ఆ నిర్ణయమే కొంప ముంచింది!

25 Jun, 2017 08:13 IST|Sakshi
ఆ నిర్ణయమే కొంప ముంచింది!

మోటారు లాగడంతో మరింత లోతుకు చిన్నారి
బోరుబావిలో పడిపోయిన ‘చిన్నారి’ని రక్షించడంలో అధికారులు పొరపాటు చేశారా? పది అడుగుల లోతుల్లో చిక్కుకుపోయిన పాప జాడ కనిపించకపోవడానికి అశాస్త్రీయంగా చేసిన ప్రయత్నాలే కారణమా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు కొందరు నిపుణులు. బోరుబావిలో జారిపడిన చిన్నారి మొదట పది అడుగుల లోతుల్లోనే చిక్కుకుపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు.. బోరు మోటారును పైకి లాగితే పాప బయటకు వస్తుందని భావించారు. అనుకున్నదే తడువుగా మోటారును కొంతమేర లాగారు. అయితే లోపలి నుంచి ఏడుపు వినిపించడంతో పాపకు అపాయం జరుగుతుందని అంచనా వేసి ప్రయత్నాన్ని ఆపేశారు.

ఈ క్రమంలోనే పాప 40 అడుగుల లోతుల్లోకి జారిపోయింది. ఆ తర్వాత సంఘటనా స్థలికి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, జిల్లా యంత్రాంగం చేరుకోవడం.. సహాయక చర్యలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం బోరు మోటారును బయటకు తీస్తే.. దాంతోపాటు పాప కూడా బయటకు వస్తుందని భావించారు. మోటారును పైకి లాగే క్రమంలో బలంగా గుంజడంతో ఒక్క ఉదుటున మోటారు బయటకు వచ్చింది. కానీ దీంతో అప్పటివరకు కనిపించిన పాప కదలికలు కనుమరుగయ్యాయి. ఈ ప్రయోగమే పాపకు అపాయం తలపెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

బోరుబావి చుట్టుకొలత 40 అడుగుల వరకు తొమ్మిది అంగుళాలే ఉంది. చిన్నారి ధరించిన గౌను సైజు 8.5 అంగుళాలు. అంటే పాప ఎట్టి పరిస్థితుల్లో కిందకు జారే అవకాశం లేదని కేఎల్లార్‌ రిగ్గుల కంపెనీ అధినేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. 40 అడుగుల తర్వాత బోరుబావి చుట్టుకొలత 6.25 అంగుళాలు ఉన్నందున.. పాప మరింత లోతుకు వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 10 అడుగుల లోతుల్లో చిక్కుకున్నప్పుడే పాపను రక్షించేందుకు సమాంతర గొయ్యి తవ్వితే ఫలితం ఉండేదని, కానీ హడావుడిగా స్థానికులు చేసిన ప్రయత్నంతో పాప 40 అడుగులకు జారిపోగా.. ఆ తర్వాత మోటారును బలంగా లాగడంతో పాప ఆచూకీ కూడా లభించకుండా పోయిందని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇంజనీరింగ్‌ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.

బోరు మోటారు పైకి లాగే సమయంలోనే పాప ప్రాణానికి ముప్పు వాటిల్లి ఉండవచ్చని అన్నారు. ‘‘మోటారును బయటకు తీస్తున్నప్పుడు బోరు సైడ్‌ భాగాల్లో పాప అతుక్కుపోవచ్చు. లేదా అడుగుభాగంలో (దాదాపు 500 అడుగులు) కూరుకుపోయి ఉండొచ్చు ఏదేమైనా పాపను రక్షించే క్రమంలో కొంత సంయ మనం, సమన్వయం పాటిస్తే బాగుండేది’’అని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు