ఉండటంతో నిరీక్షిస్తోంది. ఆమె ఒళ్లో నుంచి ఆ చిన్నారి కిందకు దిగి ఆడుకుంటోంది. పాఠశాల గదిలో ఓ మూలకు కూల్‌ డ్రింక్‌ సీసా కనిపించింది.

దానిని తీసుకుని, అందులోని ద్రవాన్ని తాగింది. కొద్దిసేపటికే చిన్నారి నోటి నుంచి నురగలు రావడంతో తల్లి కంగారు పడింది. బాటిల్‌లోని డ్రింక్‌ తాగిందని ఓ పాప చెప్పింది. అది పురుగు మందుగా గుర్తించిన ఆ తల్లి, వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపపత్రికి తన బిడ్డను తీసుకెళ్లింది. ఆ చిన్నారి కడుపు నుంచి మందును వైద్యులు కక్కించారు. ఆ మందును ఎండ్రోసల్పాన్‌గా గుర్తించారు. పాఠశాలలోకి పురుగుల మందు ఎలా వచ్చింది..? సీసాలో పెట్టి ఉంచినా ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని తల్లిదండ్రులు వెంకటేష్, పద్మ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రవి విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు