వైద్యురాలి నిర్లక్ష్యంతో పసికందు మృతి

2 Jan, 2015 02:53 IST|Sakshi

మంచిర్యాల టౌన్ : మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన గట్టు సంధ్య తొమ్మిది నెలల గర్భిణి. డిసెంబర్ 30వ తేదీన నొప్పులు తీవ్రం కావడంతో భర్త రాజ్‌కుమార్, తన సోదరి లావణ్యతో కలిసి ప్రసవం కోసం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అయితే.. ప్రసూతి వైద్యురాలు పద్మజ అందుబాటులో ఉండడంతో ఆమెను పరీక్షించి ప్రమాదం ఏమీ లేదని చెప్పింది. 31న (బుధవారం) రాత్రి 3 గంటల ప్రాంతంలో సంధ్యకు తిరిగి నొప్పులు తీవ్రమయ్యాయి.

దీంతో ఆమె కుటుంబ సభ్యులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు వైద్యురాలికి సమాచారం ఇచ్చినా ఆమె కనీసం ఆస్పత్రికి రాలేదు. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో వచ్చి.. ప్రసవం సాఫీగా జరగాలంటే ఆపరేషన్ చేయాలని.. అందుకు తనకు రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో చేసేదేం లేక వారు ఆమెకు రూ.4 వేలు ఇచ్చారు. అయితే.. ఆపరేషన్ చేస్తున్న సమయంలో గర్భసంచి పగిలిపోయి కడుపులోని శిశువు మృతిచెందింది. తదుపరి సంధ్యకు తీవ్ర రక్తస్రావమైంది.

శిశువు మృతిచెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వైద్యురాలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతిచెందిందని నిలదీశారు. ఈ మేరకు వైద్యురాలిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా.. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీకంఠేశ్వర్‌రావును వివరణ కోరగా డబ్బులు అడిగినట్లు ఆధారాలు లేవని, వారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని, ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అప్పటి వరకు డాక్టర్ పద్మజ డిప్యుటేషన్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు