నీ వయసు చిన్నదని చెప్పినా..

3 Jul, 2017 12:03 IST|Sakshi
నీ వయసు చిన్నదని చెప్పినా..

మహబూబాబాద్‌ రూరల్‌: తన కన్నా వయసులో చిన్నవాడివని చెప్పినా ఆ యువకుడు వినలేదు. తొలుత ప్రేమ పేరుతో వేధించి మాయమాటలు చెప్పి చివరకు ఆమెను లోబరుచుకున్నాడు. అనంతరం గర్భవతిని చేసి గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత వదిలించుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి ఇప్పుడు అతడి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. మహబూబాబాద్‌ శివారులోని ఆకుల లక్ష్మయ్య కాలనీలో సోమవారం ఈ సంఘటన వెలుగు చూసింది.

స్థానికంగా నివామసముంటున్న బోడ సురేష్‌(22) అనే యువకుడు పీజీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటూ హైదరాబాద్‌లో బ్యుటీషియన్‌ కోర్సు నేర్చుకుంటున్న ఓ 23 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. తనకంటే వయసులో చిన్నవాడివని ఆమె చెప్పినా వినలేదు. చివరకు వారిద్దరి మధ్య తొలుత స్నేహం కుదిరి అనంతరం ప్రేమగా మారింది. ఇలా రెండేళ్లపాటు సాగిన వారి బంధంలో భౌతికంగా కూడా దగ్గర కావడంతో యువతి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఎవరికీ తెలియకుండా ఆస్పత్రికి తీసుకెళ్లి గర్భస్రావం చేయించాడు. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడకుండా ముఖం చాటేస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి ఇంటి ముందు దీక్షకు దిగగా మహిళా సంఘాలు ఆమెకు తమ మద్దతు తెలిపాయి.