బోరుబావి వద్ద తీవ్ర ఉద్విగ్న క్షణాలు!

24 Jun, 2017 18:19 IST|Sakshi
బోరుబావి వద్ద తీవ్ర ఉద్విగ్న క్షణాలు!

47 గంటలు గడుస్తున్నా చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది. చిన్నారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. అవి ఫలించడం లేదు. అత్యాధునిక కెమెరాను బోరుబావిలోకి పంపినా.. పాప ఆచూకీ ఇంకా చిక్కలేదు. దీంతో బోరుబావిలో పడిన చిట్టితల్లిని క్షేమంగా చూస్తామా? సమయం గడిచేకొద్ది ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఉత్కంఠ పెరిగిపోతున్నది. బోరుబావి వద్ద తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి.

కొక్కెంలాంటిది ఏర్పాటుచేసి.. బోరుబావిలో ఉన్న చిన్నారిని వెలికితీయడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చేసిన ప్రయత్నమూ విఫలమైంది. ఈ కొక్కెం వల్ల పాప బయటకు రావొచ్చునని సహాయక సిబ్బంది ఎంతగా ఆశించినా ఫలితం దక్కలేదు. దీంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వే పనిని వేగవంతం చేశారు. ప్రస్తుతం 30 అడుగుల మేర గొయ్యి తవ్వారు. 40 అడుగుల మేర గొయ్యి తవ్వి.. బోరుబావికి అనుసంధానం చేయాలని.. అప్పుడు చిన్నారిని వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 230 అడుగుల లోతులో పాప ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో పాపను వెలికితీసే ఆపరేషన్‌ చాలా కష్టతరంగా మారింది. చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామ పరిధి ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 18నెలల చిన్నారి మీనా బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే.